Amazon - Google: అమెజాన్‌, గూగుల్‌లో మరిన్ని ఉద్యోగాల కోత?

ఈ ఏడాదిలోనూ టెక్‌ సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించడం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా 586 సంస్థలు ఇప్పటివరకు 1,70,549 మందికి లేఆఫ్‌ ఇచ్చినట్లు..

Updated : 16 Apr 2023 08:18 IST

Amazon - Google | వాషింగ్టన్‌: ఈ ఏడాదిలోనూ టెక్‌ సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించడం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా 586 సంస్థలు ఇప్పటివరకు 1,70,549 మందికి లేఆఫ్‌ ఇచ్చినట్లు.. టెక్‌ కంపెనీలను పరిశీలించే లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ అనే సంస్థ తెలిపింది. తాజాగా అమెజాన్‌, గూగుల్‌ సీఈఓల ప్రకటనలు చూస్తే, ఆయా సంస్థల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పడనుందని అర్థమవుతోంది.
అమెజాన్‌ సీఈఓ ఆండీ జాస్సీ తమ కంపెనీ వాటాదార్లకు రాసిన లేఖలో ‘వనరులను ఎక్కడ వినియోగించాలనే విషయమై ప్రాధాన్యత క్రమంలో తీసుకున్న నిర్ణయం వల్లే, 27,000 మందిని తొలగించాలనే కఠిన నిర్ణయానికి దారి తీసినట్లు’ తెలిపారు. అమెజాన్‌ జనవరిలో 18,000 మందిని తొలగించింది. రెండో విడతగా మార్చిలో ప్రకటించిన మేర, మరో 9,000 మందిని ఈ నెలలో ఇంటికి పంపించింది. ఇందులో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), ట్విచ్‌, అడ్వర్టైజింగ్‌, హెచ్‌ఆర్‌ ఉద్యోగులు ఉన్నారు.‘మా వ్యయాలను క్రమబద్దీకరించుకునేందుకు కొన్ని నెలలుగా ఎన్నో మార్పులు చేశాం. చాలా నాయకత్వ బృందాల్లాగే  మా వ్యాపారాన్ని విశ్లేషించుకుంటున్నాం. సంస్థకు అనుకూలమైన వాటిని కొనసాగిస్తామ’ని ఆండీ పేర్కొన్నారు. ప్రతి విభాగాన్ని క్షుణంగా పరిశీలించి.. ఆదాయాన్ని ఆర్జించే సామర్థ్యం ఉందా,  నిర్వహణ ఆదాయం, ద్రవ్య లభ్యత, పెట్టుబడి పెట్టిన మూలధనంపై ప్రతిఫలం దీర్ఘకాలం కొనసాగేలా చూకోవడమే ధ్యేయమన్నారు. ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉందనే సంకేతాలు ఇచ్చారు.
పునఃపరిశీలన చేస్తున్నాం: వ్యయాలను శాశ్వతంగా తగ్గించుకునేందుకు, ప్రతి అవకాశాన్ని వినియోగిస్తున్నామని ఆల్ఫాబెట్‌, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మా వ్యయాలను క్రమ పద్ధతిలో తగ్గించుకునేందుకు చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంద’ని పేర్కొన్నారు. ‘మా ఉద్యోగుల్లో 12,000 మందిని తొలగించాలని నిర్ణయించాం. అమెరికాలో పని చేస్తున్న వారికి ఇప్పటికే ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం అందించాం. ఇతర దేశాల్లో తొలగింపు ప్రక్రియ నిదానంగా జరుగుతోంది. ఆయా స్థానిక చట్టాల ప్రకారం దీన్ని కొనసాగించాల్సి రావడమే దీనికి కారణమ’ని పిచాయ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని