నవంబరులోనూ కార్ల జోరు

 కొవిడ్‌ పరిణామాల అనంతరం వ్యక్తిగత, కుటుంబ ప్రయాణానికి సొంత వాహనం వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, కార్ల కంపెనీలకు కలిసి వస్తోంది.

Published : 02 Dec 2022 03:40 IST

రెండంకెల వృద్ధి సాధించిన మారుతీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌

దిల్లీ:  కొవిడ్‌ పరిణామాల అనంతరం వ్యక్తిగత, కుటుంబ ప్రయాణానికి సొంత వాహనం వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, కార్ల కంపెనీలకు కలిసి వస్తోంది. అందువల్లే గతంలో ఎప్పుడూ లేనన్ని కార్ల విక్రయాలు ఈ ఏడాది  నవంబరులో నమోదయ్యాయి. సాధారణంగా పండుగల సీజన్‌లో అధిక విక్రయాలు జరిగాక, డిసెంబరు వరకు తక్కువగానే జరుగుతాయి. జనవరి నుంచి కొత్త ఏడాది మోడల్‌ రావడమే ఇందుకు కారణం. ఈసారి మాత్రం పండగల తరవాతా టోకు విక్రయాలు అధికంగా జరిగేందుకు, పెండింగ్‌ ఆర్డర్లూ కారణమయ్యాయి. దిగ్గజ వాహన సంస్థలైన మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, మహీంద్రా విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. కియా ఇండియా అత్యధికంగా 69% వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా, హోండా కార్స్‌, స్కోడా, ఎంజీ మోటార్‌ కూడా బలమైన విక్రయాలను నమోదు చేశాయి. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, నిస్సాన్‌ టోకు సరఫరాలు మాత్రం 2021 నవంబరుతో పోలిస్తే తగ్గాయి.

* మారుతీ సుజుకీ ఇండియా మొత్తం విక్రయాలు 14 శాతం పెరిగింది. దేశీయంగా టోకు సరఫరాలు 1,17,791 వాహనాల నుంచి 18 శాతం పెరిగి 1,39,306కు చేరాయి. ఇందులో చిన్న కార్లయిన ఆల్టో, ఎస్‌-ప్రెసోల విక్రయాలు 17,473 నుంచి 18,251కు చేరాయి. యుటిలిటీ వాహనాలైన బ్రెజా, ఎర్టిగా, గ్రాండ్‌ విటారాల విక్రయాలు 24,574 వాహనాల నుంచి 32,563కు పెరిగాయి.

* మొత్తం కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన కార్లు 2021 నవంబరులో 2,45,636 కాగా, గత నెలలో 31 శాతం పెరిగి 3,22,860కు చేరాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 2020 నవంబరు నాటి 2.86 లక్షల కార్ల రికార్డును ఈసారి పరిశ్రమ అధిగమించినట్లు ఆయన వెల్లడించారు. వరుసగా ఆరో నెలలోనూ 3 లక్షలకు పైగా కార్ల విక్రయాలు నమోదయ్యాయని తెలిపారు.

* జనవరి-నవంబరులో 35 లక్షల కార్లు అమ్ముడయ్యాయని.. ఇప్పటివరకు రికార్డుగా ఉన్న 2018 నాటి 33.8 లక్షల వాహనాల కంటే ఇది అధికమన్నారు. 2021తో పోలిస్తే 25% వృద్ధి నమోదైంది. ఈ నెల అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే 2022లో 38 లక్షల వాహన విక్రయాలు నమోదు కావొచ్చని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని