ఇంటి మరమ్మతుకు రుణం కావాలా?

మీ ఇంటిని మరమ్మతు చేయించుకోవాలని అనుకుంటున్నారా? దానికి డబ్బు ఎలా అని ఆలోచిస్తున్నారా? దీనికోసం బ్యాంకులు గృహ మరమ్మతు రుణాలను అందిస్తాయి.

Updated : 22 Sep 2023 00:18 IST

మీ ఇంటిని మరమ్మతు చేయించుకోవాలని అనుకుంటున్నారా? దానికి డబ్బు ఎలా అని ఆలోచిస్తున్నారా? దీనికోసం బ్యాంకులు గృహ మరమ్మతు రుణాలను అందిస్తాయి. మీ అర్హత, ఆస్తి విలువను బట్టి ఎంత రుణం వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. ఈ తరహా రుణాలు తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి కొనుగోలు కోసం గృహరుణాలు ఇస్తాయి. ఇదే తరహాలో ఇంటిని మరమ్మతు చేసేందుకూ ప్రత్యేకంగా రుణాలను అందిస్తాయి. గృహరుణాలతో పోలిస్తే వీటి వ్యవధి తక్కువగా ఉంటుంది. రుణ మొత్తమూ అధికంగా ఉండదు. మీకు ఇప్పటికే గృహరుణం ఉంటే.. టాపప్‌ లోన్‌గా దీన్ని తీసుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేసుకునే ముందు మీ తిరిగి చెల్లించే సామర్థ్యం తప్పనిసరిగా అంచనా వేసుకోవాలి. రుణ ఒప్పందం నిబంధనలు, షరతులూ తెలుసుకోవాలి.

అర్హత: ఇది రుణదాతలను బట్టి మారుతుంది. సాధారణంగా బ్యాంకులు ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, ఆస్తి విలువ వంటి అంశాలను చూస్తాయి. ఇంటి మరమ్మతు కోసం ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను సంబంధిత నిపుణుల నుంచి తీసుకొని, ఆ నివేదికను బ్యాంకులకు అందించాల్సి ఉంటుంది.

రుణం ఎంత?: మీ ఇంటి మరమ్మతు పూర్తి చేయడానికి అవసరమైన మేరకు రుణ మొత్తాన్ని తీసుకోవాలి. మీ ఆదాయం, ఆస్తి విలువను పరిగణనలోకి తీసుకొని కొన్నిసార్లు అధిక మొత్తం ఇస్తామని చెప్పొచ్చు. కానీ, దీనిని తిరిగి చెల్లించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. మీరు సులభంగా చెల్లించే మేరకే అప్పు తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

వడ్డీ రేట్లు: సాధారణ గృహరుణాలతో పోలిస్తే ఈ రుణాలకు వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉంటాయి. రుణదాతలను బట్టి, ఇది మారుతూ ఉంటుంది. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తున్న వడ్డీ రేట్లను పోల్చి చూసుకున్నాకే నిర్ణయం తీసుకోండి.

వ్యవధి: ఈ రుణాన్ని బ్యాంకులు కొన్ని నెలల వ్యవధి నుంచి ఏళ్ల వరకూ ఇస్తాయి. మీ తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి, వ్యవధిని ఎంచుకోండి. మీపై ఎక్కువ ఆర్థిక ఒత్తిడి లేకుండా చూసుకోండి.

పత్రాలు సిద్ధంగా: ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రుణాన్ని పొందేందుకు వీలుగా అన్ని పత్రాలనూ సిద్ధంగా ఉంచుకోవాలి. రుణదాత ఏయే పత్రాలు అడుగుతున్నారో ముందే తెలుసుకోండి. గుర్తింపు, నివాసం, ఆదాయం, ఆస్తి యాజమాన్య ధ్రువీకరణలు అడిగేందుకు అవకాశం ఉంది. మరమ్మతుకు సంబంధించిన పూర్తి వివరాలూ అందించాలి.

చేతికి ఇవ్వకుండా: ఇంటి మరమ్మతు రుణాన్ని ఇంటి యజమాని చేతికి ఇవ్వకపోవచ్చు. మరమ్మతు పనులు నిర్వహించిన గుత్తేదార్లకు నేరుగా ఇస్తుంటాయి బ్యాంకులు. ఈ విషయాన్ని ముందే తెలుసుకోవాలి.  

పన్ను మినహాయింపు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24(బి) కింద కొన్ని నిబంధనల మేరకు మరమ్మతు రుణానికి చెల్లించే వడ్డీకి పన్ను ప్రయోజనాలు అందుకోవచ్చు. మీ గృహరుణంపై చెల్లించే వడ్డీ రూ.2లక్షలకు లోపు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని