ఆదాయం పెరిగిన వేళలో...

సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి నెలలో చాలామందికి వేతనాలు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగిన మొత్తం ఇప్పుడు చేతికి అందుతుంది

Published : 05 May 2023 05:12 IST

సాధారణంగా ఆర్థిక సంవత్సరం తొలి నెలలో చాలామందికి వేతనాలు పెరుగుతూ ఉంటాయి. ఆ పెరిగిన మొత్తం ఇప్పుడు చేతికి అందుతుంది. కొందరు బోనస్‌లూ అందుకుంటారు. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరమూ ఉంటుంది. ప్రాధాన్యం లేని అంశాల కోసం తొందరపడకుండా.. జీవితంలోని ప్రధాన లక్ష్యాలను సాధించే దిశగా పెట్టుబడులు సాగాలి. అందుకోసం ఏం చేయాలి?

వేతనం పెరిగినప్పుడు చాలామంది దానికి అనుగుణంగా కొన్ని ఖర్చులనూ సిద్ధం చేసుకుంటారు. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలనుకున్నప్పుడు ఇది ఏ మాత్రం సరైన పద్ధతి కాదు.

అత్యవసర నిధిని పెంచుకునేలా...

మీ ఇంటి ఖర్చుల గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకోండి. కనీసం 6-12 నెలల ఖర్చులకు సరిపోయేంత నిధి మీ దగ్గర ఉందా చూసుకోండి. ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు మీకు వచ్చిన బోనస్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారన్నదీ ముఖ్యమే. అంకురాలు లేదా మాంద్యం ప్రభావం ఉన్న రంగాల్లో పనిచేస్తున్న వారు కనీసం 12 నెలల ఖర్చులను సిద్ధంగా ఉంచుకోవాలి. ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. సులభంగా డబ్బు వెనక్కి తీసుకునేలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఈ మొత్తాన్ని జమ చేసుకోవాలి.

ధీమాగా ఉండేలా...

ఇప్పటి వరకూ బృంద ఆరోగ్య బీమా పాలసీ మాత్రమే ఉంటే.. సొంతంగా ఒక పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి. ఇప్పుడు రూ.10 లక్షల లోపు ఆరోగ్య బీమా పాలసీలు చాలా తక్కువ కిందే చెప్పొచ్చు. కనీసం రూ.30లక్షల విలువైన ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నించండి. ప్రీమియం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ.. అవసరమైనప్పుడు మీ పొదుపు మొత్తాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఆదాయం తక్కువగా ఉందన్న కారణంతో ఇప్పటి వరకూ పాలసీలను తీసుకోకపోతే.. ఇప్పుడైనా దాన్ని పరిశీలించండి. టాపప్‌తోనైనా పాలసీని పెంచుకునే ప్రయత్నం చేయండి.

ఇంటి రుణం తీరేలా...

పై రెండూ ఇప్పటికే పూర్తయిన వారు.. ఇంటి రుణం తీర్చేందుకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఇప్పుడు గృహరుణం వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. 8.5శాతం నుంచి 9 శాతం వరకూ చేరుకున్నాయి. రుణం పూర్తయ్యేందుకు కొన్నేళ్ల వ్యవధి పెరిగిన విషయం చూస్తూనే ఉన్నాం. కాబట్టి, మీ దగ్గర అవసరానికి మించి డబ్బు ఉన్నప్పుడు ఈఎంఐ పెంచుకునే అంశాన్ని పరిశీలించండి. దీనివల్ల వడ్డీ భారం, వ్యవధి తగ్గుతుంది. ఇప్పటికే రుణం ఉన్న రుణ గ్రహీతలు వివిధ బ్యాంకులు అందిస్తున్న హోమ్‌ సేవర్‌, హోమ్‌లోన్‌ అడ్వాంటేజ్‌, మాక్స్‌గెయిన్‌, హోమ్‌లోన్‌ ఇంట్రెస్ట్‌ సేవర్‌ మొదలైన పేర్లతో అందిస్తున్న ఖాతాలను ప్రారంభించవచ్చు. హోమ్‌లోన్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్నీ వినియోగించుకోవచ్చు. దీన్ని రుణ ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా వడ్డీ భారాన్ని కొంత మేరకు తగ్గించుకోవచ్చు. రుణగ్రహీత తన దగ్గరున్న మొత్తాన్ని రుణాన్ని చెల్లించకుండానే, ముందస్తు చెల్లింపు ప్రయోజనం పొందేందుకు ఉపయోగపడుతుంది.

దీర్ఘకాలిక పెట్టుబడి కోసం..

ఈ నెల నుంచి మీరు అందుకుంటున్న అధిక మొత్తంలో కొంత భాగాన్ని క్రమానుగత పెట్టుబడుల కోసం కేటాయించండి. దీర్ఘకాలిక దృష్టితో ఈ పెట్టుబడులు ఉండాలి. మ్యూచువల్‌ ఫండ్లలో లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లను పరిశీలించాలి. ఇండెక్స్‌ ఫండ్‌లలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక భారత దేశ ఆర్థిక వ్యవస్థను ఇవి ప్రతిబింబిస్తాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి, ఎలాంటి నియంత్రణ పరిమితులు లేకుండా మార్కెట్‌ క్యాప్స్‌, సెక్టార్‌ లేదా థీమ్‌లోల పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌లు ఇస్తాయి.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో...

దీర్ఘకాలంలో సంపద పెరగాలంటే.. ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. కానీ, నాలుగేళ్ల లోపు అవసరాలు ఉన్న వారు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవచ్చు. నష్టభయం ఏమాత్రం భరించలేని వారికీ ఇవే సరైనవి. ప్రస్తుతం డిపాజిట్‌ రేట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు గతంలో ఉన్న ద్రవ్యోల్బణ సూచీ సర్దుబాటు ప్రయోజనం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దూరం అయ్యింది. కాబట్టి, ఇప్పుడు ఎఫ్‌డీలు, డెట్‌ ఫండ్ల మధ్య సమానత్వం వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.5 శాతం వరకూ రాబడినిస్తున్నాయి. అందువల్ల స్వల్పకాలంలో కారు, ఇల్లు కొనడం, వివాహం, పిల్లల చదువుల ఖర్చులాంటివి ఉన్నప్పుడు వీటిని ఎంచుకోవడమే శ్రేయస్కరం. మంచి వడ్డీ ఇస్తున్న రెండు మూడు బ్యాంకులను ఎంచుకొని, వివిధ వ్యవధులకు డిపాజిట్‌ చేయండి.
మీ నష్టభయం భరించే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. వైవిధ్యమైన పెట్టుబడులతో మీ డబ్బు మీ కోసం కష్టపడేలా చూసుకోండి.
నవీన్‌ కుక్రేజా, సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, పైసాబజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని