రూ.లక్ష పెట్టుబడి.. రూ.1.58 కోట్లుగా...

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు విభిన్నమైనవి. ఇవి పూర్తిగా ఈక్విటీ ఫండ్లూ కావు. అలాగని డెట్‌ ఫండ్లుగానూ చెప్పలేం. ఈ రెండింటి మిశ్రమమే బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు.

Updated : 02 Feb 2024 13:15 IST

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు విభిన్నమైనవి. ఇవి పూర్తిగా ఈక్విటీ ఫండ్లూ కావు. అలాగని డెట్‌ ఫండ్లుగానూ చెప్పలేం. ఈ రెండింటి మిశ్రమమే బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు. ఈక్విటీలతోపాటు, రుణ పత్రాల్లో ‘డైనమిక్‌ అలకేషన్‌’ పద్ధతిలో పెట్టుబడి పెడతాయి. తక్కువ నష్టభయంతో స్థిరమైన లాభాలు ఆర్జించడం లక్ష్యంగా ఈ తరహా పథకాలను మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సంస్థలు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను ఆవిష్కరించిన విషయం విదితమే. కానీ హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ప్రత్యేకతలే వేరు. ఈ ఫండ్‌ తాజాగా తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. అంతేకాదు, సగటున ఏటా 18 శాతం లాభాలను ఆర్జించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌)లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, దాని విలువ 158 రెట్లు పెరిగి, ఇప్పుడు రూ.1.58 కోట్లు అయింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ 1994 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. మనదేశంలో సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న కొన్ని పథకాల్లో ఇదీ ఒకటి. 2023 డిసెంబరు 31వ తేదీ నాటికి ఈ పథకం నిర్వహణలో రూ.73,000 కోట్లు (ఏయూఎం) ఉండటం గమనార్హం. పైగా ఇది ‘యాక్టివ్‌లీ మేనేజ్డ్‌ ఫండ్‌’ తరగతి కిందకు వచ్చే పథకం. అంటే ఫండ్‌ మేనేజర్ల నైపుణ్యం, క్రియాశీలత, సమర్థత ఆధారంగా లాభాలు ఉంటాయి.
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఛీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (సిఐఓ)గా వ్యవహరించిన ప్రశాంత్‌ జైన్‌ ఎన్నో ఏళ్ల పాటు దీనికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరించారు. 2022 జులైలో ఆయన సిఐఓ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి ఈ పథకం బాధ్యతలను గోపాల్‌ అగర్వాల్‌, అనిల్‌ బంబోలి, అరుణ్‌ అగర్వాల్‌... తదితరులు నిర్వహిస్తున్నారు.


మూడేళ్లుగా...

మూడేళ్లుగా ఈ పథకంపై ఆకర్షణీయమైన లాభాలు కనిపిస్తున్నాయి. రెగ్యులర్‌ ప్లాన్‌- గ్రోత్‌ ఆప్షన్‌ కింద స్కీము బెంచ్‌మార్క్‌ రిటర్న్స్‌ 11.02 శాతం కాగా, ఈ పథకం మాత్రం 25.42 శాతం లాభాలు నమోదు చేసింది. గత ఏడాది కాలంలో బెంచ్‌మార్క్‌ రిటర్న్స్‌ 14.26 శాతం అయితే, ఈ ఫండ్‌ 31.30 శాతం లాభాలు ఆర్జించింది. క్రమానుగత పెట్టుబడి విధానంలో (సిప్‌) మదుపు చేసిన వారికి గత మూడేళ్ల కాలంలో ఏటా 17.49 శాతం, గత ఏడాది కాలంలో 33.54 శాతం ప్రతిఫలం లభించింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో టాప్‌- 5 హోల్డింగ్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో రూపకల్పన, నిర్వహణలో ఈ పథకం ‘డైనమిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్‌ స్థితిగతుల ప్రకారం ఈక్విటీ, రుణ పత్రాలకు కేటాయింపులు మార్చుకోవటం ఈ వ్యూహంలోని ప్రధాన లక్షణం. ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి మార్కెట్‌ విలువ, నిఫ్టీ 50 ట్రెయిలింగ్‌ పీఈ, ఎర్నింగ్స్‌ ఈల్డ్‌/ జీ-సెక్‌ ఈల్డ్‌ నిష్పత్తి, మరికొన్ని ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. రుణ పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవటానికి టెన్యూర్‌, డ్యూరేషన్‌ సర్దుబాటు తర్వాత వడ్డీ రేటు అంచనాలు, క్రెడిట్‌ రిస్క్‌, లిక్విడిటీ... తదితర అంశాలను పరిశీలిస్తారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌, అనుసరిస్తున్న పెట్టుబడుల విధానం కాలపరీక్షకు నిలిచిందని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ నవ్‌నీత్‌ మునోత్‌ పేర్కొన్నారు. తమ మదుపరులకు ఇదే విధంగా భవిష్యత్తులోనూ లాభాలు తెచ్చిపెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతాం- అని ఆయన ఆన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని