ఫెడ్‌ తెచ్చిన లాభోత్సాహం

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు వచ్చే ఏడాది రేట్ల కోతలకు సంకేతాలివ్వడంతో గురువారం మన సూచీలు దుమ్మురేపాయి. ఐటీ, టెక్‌, స్థిరాస్తి షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటంతో సెన్సెక్స్‌, నిఫ్టీ తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి.

Published : 15 Dec 2023 04:54 IST

సెన్సెక్స్‌ 930, నిఫ్టీ 256 పాయింట్లు దూసుకెళ్లాయ్‌
రూ.355 లక్షల కోట్లకు మదుపర్ల సంపద

మెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు వచ్చే ఏడాది రేట్ల కోతలకు సంకేతాలివ్వడంతో గురువారం మన సూచీలు దుమ్మురేపాయి. ఐటీ, టెక్‌, స్థిరాస్తి షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటంతో సెన్సెక్స్‌, నిఫ్టీ తాజా జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులకు తోడు, ముడిచమురు ధరలు తగ్గడమూ మదుపర్ల సెంటిమెంట్‌ను బలపడేలా చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు కోలుకుని 83.30 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 75.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

  •  సూచీల పరుగు నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గురువారం రూ.3.83 లక్షల కోట్లు పెరిగి, రికార్డు గరిష్ఠమైన రూ.355.02 లక్షల కోట్లకు చేరింది.
  • సెన్సెక్స్‌ ఉదయం 70,146.09 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో ప్రారంభమైంది. ఒకదశలో 1,018.29 పాయింట్లు లాభపడి 70,602.89 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 929.60 పాయింట్ల లాభంతో 70,514.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 256.35 పాయింట్లు పెరిగి 21,182.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,210.90 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. సెన్సెక్స్‌ 70,000 పాయింట్ల పైన, నిఫ్టీ 21,000 పాయింట్లపైన ముగియడం ఇదే తొలిసారి.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 పరుగులు తీశాయి. టెక్‌ మహీంద్రా 3.91%, ఇన్ఫోసిస్‌ 3.61%, విప్రో 3.52%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.27%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.97%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.88% రాణించాయి. పవర్‌గ్రిడ్‌, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటన్‌, మారుతీ, సన్‌ఫార్మా 2% వరకు నష్టపోయాయి.  
  • బీమా సంస్థల షేర్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఎల్‌ఐసీ షేరు 1.32% లాభంతో రూ.815.30 వద్ద ముగిసింది. ఎస్‌బీఐ లైఫ్‌ 0.16% పెరిగింది. మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ 3.1%, నిప్పన్‌ లైఫ్‌ ఏఎంసీ 3.6%, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 1.90%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 1.72% నష్టపోయాయి.
  • ప్రైవేట్‌ రుణదాతల నుంచి 1.25 బిలియన్‌ డాలర్ల రుణాలను పొందినట్లు వేదాంతా మాతృసంస్థ వేదాంతా రిసోర్సెస్‌ వెల్లడించింది. 2024, 2025లలో గడువు తీరనున్న  3.2 బి.డాలర్ల రుణాల రీఫైనాన్స్‌ కోసం వీటిని వినియోగించనుంది.
  • గుజరాత్‌లోని ఇంధన, పోర్ట్‌  ప్రాజెక్టుల్లో రూ.55,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్సార్‌ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. బిహార్‌లో మరో రూ.8700 కోట్లు పెట్టుబడి పెడతామని అదానీ గ్రూప్‌ తెలిపింది.

ఐపీఓ సమాచారం..

  • డోమ్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓ రెండో రోజు ముగిసేసరికి 15.16 రెట్ల స్పందన వచ్చింది. ఇష్యూలో భాగంగా 88,37,407 షేర్లను ఆఫర్‌ చేయగా, 13,39,90,938 షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగంలో 41.07 రెట్ల స్పందన దక్కింది.
  • ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ ఐపీఓ రెండో రోజుకు 4.34 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 1,79,10,449 షేర్లు జారీ చేయనుండగా, 7,76,42,790 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
  • ఐనాక్స్‌ సీవీఏ ఐపీఓ మొదటి రోజు 2.78 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,54,77,670 షేర్లను ఆఫర్‌ చేయగా, 4,30,88,606 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
  • డెనిమ్‌ బ్రాండ్‌ మఫ్తీ జీన్స్‌ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ ఐపీఓ ఈనెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.266- 280 ను నిర్ణయించారు. రిటైల్‌ మదుపర్లు కనీసం 53 షేర్లకు బిడ్లు దాఖలు చేసుకోవాలి.
  • హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఐపీఓ 19న ప్రారంభమై 21న ముగియనుంది. ధరల శ్రేణి రూ.808- 850.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని