మూడేళ్ల తర్వాత మళ్లీ వాహన ప్రదర్శన

భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వాహన ప్రదర్శన (ఆటో ఎక్స్‌పో)ను మూడేళ్ల విరామం తర్వాత ఈ వారంలో నిర్వహించబోతున్నారు. 11-12 తేదీల్లో పాత్రికేయులకు (ప్రెస్‌ డేస్‌) అనుమతి ఉంటుంది.

Published : 09 Jan 2023 02:34 IST

కొన్ని ప్రధాన కంపెనీలు కార్యక్రమానికి దూరం

దిల్లీ: భారత్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వాహన ప్రదర్శన (ఆటో ఎక్స్‌పో)ను మూడేళ్ల విరామం తర్వాత ఈ వారంలో నిర్వహించబోతున్నారు. 11-12 తేదీల్లో పాత్రికేయులకు (ప్రెస్‌ డేస్‌) అనుమతి ఉంటుంది. ఆ తర్వాత 13-18 తేదీల్లో సాధారణ ప్రజలు ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. గ్రేటర్‌ నోయిడాలో ఏర్పాటు చేస్తున్న వాహన ప్రదర్శనను మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్‌, ఎంజీ మోటార్‌ ఇండియాలు నడిపించబోతున్నాయి. ఇందులో 5 అంతర్జాతీయ ఆవిష్కరణలతో పాటు 75 ఉత్పత్తులను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి నిర్వహించే వాహన ప్రదర్శన వాస్తవానికి 2022లో జరగాల్సి ఉన్నా.. కొవిడ్‌ కారణాలతో ఈ ఏడాదికి వాయిదా పడింది. ఈ ప్రదర్శనకు మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్‌, నిస్సాన్‌తో పాటు విలాస కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్‌-బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడిలు కూడా హాజరు కావడం లేదని సమాచారం. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థలైన హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలు ఇథనాల్‌ పెవిలియన్‌లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ప్రొటోటైప్‌ వాహనాలను ప్రదర్శించేందుకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన అంకుర సంస్థలు, ముఖ్యంగా విద్యుత్‌ వాహన విభాగ కంపెనీలు ఈ ప్రదర్శనలో అధిక స్థాయిలో పాల్గొననున్నాయి. 46 వాహన తయారీ సంస్థలతో పాటు సుమారు 80 సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వామ్యం అవుతున్నాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్‌ వెల్లడించింది. 2020 వాహన ప్రదర్శనతో పోలిస్తే ఈసారి అధిక కంపెనీలు వాహన ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని