ఆరోగ్య బీమా.. ముందుగా తీసుకుంటేనే మేలు

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ, మారిన కాలమాన పరిస్థితుల్లో చిన్న వయసులో ఉన్న యువతా జీవనశైలి రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు.

Published : 14 Apr 2023 00:36 IST

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. కానీ, మారిన కాలమాన పరిస్థితుల్లో చిన్న వయసులో ఉన్న యువతా జీవనశైలి రుగ్మతలు, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా మరణాల్లో అయిదో వంతు భారతీయ యువకులే ఉండటం బాధ కలిగించే అంశం. మధుమేహంతో బాధపడుతున్న వారు ఏడు కోట్ల మందికి పైగానే ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఏ అనారోగ్యం బారిన పడతారన్నది అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్‌కు ఆర్థిక భద్రత ఉండేలా ఒక ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కసారి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరితే రూ.లక్షలు ఖర్చవుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలామంది తాము ఆరోగ్యంగానే ఉన్నామని, ఈ సమయంలో ఆరోగ్య బీమాతో ఏం అవసరం ఉందని ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆర్థిక ప్రణాళికలో మొదటి అడుగు బీమా పాలసీలతోనే వేయాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు బీమా తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో చిక్కులు లేకుండా చూసుకోవచ్చు. 30 ఏళ్ల లోపే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

* తక్కువ ప్రీమియం: ఆరోగ్య బీమా ప్రీమియాలు వయసుతో పాటే పెరుగుతాయి. చిన్న వయసులోనే సమగ్ర ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం ద్వారా తక్కువ ధరకు పాలసీ లభిస్తుంది. తక్కువ వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు. కాబట్టి, బీమా సంస్థలు బోనస్‌లు, ఇతర ప్రయోజనాల రూపంలో ప్రోత్సాహకాలను అందిస్తాయి.

* వేచి ఉండే వ్యవధి: థైరాయిడ్‌, ఆస్తమా, కొలెస్ట్రాల్‌ వంటి ముందుగా ఉన్న వ్యాధుల చికిత్స కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న తర్వాత కొంత కాలం వేచి చూడాలి. బీమా సంస్థలను బట్టి, ఇది ఏడాది నుంచి మూడేళ్ల వరకూ ఉంటుంది. 30 ఏళ్లలోపు వారికి ఈ తరహా వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి, నిరీక్షణ వ్యవధి గురించి చింతించాల్సిన అవసరం ఉండదు. పాలసీ తీసుకున్న తర్వాత అనుకోకుండా వీటి బారిన పడినా.. చికిత్సకు ఏ ఇబ్బందీ ఉండదు. ఒకసారి అనారోగ్యం పాలైన తర్వాత పాలసీని తీసుకున్నా కొన్ని మినహాయింపులతో పాలసీని ఇస్తారు. అప్పుడు ఆరోగ్య బీమా తీసుకున్న లక్ష్యం దెబ్బతింటుంది.  

* పూర్తి కవరేజీ: వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. యువకులుగా ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యే సందర్భాలు చాలా తక్కువ. చిన్న వయసులో పాలసీ తీసుకున్నప్పుడు, వయసు పెరిగిన తర్వాతా ఎలాంటి మినహాయింపులు లేకుండా పూర్తి పరిహారాన్ని పొందేందుకు వీలవుతుంది.

* నో క్లెయిం బోనస్‌: ఆరోగ్య బీమా పాలసీలో ప్రతి క్లెయిం చేయని ఏడాదికి కొంత నో క్లెయిం బోనస్‌ లభిస్తుంది. దీనివల్ల ప్రీమియం భారం లేకుండానే పాలసీ విలువ పెరుగుతుంది. 30 ఏళ్లలోపు ఉన్నప్పుడు క్లెయింలు దాఖలు చేసే అవకాశాలు తక్కువ. కాబట్టి, వారికి నో క్లెయిం బోనస్‌ అధికంగా లభిస్తుంది. పాలసీ నిబంధనలను బట్టి, 100 శాతం మేరకు పాలసీ విలువ పెరిగే వీలుంది. ఫలితంగా ఒకే ప్రీమియంపై రెట్టింపు బీమా మొత్తం లభిస్తుందన్నమాట.  

* మానసిక అనారోగ్యం: వృత్తి జీవితంలో యువత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనివల్ల కలిగే మానసిక ఆందోళన చికిత్సకూ ఆరోగ్య బీమా వర్తిస్తుంది.

* ముందస్తు పరీక్షలు: 30-35 ఏళ్ల లోపు వారు పాలసీ తీసుకున్నప్పుడు బీమా సంస్థలు ఎలాంటి ముందస్తు ఆరోగ్య పరీక్షలనూ అడగడం లేదు. దీనివల్ల పాలసీ కొనుగోలులో ఎలాంటి చిక్కులూ ఉండవు. వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకూ పాలసీలు వీలు కల్పిస్తాయి.

* ఆరోగ్యంగా ఉంటే: ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాలసీదారులు తీసుకుంటున్న చర్యలను గుర్తించి, బీమా సంస్థలు రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. పాలసీ పునరుద్ధరణ సమయంలో రాయితీల్లాంటి ప్రయోజనాలు అందుతాయి.  

* పొదుపును రక్షించుకునేలా: వైద్య చికిత్సల ఖర్చు ఏడాదికి 10-12% వరకూ పెరుగుతోందని అంచనా. వైద్య సాంకేతికతలో వస్తున్న నిరంతర అభివృద్ధి కారణంగా ఇది మరింత పెరుగుతోంది. అత్యవసర వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆరోగ్య బీమా పాలసీ లేకుంటే.. చికిత్స నాణ్యతపై రాజీ పడాల్సి వస్తుంది. కష్టపడి దాచుకున్న పొదుపు సొమ్ము ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇలాంటి ఇబ్బంది ఎదురవ్వకుండా ముందే మంచి సంస్థ నుంచి బీమా పాలసీ తీసుకోవడం ఉత్తమం.

* ఆదాయపు పన్ను: ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 80డీ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. స్వీయ, జీవిత భాగస్వామి, పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు చెల్లించిన ప్రీమియాలకు దాదాపు రూ.75వేల వరకూ పన్ను ప్రయోజనం లభిస్తుంది.

పార్థనిల్‌ ఘోష్‌, ప్రెసిడెండ్‌, రిటైల్‌ బిజినెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ

* సొంతంగా...ఉద్యోగులకు యాజమాన్యం కల్పించే బృంద బీమా సౌకర్యం ఉంటుంది. కానీ, ఇదొక్కటే సరిపోదు. ఉద్యోగం మారినప్పుడు, మానేసినప్పుడు ఈ బృంద బీమా రక్షణ దూరం అవుతుంది. కాబట్టి, ఎల్లవేళలా మీకు తోడుండేలా సొంత ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం ఎప్పుడూ మంచిది. ఉద్యోగంలో చేరిన వెంటనే సొంతంగా ఒక ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని