సంక్షిప్త వార్తలు

కియా ఇండియా తమ తాజా మోడల్‌ కరెన్స్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎయిర్‌బ్యాగ్‌ నియంత్రణా సాఫ్ట్‌వేర్‌లో లోపాలున్నాయేమో తనిఖీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Updated : 05 Oct 2022 02:40 IST

44,174 కియా కరెన్స్‌ కార్ల రీకాల్‌

దిల్లీ: కియా ఇండియా తమ తాజా మోడల్‌ కరెన్స్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఎయిర్‌బ్యాగ్‌ నియంత్రణా సాఫ్ట్‌వేర్‌లో లోపాలున్నాయేమో తనిఖీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 44,174 కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ లోపాలను గుర్తిస్తే ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ సేవలు అందిస్తామని తెలిపింది. ఈ విషయంలో కరెన్స్‌ యజమానులనూ నేరుగా సంప్రదిస్తామని, కారులో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అవసరమని తమ సిబ్బంది నిర్ణయిస్తే సదరు యజమానులు కియా డీలర్‌షిప్‌ ప్రతినిధులతో సంప్రదింపుల్లో ఉండాలని సూచించింది. 6, 7 సీట్ల సామర్థ్యంతో వస్తున్న కరెన్స్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో కియా విడుదల చేసింది. 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.4 లీటర్‌ పెట్రోల్‌, 1.5 డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌లతో 3 ట్రాన్స్‌మిషన్లలో కరెన్స్‌లు రూపొందాయి.


ఎస్‌బీఐ, బీఓబీలకు ‘బీబీబీ-’ రేటింగ్‌: ఫిచ్‌


 

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లకు స్థిరమైన భవిష్యత్‌ అంచనాలతో ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ వెల్లడించింది. భారతీయ బ్యాంకుల్లో ఎస్‌బీఐకు ఎక్కువగా ప్రభుత్వ తోడ్పాటు లభిస్తుందని, బ్యాంక్‌లో ప్రభుత్వానికి 56.9 శాతం నియంత్రిత వాటా, పోటీ బ్యాంక్‌లతో పోలిస్తే విధానపరమైన నిర్ణయాధికారాలు  ఉండటం కలిసొస్తున్నట్లు తెలిపింది. 2022-23లో ఇంపెయిర్డ్‌-రుణ నిష్పత్తి మెరుగుపడటం కొనసాగవచ్చని, తాజా రుణాలు, ప్రస్తుత రికవరీలు ఇందుకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు ఫిచ్‌ పేర్కొంది. ఎస్‌బీఐ సాధారణ ఈక్విటీ టైర్‌ 1 (సీఈటీ1) నిష్పత్తిని కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారని, కనీసం ఉండాల్సిన 8.6 శాతం నిష్పత్తి కన్నా కొద్దిగా మాత్రమే ఎక్కువగా ఉండటంతో 2023, 2024ల్లో అధిక వృద్ధికి అవకాశాలు ఉన్నాయని వివరించింది. 2022-23లో ఇది దాదాపు 10 శాతంగా ఉందని, 2021-22లో కూడా ఇదే స్థాయిలో ఉందని తెలిపింది.


క్రిమి సంహారక మందుల్లోకి నాట్కో ఫార్మా

దేశీయ మార్కెట్లోకి రెండు రకాల ఉత్పత్తులు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: నాట్కో ఫార్మా క్రిమి సంహారక మందుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ తొలిసారిగా రెండు రకాలైన క్రిమి సంహారక మందులను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రకాలైన క్లోరాంత్రనిలిప్రోల్‌ (సీటీపీఆర్‌) పెస్టిసైడ్‌ ఫార్ములేటెడ్‌ కాంబినేషన్‌ మందులను అందించామని నాట్కో ఫార్మా మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఇందులో నాట్‌ఓల్‌ (క్లోరాంత్రనిలిప్రోల్‌ 8.8%+ థయామెథాగ్జామ్‌ 17.7% ఎస్‌సీ), నాట్‌లిగో ((క్లోరాంత్రనిలిప్రోల్‌ 9.3%+ లంబ్దా సైహాలోత్రిన్‌ 4.6% జడ్‌సీ)  ఉన్నాయి. ఈ మందులను అన్ని రకాలైన పంటలపై చీడపీడల నివారణకు వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ మందులను సింజెంటా అనే స్విస్‌ కంపెనీ విక్రయిస్తోంది. వీటిని అందిస్తున్న తొలి దేశీయ సంస్థ నాట్కో ఫార్మా కావడం ప్రత్యేకత. దేశంలోని రైతులకు తక్కువ ధరల్లో నాణ్యమైన క్రిమిసంహారక మందులను అందుబాటులోకి తీసుకురావటానికి తాము కట్టుబడి ఉన్నట్లు నాట్కో ఫార్మా పేర్కొంది.


ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ నుంచి ఆక్వాకల్చర్‌ హెల్త్‌  ఉత్పత్తులు

ఈనాడు, హైదరాబాద్‌: మానవ, జంతు టీకాలు- ఔషధాల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌), కొత్తగా ఆక్వాకల్చర్‌ హెల్త్‌ మార్కెట్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, రొయ్యలు-  చేపలు సాగు చేసే రైతుల కోసం ‘గౌవిట్‌ ఆక్వా’ అనే పేరుతో ఆర్గానిక్‌ మినరల్‌ మిక్సర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం రొయ్యల సాగులో మనదేశం ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. రొయ్యల సాగులో ఇతర దేశాల్లో సగటు వృద్ధి 5.6 శాతం కాగా, మన దేశంలో 11 శాతం ఉండటం గమనార్హం. భారత్‌లో ఏటా 64 లక్షల టన్నుల చేపలు, 6 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. రొయ్యల్లో.. ప్రధానంగా వైట్‌ లెగ్‌, బ్లాక్‌ టైగర్‌ రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని యూఎస్‌, వియత్నాం, కొన్ని ఐరోపా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆక్వాకల్చర్‌లో యాంటీ బయాటిక్స్‌ వినియోగాన్ని తగ్గించే దిశగా పలు రకాలైన నూతన ఉత్పత్తులు, టీకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా ఐఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. యూఎస్‌, ఐరోపా దేశాలకు రొయ్యలు, చేపలు ఎగుమతి చేయాలంటే అధిక నాణ్యతతో పాటు యాంటీ బయాటిక్స్‌ వినియోగించకూడదని పేర్కొన్నారు. దీనిపై తమ శాస్త్రవేత్తల బృందం విస్తృత స్థాయిలో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు, తద్వారా కొత్త ఉత్పత్తులు ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.


‘బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఐపీఓకు తొలి రోజే 1.69 రెట్ల స్పందన

దిల్లీ: బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు తొలి రోజే 1.69 రెట్ల స్పందన లభించింది. ఎన్‌ఎస్‌ఈ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. సంస్థ ఆఫర్‌ చేస్తున్న 6,25,00,000 షేర్లకు గాను 10,58,09,796 షేర్లకు మదుపర్లు బిడ్లు దాఖలు చేశారు. రిటైల్‌ వ్యక్తిగత మదుపర్ల (ఆర్‌ఐఐలు) విభాగం నుంచి 1.98 రెట్లు, అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగం నుంచి 1.68 రెట్లు, సంస్థాగతేతర మదుపర్ల విభాగం నుంచి 1.04 రెట్ల ఆదరణ లభించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లు సమీకరించేందుకు ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా సిద్ధమైంది. ఈ ఇష్యూ 7న ముగుస్తుంది. ఒక్కో షేరుకు ఇష్యూ ధరల శ్రేణి   రూ.56-59గా ఉంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణాల్లో 23.5% వృద్ధి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణాలు 23.5 శాతం వృద్ధి చెంది రూ.14.80 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో రుణ పుస్తకం విలువ రూ.11.98 లక్షల కోట్లుగా ఉంది. బ్యాంక్‌ అడ్వాన్సులు దాదాపు 25.8 శాతం పెరిగాయి. మొత్తం డిపాజిట్లు రూ.14.06 లక్షల కోట్ల నుంచి దాదాపు 19 శాతం అధికమై రూ.16.73 లక్షల కోట్లకు చేరాయని బ్యాంక్‌ తెలిపింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో గృహరుణ ఒప్పందం కింద డైరెక్ట్‌ అసైన్‌మెంట్‌ మార్గంలో రూ.9145 కోట్ల రుణాలను బ్యాంక్‌ కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెచ్‌డీఎఫ్‌సీలో విలీనం కానున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 2023-24 మూడో త్రైమాసికానికి ఈ విలీనం పూర్తయ్యే అవకాశం ఉంది.


సీజీ పవర్‌ కేసులో గౌతమ్‌ థాపర్‌పై 5 ఏళ్ల మార్కెట్‌ నిషేధం

దిల్లీ: సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ నిధుల అవకతవకల కేసులో కంపెనీ మాజీ ఛైర్మన్‌ గౌతమ్‌ థాపర్‌పై మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ అయిదేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో ఆయన అయిదు సంవత్సరాల వరకు మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు ఉండదు. కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ వీఆర్‌ వెంకటేశ్‌, ఇద్దరు మాజీ డైరెక్టర్లు మాధవ్‌ ఆచార్య, బి.హరిహరన్‌లపై ఆరు నెలల నుంచి మూడేళ్ల నిషేధం పడింది. ఈ కేసుకు సంబంధించి 11 సంస్థలపై మొత్తం రూ.30.15 కోట్ల జరిమానా విధించింది. కేఎన్‌ నీల్‌కాంత్‌పై రూ.10 లక్షలు, అతుల్‌ గులాటీ రూ.5 లక్షలు, ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లపై రూ.కోటి చొప్పున జరిమానా వేసింది. గౌతమ్‌ ధాపర్‌, అవంతా హోల్డింగ్స్‌, యాక్షన్‌ గ్లోబల్‌, సొలారిస్‌ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌పై అయిదేళ్ల నిషేధం విధించింది. థాపర్‌పై రూ.10 కోట్లు, మూడు ఇతర సంస్థలపై తలో రూ.5 కోట్ల జరిమానా పడింది.


25000 మొబైల్‌ టవర్లకు రూ.26,000 కోట్లు

దిల్లీ: 500 రోజుల్లో 25,000 మొబైల్‌ టవర్లను ఏర్పాటు చేయడానికి రూ.26,000 కోట్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. యూనివర్సల్‌ సర్వీసెస్‌ అబ్లిగేషన్‌ ఫండ్‌ కింద ఈ ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు లభిస్తుందని టెలికాం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ దీనిని అమలు చేస్తుంది. ‘వచ్చే 500 రోజుల్లో 25,000 కొత్త టవర్ల ఏర్పాటునకు రూ.26,000 కోట్లను టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.


యూఎస్‌లో ఉద్యోగావకాశాలు తగ్గాయ్‌

వాషింగ్టన్‌: అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, వృద్ధి నెమ్మదించడంతో అమెరికా(యూఎస్‌)లో ఉద్యోగావకాశాలు జులైతో పోలిస్తే ఆగస్టులో 10% తగ్గాయని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. జులైలో 11.2 మిలియన్ల జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉండగా, ఆగస్టులో 10.1 మిలియన్లకు తగ్గాయి. గత మార్చిలో ఇవి సుమారు 11.9 మిలియన్లుగా ఉన్నాయి. ఆగస్టులో లేఆఫ్‌లు పెరిగినా, చరిత్రాత్మకంగా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. జాబ్‌ ఓపెనింగ్స్‌ తగ్గడం కంపెనీలపై ఒత్తిడిని తగ్గిస్తుందని ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొనడం గమనార్హం.


సంక్షిప్తంగా

* ముత్తూట్‌ఫైనాన్స్‌ తన సెక్యూర్డ్‌ రీడీమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల 28వ పబ్లిక్‌ ఇష్యూను ప్రకటించింది. రూ.300 కోట్ల వరకు నిధులను సమీకరించొచ్చు. ఇష్యూ 6న ప్రారంభమై 28న ముగుస్తుంది.
* ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోచిప్‌ తయారీ కంపెనీల్లో ఒకటైన్‌ మైక్రాన్‌.. న్యూయార్క్‌లో ఒక సెమీకండక్టర్‌ ప్లాంటును 100 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.8,00,000 కోట్లు)తో ఏర్పాటు చేయవచ్చని అంచనా.
* ఒమన్‌కు చెందిన అల్‌ రిమాల్‌ మైనింగ్‌ ఎల్‌ఎల్‌సీలో 19 శాతం వాటాను టాటా స్టీల్‌ విక్రయించింది. దీంతో ఆ కంపెనీలో టాటా స్టీల్‌కున్న వాటా 70 శాతం నుంచి 51 శాతానికి పరిమితమవుతుంది.
* చెన్నైలో ఓలా తన తొలి ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మార్చి 2023 కల్లా దేశవ్యాప్తంగా 200 కేంద్రాలను తీసుకురావాలన్న ప్రణాళికలో భాగమే ఇది.
* సెప్టెంబరులో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా రూ.11 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. మొత్తం 678 కోట్ల లావాదేవీల ద్వారా ఈ మైలు రాయిని దాటినట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది. మే నెలలో రూ.10 లక్షల కోట్ల రికార్డును సాధించిన సంగతి తెలిసిందే.
* హెచ్‌ఐవీ చికిత్సలో ఉపయోగించే డారునవిర్‌ టాబ్లెట్స్‌ను అమెరికాలో విక్రయించేందుకు లుపిన్‌కు యూఎస్‌ ఎఫ్‌డీఏ నుంచి అనుమతి దక్కింది. 600 ఎంజీ, 800 ఎంజీ మోతాదుల్లో వీటిని అక్కడ అమ్మనుంది.
* ప్రైవేటు మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ ప్లాట్‌ఫాం అయిన ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ తన రూ.309 కోట్ల ఐపీఓకు ధర శ్రేణిని రూ.75-80గా నిర్ణయించింది. అక్టోబరు 10న ఇష్యూ ప్రారంభమై 12న ముగుస్తుంది.
* మూడో డిస్‌స్ట్రెస్డ్‌ అసెట్‌ ఫండ్‌ ద్వారా 1 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.8000 కోట్లు)ను సమీకరించాలని ఎడెల్‌వీజ్‌ ఆల్టర్నేటివ్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూడో స్పెషల్‌ సిచ్యువేషన్స్‌ ఫండ్‌ ద్వారా రూ.3400 కోట్లు సమీకరించింది.
* వివిధ ఎగుమతి ప్రోత్సాహక మండళ్లతో అక్టోబరు 7న వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ సమావేశం కానున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని