కార్వీ రిజిస్ట్రేషన్‌ రద్దు

స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల సంస్థ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) రిజిస్ట్రేషన్‌ను సెబీ రద్దు చేసింది.

Published : 01 Jun 2023 02:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల సంస్థ కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) రిజిస్ట్రేషన్‌ను సెబీ రద్దు చేసింది. క్లయింట్ల ఖాతాల్లోని నిధులను కేఎస్‌బీఎల్‌ తన ఖాతాలకు బదిలీ చేసుకుని, తర్వాత ఆ సొమ్మును తన అనుబంధ కంపెనీలకు మళ్లించి మోసానికి పాల్పడినట్లు సెబీ పేర్కొంది. క్లయింట్లకు చెందిన దాదాపు రూ.2,700 కోట్ల విలువైన షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.2,032 కోట్ల మేరకు అప్పులు చేసినట్లూ ఆరోపించింది. క్లయింట్ల సొమ్మును తిరిగి వారి ఖాతాలకు బదిలీ చేయడం కానీ, క్లయింట్ల షేర్లను తిరిగి ఇవ్వటం కానీ జరగలేదని వివరించింది. సంస్థ స్థితిగతులను తెలుసుకోవడానికి ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను నియమించగా, యాజమాన్యం సహకరించలేదని సెబీ వెల్లడించింది. కేఎస్‌బీఎల్‌ను 2020 నవంబరులోనే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ‘డిఫాల్టర్‌’ గా ప్రకటించాయి.


విద్యుత్‌ వాహనాల నిర్వహణకు మాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ వాహనాలను మరింత సులభంగా నిర్వహించేందుకు వీలుగా మొబిలిటీ యాజ్‌ ఏ సర్వీస్‌ (మాస్‌) సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఇందుకోసం జర్మనీకి చెందిన ఇ-మొబిలిటీ సేవల సంస్థ క్వాంట్రాన్‌ ఏజీతో ప్రత్యేక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది. వాహనాన్ని ఏ సంస్థ ఉత్పత్తి చేసినా, ప్రతి వాహనంలోనూ ఈ సాఫ్ట్‌వేర్‌ పనిచేస్తుందని గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ చావలి తెలిపారు. వాహనాలను నిర్వహించే సంస్థలు, బీమా కంపెనీలకు వాహనం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలిసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రవాణా సేవలను అందించే సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ కోసం ఎలాంటి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే టెలిమాట్రిక్స్‌ పరికరాన్ని వాహనంలో అమరుస్తామని తెలిపారు.  


11 ఏళ్లలో 9 లక్షల కార్ల విక్రయం: రెనో

దిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన వాహన సంస్థ గ్రూపె రెనో అనుబంధ రెనో ఇండియా, గత 11 ఏళ్లలో మొత్తం 9 లక్షల వాహనాలను దేశీయంగా విక్రయించినట్లు తెలిపింది. 2012లో సంస్థ దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ‘రెనోకు అంతర్జాతీయంగా ఉన్న 5 అగ్రగామి విపణుల్లో భారత్‌ ఒకటి. ఈ దేశంపై దీర్ఘకాలానికి స్పష్టమైన ప్రణాళిక మా వద్ద ఉంది. భవిష్యత్తు మోడళ్లకు 90% విడిభాగాలను స్థానికంగా సమీకరించడంపైనా దృష్టి పెట్టాం’ అని రెనో ఇండియా ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని