మ్యూచువల్‌ ఫండ్లు లక్ష్య సాధనకు తోడుగా

జీవితంలో మనకు ఎన్నో ఆర్థిక లక్ష్యాలుంటాయి. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువులు, పదవీ విరమణ ప్రణాళికలు ఇందులో కీలకం. వీటికి కావాల్సిన నిధులు సాధించాలంటే.. పెట్టుబడులు ఒక్కటే మార్గం.

Updated : 29 Dec 2023 01:05 IST

జీవితంలో మనకు ఎన్నో ఆర్థిక లక్ష్యాలుంటాయి. ముఖ్యంగా పిల్లల ఉన్నత చదువులు, పదవీ విరమణ ప్రణాళికలు ఇందులో కీలకం. వీటికి కావాల్సిన నిధులు సాధించాలంటే.. పెట్టుబడులు ఒక్కటే మార్గం. ఈ ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మ్యూచువల్‌ ఫండ్లలో ఇప్పుడు సరికొత్త విభాగాలూ అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి? ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) మ్యూచువల్‌ ఫండ్లలో ప్రత్యేకంగా కొన్ని విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సొల్యూషన్‌-ఓరియెంటెడ్‌ ఫండ్లుగానూ పిలుస్తారు. పదవీ విరమణ, పిల్లల భవిష్యత్‌ అవసరాలూ ఈ రెండు ప్రధాన ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టి, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఉపకరించేలా వీటి నిబంధనలను రూపొందించింది. సెబీ వర్గీకరణ ప్రకారం ప్రస్తుతం రెండు రకాల సొల్యూషన్‌-ఓరియెంటెడ్‌ ఫండ్లు మాత్రమే ఉన్నాయి.

 దీర్ఘకాలం కొనసాగేలా...

 ఈ రెండు రకాల ఫండ్లకూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.

  • అయిదేళ్ల వరకూ: ఈ పథకాల్లో పెట్టిన పెట్టుబడిని కనీసం అయిదేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పథకాల పెట్టుబడి లక్ష్యానికి అనుగుణంగా దీర్ఘకాలం కొనసాగించాలనే ఆలోచనే ఇందుకు కారణం. అకారణంగా మధ్యలోనే పెట్టుబడులను ఉపసంహరించకుండా ఇది అడ్డుకుంటుంది. ఎక్కువ కాలం కొనసాగినప్పుడు నష్టాలు పరిమితమై, లాభాలు ఆర్జించేందుకు వీలవుతుంది.
  •  ఈక్విటీ, డెట్‌ పెట్టుబడుల మిశ్రమంతో ఈ పథకాలు అందుబాటులో ఉంటాయి. పదవీ విరమణకు చాలా ఏళ్ల వ్యవధి ఉన్న వారు ఈక్విటీ పెట్టుబడులను ఎంచుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడి వృద్ధికి అవకాశం లభిస్తుంది. డబ్బుకు నష్టభయం తక్కువగా ఉండాలని కోరుకునే వారు డెట్‌ పథకాలను ఎంచుకోవచ్చు. పిల్లల కోసం మదుపు చేసేటప్పుడు వ్యవధిని బట్టి, ఫండ్లను పరిశీలించాలి. కనీసం ఏడేళ్ల తర్వాత అవసరం ఉంటేనే ఈక్విటీల వైపు మొగ్గు చూపాలి.

పదవీ విరమణ కోసం..

పదవీ విరమణ కోసం ప్రత్యేకించిన పథకాలు ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో మదుపు చేస్తాయి. పెట్టుబడిదారుడికి పదవీ విరమణ వయసు దగ్గరకు వస్తున్నప్పుడు ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ డెట్‌ పథకాలకు మళ్లిస్తాయి. అస్థిరతను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. పెట్టుబడికీ, ఆర్జించిన లాభాలకూ నష్టం రాకుండా ఇది కాపాడుతుందన్నమాట.
రిటైర్మెంట్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు మదుపరులు దీర్ఘకాలంపాటు క్రమశిక్షణతో వాటిని కొనసాగించాలి. దీనికోసం క్రమానుగత పెట్టుబడి విధానాన్ని పాటించాలి.

పిల్లల భవితకు...

పెరుగుతున్న చదువుల ఖర్చులకు అనుగుణంగా పిల్లల కోసం పెట్టుబడి ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఈక్విటీల్లో కాస్త నష్టభయం ఉన్నప్పటికీ, వృద్ధికి అవకాశం ఉంటుంది. పిల్లల వయసు, లక్ష్య సాధనకు ఉన్న వ్యవధి ఆధారంగా ఏ విభాగాన్ని ఎంచుకోవాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడి ప్రారంభించి అయిదేళ్లు లేదా పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ.. ఇందులో ఏది ముందయితే అప్పటి వరకూ లాకిన్‌ వ్యవధి ఉంటుంది. పిల్లల చదువులకు ఉపయోగపడే పెట్టుబడులను అకారణంగా వెనక్కి తీసుకోకుండా ఈ ఏర్పాటన్నమాట.

వేటిని ఎంచుకోవాలి?

మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, బాధ్యతలు, లక్ష్యాలకు ఆధారంగా మీరు ఏ తరహా ఫండ్లలో మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించి, తగిన సలహా తీసుకోవాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత వాటిని క్రమం తప్పకుండా సమీక్షిస్తుండాలి. అవసరమైన మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే అవి మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు తోడుగా ఉంటాయి.
డీపీ సింగ్‌, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని