మోసపూరిత సందేశాలు నివారిద్దాం

వినియోగదార్ల ఫోన్లకు వాణిజ్య సందేశాలు (మెసేజ్‌లు) పంపించే నిమిత్తం బ్యాంకులు, బీమా సంస్థలు, ట్రేడింగ్‌ కంపెనీలు, ఇతరత్రా వ్యాపార సంస్థలకు కేటాయించిన మెసేజ్‌ హెడర్స్‌.

Published : 26 May 2023 00:56 IST

బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ట్రాయ్‌ ఆదేశం

దిల్లీ: వినియోగదార్ల ఫోన్లకు వాణిజ్య సందేశాలు (మెసేజ్‌లు) పంపించే నిమిత్తం బ్యాంకులు, బీమా సంస్థలు, ట్రేడింగ్‌ కంపెనీలు, ఇతరత్రా వ్యాపార సంస్థలకు కేటాయించిన మెసేజ్‌ హెడర్స్‌, కంటెంట్‌ టెంప్లెట్స్‌ పరిశీలన ప్రక్రియను సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆ సంస్థలను టెలికాం నియంత్రణ ప్రాధికారిక సంస్థ (ట్రాయ్‌) ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో ఆలస్యమైతే ఆయా సంస్థల  మెసేజ్‌లు స్తంభిస్తాయని తెలిపింది. వినియోగదార్లను మోసపూరిత సందేశాల బారి నుంచి కాపాడే ఉద్దేశంతో భాగంగానే ట్రాయ్‌ ఈ చర్యలు చేపట్టింది. ఈ పరిశీలన పురోగతిపై 2 వారాల్లో సమీక్ష జరిపి, ఆ తర్వాత అవసరమైతే తగు విధంగా ఆదేశాలు జారీ చేస్తామని ట్రాయ్‌ తెలిపింది. ట్రాయ్‌ నిబంధనల ప్రకారం పైన పేర్కొన్న సంస్థలను ప్రిన్సిపల్‌ ఎంటిటీస్‌గా (పీఈ) వ్యవహరిస్తారు. వినియోగదార్లకు వాణిజ్య సందేశాలు పంపించాలంటే పీఈలకు కేటాయించిన నమోదిత హెడర్స్‌ ద్వారానే వీలవుతుంది. ఈ హెడర్‌.. అంకెలు, అక్షరాలతో (ఆల్ఫాన్యూమరిక్‌) కూడి ఉంటుంది. టెలికాం సంస్థల నుంచి కంటెంట్‌ టెంప్లెట్స్‌ను కూడా ఈ సంస్థలు పొందాల్సి ఉంటుంది. లేకుంటే అవి పంపించే మెసేజ్‌లు వినియోగదార్లకు చేరేందుకు అనుమతి ఉండదు. కొన్ని పీఈలు.. ఎక్కువ సంఖ్యలో హెడర్స్‌, కంటెంట్‌ టెంప్లెట్స్‌ను నమోదు చేసుకున్నట్లుగా ట్రాయ్‌ దృష్టికి వచ్చింది. ఇందులో కొన్నింటిని టెలిమార్కెటింగ్‌ చేసే వాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించింది. అందువల్ల దీనిని నియంత్రించే ఉద్దేశంతో అన్ని నమోదిత హెడర్స్‌, కంటెంట్‌ టెంప్లెట్స్‌ను పునఃపరిశీలించాల్సిందిగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న ట్రాయ్‌ ఆదేశించింది. పరిశీలన జరగని హెడర్స్‌, మెసేజ్‌ టెంప్లెట్స్‌ను వరుసగా 30 రోజులు, 60 రోజుల్లోగా బ్లాక్‌ చేయాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని