Common charger: ‘కామన్‌ ఛార్జర్‌’పై నిపుణుల కమిటీ.. రెండు నెలల డెడ్‌లైన్‌

Common charger: మొబైళ్లు, ఇతర పోర్టబుల్‌ పరికరాలన్నింటికీ ఒకటే తరహా ఛార్జర్‌ (Common charger) తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. 

Published : 17 Aug 2022 22:56 IST

దిల్లీ: మొబైళ్లు, ఇతర పోర్టబుల్‌ పరికరాలన్నింటికీ ఒకటే తరహా ఛార్జర్‌ (Common charger) తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో ఉన్న సాధ్యాసాధ్యాల పరిశీలనకు నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయనుంది. రెండు నెలల్లోగా ఈ కమిటీలు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ తెలిపారు. కామన్‌ ఛార్జర్‌ అంశంపై బుధవారం నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కామన్‌ ఛార్జర్‌ అంశం సంక్లిష్టమైనదిగా రోహిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. తొలి దశలో టైప్‌-సి సహా రెండు రకాల ఛార్జర్లకు మారడంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. కామన్‌ ఛార్జర్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకునేముందు అటు పరిశ్రమ వర్గాలు, వినియోగదారులు, తయారీదారులు, పర్యావరణం ఇలా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే నిపుణులతో కూడిన కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొబైల్‌, ఫీచర్‌ ఫోన్లు; ల్యాప్‌టాప్‌లు, ఐప్యాడ్స్‌; వేరేబుల్‌ ఎలక్ట్రానిక్‌ డివైజులు.. ఇలా మూడు సెగ్మెంట్లకు వేర్వేరు గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీలు తమ సిఫార్సులను రెండు నెలల్లోగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమ వర్గాల ప్రతినిధులు, ఫిక్కీ, సీఐఐ, అసోచామ్‌ సంఘాల ప్రతినిధులు, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ బీహెచ్‌యూ నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎందుకీ కామన్‌ ఛార్జర్‌..?

గ్యాడ్జెట్లు కొత్త రూపు సంతరించుకుంటున్నా.. వాటికి ఉపయోగించే ఛార్జర్ల సమస్య మాత్రం ఇప్పటికీ పోలేదు. ఒక కంపెనీ టైప్‌-సి పోర్ట్‌ ఇస్తే.. మరో కంపెనీ యూఎస్‌బీ పోర్ట్‌ అంటుంది. ఇంకోటి లైట్నింగ్‌ పోర్ట్‌ తీసుకొస్తుంది. ఒకరు బాక్సులో ఛార్జర్‌ అందిస్తే.. మరొకరు సపరేట్‌గా కొనాలంటారు. దీనివల్ల వినియోగదారుడి చేతి చమురు వదలడమే కాకుండా పెద్ద ఎత్తున ఈ-వేస్టేజ్‌ పేరుకుపోతోంది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కామన్‌ ఛార్జర్‌ విధానం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్లెట్‌ ఇలా.. గ్యాడ్జెట్‌ ఏదైనా ఒకటే ఛార్జర్‌ ఉండాలంటోంది. ఛార్జర్ల సమస్యకు చెక్‌ పెడుతూ ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం కంపెనీలన్నీ విధిగా టైప్‌-సి పోర్ట్‌ కలిగిన ఛార్జింగ్‌ ప్రమాణాలను పాటించాలని సూచించింది. 2024ను దీనికి గడువుగా నిర్దేశించింది. అమెరికాలో సైతం ఇలాంటి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ సైతం దీనిపై దృష్టి సారించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని