లాభాల జోరుకు విరామం

8 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణతో సూచీలకు నష్టాలు తప్పలేదు.

Published : 03 Dec 2022 01:42 IST

సమీక్ష

8 రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణతో సూచీలకు నష్టాలు తప్పలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 81.35 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 86.77 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసంగానే కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,978.58 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఒకదశలో 62,679.63 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 415.69 పాయింట్ల నష్టంతో 62,868.50 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 116.40 పాయింట్లు కోల్పోయి 18,696.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,639.20- 18,781.95 పాయింట్ల మధ్య కదలాడింది.

అదానీ గ్రూప్‌ టేకోవర్‌ బిడ్‌ దాఖలు చేసిన తర్వాత ఆగస్టు 23 నుంచి ఇప్పటివరకు ఎన్‌డీటీవీ షేర్లు 16 శాతం పరుగులు తీశాయి. జులై 1 నుంచి డిసెంబరు 1 మధ్య షేరు 153 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబరు 5న రూ.540.85 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. శుక్రవారం ఇంట్రాడేలో రూ.445 వద్ద గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 2.61 శాతం నష్టంతో రూ.414.40 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 డీలాపడ్డాయి. ఎం అండ్‌ ఎం 2.24%, హెచ్‌యూఎల్‌ 1.78%, మారుతీ 1.58%, నెస్లే 1.51%, హెచ్‌డీఎఫ్‌సీ 1.32%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.19%, ఇన్ఫోసిస్‌ 1.15%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.08%, టీసీఎస్‌ 1.03% చొప్పున నష్టపోయాయి. టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.22% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో విద్యుత్‌ 1.23%, వాహన 1.12%, యుటిలిటీస్‌ 1.10%, మన్నికైన వినిమయ వస్తువులు 0.46%, ఐటీ 0.41%, బ్యాంకింగ్‌ 0.32% పడ్డాయి. పరిశ్రమలు, టెలికాం, యంత్ర పరికరాలు, లోహ రాణించాయి. బీఎస్‌ఈలో 1544 షేర్లు నష్టాల్లో ముగియగా, 1948 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 129 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

యూనిపార్ట్స్‌ ఇండియా ఐపీఓ చివరి రోజు ముగిసేసరికి 25.32 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,01,37,360 షేర్లు జారీ చేయగా.. 25,66,29,175 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 67.14 రెట్లు, ఎన్‌ఐఐల నుంచి 17.86 రెట్లు, రిటైల్‌ మదుపర్ల నుంచి 4.61 రెట్ల స్పందన లభించింది.

నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ సిరీస్‌లో భాగంగా మరో సూచీని తీసుకొచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండీసెస్‌ తెలిపింది. నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌- ఏప్రిల్‌ 2033 పేరిట దీన్ని ప్రారంభించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని