అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స

ఆరోగ్య బీమా పాలసీదారులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ మేరకు సాధారణ బీమా సంస్థలకు చెందిన ‘ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌’ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

Published : 26 Jan 2024 00:15 IST

రోగ్య బీమా పాలసీదారులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సకు ఇక నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ మేరకు సాధారణ బీమా సంస్థలకు చెందిన ‘ది జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌’ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలతో సంప్రదించి పలు కొత్త మార్పులను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. బీమా కంపెనీల నెట్‌వర్క్‌ జాబితాలో పేరులేని ఆసుపత్రులలోనూ నగదు రహిత చికిత్స సదుపాయాన్ని పొందేందుకు వీలు కల్పించింది. ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది.

బీమా సంస్థల నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో సాధారణంగా నగదు రహిత చికిత్స పొందేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. జాబితాలో లేని ఆసుపత్రిలో చేరితే.. ముందుగా బిల్లు చెల్లించి, తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. ఇది కాస్త సంక్లిష్టమైన ప్రక్రియ. రిఫండ్‌ రావడానికి కొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త నిర్ణయం వెలువడింది. దీని ప్రకారం ఇక నుంచి ఈ జాబితాలో లేని ఆసుపత్రులోనూ నగదు రహిత చికిత్సను పొందవచ్చు. వీటిలో చికిత్స చేయించుకోవాలంటే.. 48 గంటల ముందుగా బీమా సంస్థకు తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరితే 48 గంటల్లోపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. బీమా పాలసీలోని షరతులు, నిబంధనలు, ఇతర అంశాల ఆధారంగా క్లెయిం పరిష్కారం ఉంటుంది.

అన్ని ప్రైవేటు ఆసుపత్రులలోనూ నగదు రహిత చికిత్స అందుబాటులోకి రావడం వల్ల పాలసీదారులకు మేలు చేకూరనుందని ఈ సందర్భంగా కౌన్సిల్‌ ఛైర్మన్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ తపన్‌ సింఘేల్‌ అన్నారు. రిఫండ్‌ ప్రక్రియ ఆలస్యం అవుతుండటం వల్ల పాలసీదారులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ఇక నుంచి ఆ అవసరం లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని