ఓఎన్‌జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వరంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ తన హరిత ఇంధన ప్రాజెక్టులపై 2030 కల్లా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2038 కల్లా సున్నా కర్బన స్థాయికి చేరాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 30 May 2023 02:09 IST

2038 కల్లా నికర శూన్య కర్బన స్థితి దిశగా అడుగులు

దిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ తన హరిత ఇంధన ప్రాజెక్టులపై 2030 కల్లా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2038 కల్లా సున్నా కర్బన స్థాయికి చేరాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం చేస్తున్న కృషిలో భాగంగా, ఇండియన్‌ ఆయిల్‌(ఐఓసీ), హిందుస్థాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌), గెయిల్‌, భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌) తరహాలోనే నికర సున్నా ఉద్గారాలకు ఈ కంపెనీ సైతం ప్రణాళికలు రచిస్తోంది. ‘అంతర్గత ప్రణాళికలు పూర్తయ్యాయి. 2038 కల్లా స్కోప్‌-1, స్కోప్‌-2 ఉద్గారాల విషయంలో సున్నాకు చేరగలమన్న ధీమా వచ్చింద’ని సింగ్‌ ఇక్కడ విలేకర్లతో పేర్కొన్నారు. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుదుత్పత్తిని ప్రస్తుత 189 మెగావాట్ల నుంచి 2030 కల్లా 1 గిగావాట్లకు చేర్చాలన్నతి కంపెనీ ప్రణాళిక. ఇప్పటికే రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ప్రణాళికలు చేయగా.. ఇంతే సామర్థ్యంలో ఇంకో ప్రాజెక్టునూ చేపట్టాలని అనుకుంటోంది. ఆఫ్‌షోర్‌ పవన క్షేత్రాలతో పాటు 1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో మంగళూరులో హరిత అమ్మోనియా ప్లాంటును ఏర్పాటు చేయాలనీ తలుస్తోంది. మొత్తం మీద వీటిపై రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను ఖర్చుచేయనున్నట్లు ఆయన అన్నారు.

10 కోట్ల డాలర్లలోపే రష్యాలో: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా, రష్యా బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పాశ్చాత్య దేశాల ఆంక్షల  నేపథ్యంలో.. రష్యాలో తమ డివిడెండు ఆదాయం 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.820 కోట్ల) కంటే తక్కువే స్తంభించిందని ఓఎన్‌జీసీ విదేశ్‌ ఎండీ రాజర్షి గుప్తా పేర్కొన్నారు. ఆ నిధులను సత్వరం తెప్పించేందుకు కంపెనీ ఏమీ తొందరపడడం లేదని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని