పిల్లల ఫండ్లలో మదుపు చేయొచ్చా?

మాకు 12, 8 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలు. వారి పేరుమీద నెలకు రూ.10 వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాను. పిల్లల పేరుమీద మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఉన్నాయని, వాటిలో మంచి రాబడి వస్తుందని చెప్పారు. నిజమేనా?

Published : 29 Jul 2022 01:00 IST

* మాకు 12, 8 ఏళ్ల ఇద్దరు అబ్బాయిలు. వారి పేరుమీద నెలకు రూ.10 వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాను. పిల్లల పేరుమీద మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఉన్నాయని, వాటిలో మంచి రాబడి వస్తుందని చెప్పారు. నిజమేనా?

- కృపాకర్‌

* మీ పిల్లల చదువులు, ఇతర ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రయత్నిచండి. ఇందుకోసీ మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. పిల్లల కోసం ప్రత్యేకంగా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అధిక రాబడి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. పైగా వీటికి కనీసం అయిదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. సాధారణంగా పెట్టుబడులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఉండాలి. పిల్లల ఫండ్లకు బదులు మీ పేరిటే పెట్టుబడి కొనసాగించండి. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. మీరు నెలకు రూ.10వేల చొప్పున 10 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో.. రూ.21,05,848 అయ్యేందుకు వీలుంది.


* పన్ను మినహాయింపు కోసం రెండేళ్ల నుంచి పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.30వేలు జమ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా మరో రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టాలి. దీనికోసం ఏ పథకాలను ఎంచుకోవాలి?

- శ్రీనివాస్‌

* మీరు ఇప్పటికే సురక్షితమ పథకం పీపీఎఫ్‌లో మదుపు చేస్తున్నారు. కాబట్టి, పన్ను మినహాయింపు, అధిక రాబడి వచ్చే పథకాలను ఎంచుకోండి. దీనికోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పరిశీలించవచ్చు. ఇందులో కచ్చితంగా మూడేళ్లు కొనసాగాలి. క్రమానుగత పెట్టుబడి విధానంలో వీటిలో మదుపు చేయొచ్చు. మూడేళ్ల వ్యవధి పూర్తయిన పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకొని, తిరిగి మదుపు చేయొచ్చు. దీనివల్ల మీకు భవిష్యత్‌లో అదనపు పెట్టుబడి అవసరం ఉండదు.


* గృహరుణంతో ఇల్లు కొన్నాను. ఈఎంఐ రూ.25వేల వరకూ చెల్లిస్తున్నాను. ఇంకా 12 ఏళ్ల వ్యవధి ఉంది. నా దగ్గర రూ.3 లక్షల వరకూ ఉన్నాయి. వీటిని గృహరుణం అసలుకు జమ చేయొచ్చా? లేదా ఎక్కడైనా మదుపు చేయడం లాభమా?
                                          

   - ప్రవీణ్‌ కుమార్‌

*ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు 7.5 శాతం వరకూ ఉన్నాయి. మీరు 20 శాతం శ్లాబులో ఉంటే.. మీకు వర్తించే నికర వడ్డీ రేటు 6 శాతం వరకూ ఉంటుంది. 30 శాతం శ్లాబులో ఉంటే.. 5.25 శాతం వడ్డీ వర్తిస్తుంది. మీరు రూ.3లక్షలతో ఇంతకంటే అధిక వడ్డీ వచ్చే పథకాల్లో మదుపు చేయగలను అనే నమ్మకం ఉంటే.. పెట్టుబడులకు మళ్లించవచ్చు. మీ దగ్గరున్న మొత్తాన్ని కనీసం ఆరేళ్ల కాలానికి హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. అప్పటికి మీ రుణం సగానికి తగ్గుతుంది. మీ దగ్గర జమైన మొత్తంతో ఈ రుణాన్ని ఒకేసారి పూర్తిగా తీర్చేందుకు ప్రయత్నించవచ్చు.


* నెలకు రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. నా వయసు 54. మరో ఆరేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాను. కాస్త తక్కువ నష్టభయంతో ఉండేలా ఏ పథకాలను ఎంచుకోవాలి. ఎంత జమ అవుతుంది?

- రవి

మీరు ఎంచుకున్న పెట్టుబడులు ద్రవ్యోల్బణం కన్నా అధిక రాబడి ఇచ్చేలా ఉండాలి. తక్కువ నష్టభయం ఉండాలంటే.. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. మీరు ఆరేళ్లపాటు నెలకు రూ.25వేలను మదుపు చేస్తే.. 9 శాతం రాబడితో.. రూ.22,57,000 అయ్యేందుకు అవకాశం ఉంది. అప్పుడు ఈ డబ్బును మీ అవసరాల మేరకు వినియోగించుకోవచ్చు. లేదా నెలనెలా రాబడి వచ్చేలా క్రమానుగతంగా వెనక్కి తీసుకునే అవకాశమూ ఉంటుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు