డిజిటల్‌ ఉద్యోగాలు కోటిని మించుతాయ్‌

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎలక్ట్రానిక్స్‌, అంకుర సంస్థలు, ఐటీ, ఐటీ-ఆధారిత సేవల విభాగాల్లో ఉద్యోగాల సంఖ్య రెండేళ్లలో కోటిని మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 01 Dec 2022 01:48 IST

ఐటీ, కమ్యూనికేషన్స్‌ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దిల్లీ: డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎలక్ట్రానిక్స్‌, అంకుర సంస్థలు, ఐటీ, ఐటీ-ఆధారిత సేవల విభాగాల్లో ఉద్యోగాల సంఖ్య రెండేళ్లలో కోటిని మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఇప్పటికే ఇవి 88-90 లక్షల ఉద్యోగాలు కల్పించాయని తెలిపారు. అంటే కొత్తగా మరో 10-12 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది.

అంకురాల కోసం ఈఎస్‌సీ-ఎస్‌టీపీఐ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి-సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో  మంత్రి మాట్లాడుతూ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఐటీ-ఐటీఈఎస్‌, అంకురాలు 3 ప్రధాన మూల స్తంభాలుగా ఉన్నాయన్నారు. ఇప్పటికే వీటి ద్వారా 88-90 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న కోటి ఉద్యోగాల లక్ష్యాన్ని రెండేళ్లలో అధిగమిస్తామని, ఇందులో ఎలాంటి సందేహం తమకు లేదని మంత్రి వెల్లడించారు. గతంలో అంకురాల కోసం కొన్ని నగరాల పేర్లే బాగా వినిపించేవని, ప్రస్తుతం గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లినా అక్కడి విద్యార్థులు భవిష్యత్‌లో అంకురాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారన్నారు. సాంకేతికతను వినియోగించుకునే దశ నుంచి, ఉత్పత్తిదారుగా భారత్‌ అవతరిస్తోందని పేర్కొన్నారు. అంకురాల కోసం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్న కార్యాలయ మౌలిక వసతుల (ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ను ఎస్‌టీపీఐ అందిస్తోందన్నారు.

2025 కల్లా 300 అంకురాలకు ఎన్‌జీఐఎస్‌ ప్రయోజనాలు: ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 64 నగరాల్లోని అంకురాలకు కల్పిస్తున్నట్లు తెలిపారు. అందులో 54 నగరాలు ద్వితీయ, తృతీయ శ్రేణివని పేర్కొన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ద్వారా అంకురాల కోసం రూ.5-10 లక్షల సీడ్‌ ఫండ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యతరం ఇంక్యుబేషన్‌ పథకం (ఎన్‌జీఐఎస్‌) కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వస్తున్న అంకురాలకు రూ.25 లక్షల ఫండ్‌ అందిస్తున్నామని వెల్లడించారు. ఎన్‌జీఐఎస్‌ ప్రయోజనాలను సుమారు 65 అంకురాలకు అందించామని, 2025 నాటికి 300 అంకుర సంస్థలకు ఈ ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు అరవింద్‌ వివరించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు