Insurance: ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో ఎలా తెలుసుకోవాలి?

జీవిత బీమా పాలసీ ఎంచుకునేటప్పుడు ఎంత హామీ ఉండాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? తెలుసుకుందాం పదండి!

Updated : 17 Jan 2023 12:41 IST

సంపాదించే ప్రతి ఒక్కరూ తగిన మొత్తానికి బీమా కలిగి ఉండాలనేది సాధారణంగా ఆర్థిక నిపుణులు చెప్పే మాట. అసలు 'తగినంత' అంటే ఎంత? దాని లెక్క ఎలా? పాలసీ తీసుకునేప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా పాలసీలు (Insurance Policies) ఉన్నాయా? అని అనగానే..'ఓ! నాలుగైదు ఉన్నాయి' అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంటుంది. నిజానికి ఇవి సరిపోతాయా అనేది సమీక్షించుకునే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. పన్ను తప్పించుకోవడానికో, మిత్రుడి మొహమాటం కొద్దో పాలసీలు తీసుకునే వారి సంఖ్యే ఎక్కువ. వాస్తవానికి దురదృష్టం వెంటాడినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత 'నాదే' అని అనుకునే వారందరూ ‘తగినంత’ మొత్తానికి బీమా (Insurance) చేయించాల్సిందే. బీమా పాలసీ మొత్తం ఎంతుండాలనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వయసు, ఆధార పడిన వారి సంఖ్య, ఆదాయం, వార్షిక ఖర్చులు, గృహ/వాహన/ఇతర రుణాలు, మీ పొదుపు, మదుపు, జీవన విధానం, భవిష్యత్‌లో వచ్చే అవసరాలకు కావాల్సిన మొత్తం.. ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటేనే ఎంత బీమా తీసుకోవాలన్న విషయంలో స్పష్టత ఏర్పడుతుంది.

తెలుసుకునే పద్ధతిదీ..

ఎవరైనా ఎంత బీమా తీసుకోవాలనేదానికి కనీసం 10 రెట్లు ఉండాలీ అనే సమాధానం వినిపిస్తుంటుంది. ఓ విధంగా ఇది సరైనదే. కానీ, అన్ని సందర్భాల్లో కాదు. అందరికీ ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్పలేం. యువకులుగా ఉండి, ఆధార పడిన వారు పెద్దగా లేనప్పుడు అధిక మొత్తానికి బీమా పాలసీలు అక్కర్లేదు. కానీ, రిటైర్మెంట్ దగ్గరపడిన తల్లిదండ్రులు లాంటి వాళ్లున్నప్పుడు.. భవిష్యత్‌లో మీకేమైనా అయితే తల్లిదండ్రుల మానసిక నష్టాన్ని పూడ్చడం ఎవరివల్లా కాదు. కానీ, ఆర్థికంగా వారికి ఎంతో కొంత అండ అందించాల్సి ఉంటుంది. అందుకే ఆర్జన మొదలు పెట్టగానే అవసరమైనంత జీవిత బీమా పాలసీ తీసుకోవడం మంచిది.

ప్రతి వ్యక్తి ఆర్థిక పరిస్థితి, అవసరాలూ వేర్వేరుగా ఉంటాయి. చాలా మంది బీమా తీసుకునే ముందు ప్రీమియం ఎంత? అని చూస్తుంటారు. భరించగలిగిన ప్రీమియంను బట్టే పాలసీ ఎంచుకుంటారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు నష్టం లేకపోయినా.. భవిష్యత్‌లో అవసరం ఏర్పడినప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీమా పాలసీలు ఎంత మొత్తం ఉండాలనేది నిర్ణయించుకోవాలి. దీని కోసం కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి.

ఆదాయానికి అనుగుణంగా..

  • ప్రస్తుత వార్షిక ఆదాయాన్ని బట్టి మీకు ఎంత బీమా అవసరం అన్నది నిర్ణయించే పద్ధతిది. దీనికి అనుసరించాల్సిన సూత్రం ఏంటంటే.. బీమా మొత్తం = వార్షికాదాయం x పదవీ విరమణ చేయడానికి ఉన్న వ్యవధి (ఏళ్లలో).
  • ఉదాహరణకు ఓ వ్యక్తి వయసు 37 ఏళ్లు. పదవీ విరమణకు ఇంకా 23 ఏళ్లు ఉన్నాయి. వార్షికాదాయం రూ. 3 లక్షలు అనుకుందాం. అప్పుడు అతడికి కావాల్సిన బీమా మొత్తం రూ. 3,00,000 x 23 = రూ. 69,00,000.
  • ఆదాయానికి అనుగుణంగా పాలసీ తీసుకునేందుకు మరో పద్ధతి కూడా ఉంది. 20-30 ఏళ్ల వయసులో ఉన్న వారు వార్షిక ఆదాయానికి 5 నుంచి 10 రెట్లు, 30 నుంచి 40 ఏళ్లలోపు వారు 15-20 రెట్లు బీమా కలిగి ఉండాలి. 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటే 10-15 రెట్లు, 50-60 ఏళ్లలోపు ఉన్న వాళ్లు వార్షికాదాయానికి కనీసం 5-10 రెట్లు విలువ గల బీమా హామీతో పాలసీ తీసుకోవాలి. రుణాలను కూడా కలపడం మర్చిపోకండి.

జీవిత విలువ ఆధారంగా..

వ్యక్తి జీవితానికి డబ్బుతో విలువ కట్టలేం. కానీ, అతడు/ఆమె అవసరం, బాధ్యతలు తీర్చేదెవరు? అందుకే ప్రతి వ్యక్తికీ ఒక ఆర్థిక విలువ ఉంటుంది. దాన్ని లెక్కించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా.. ఒక వ్యక్తి తాను ముందు ముందు ఎంత సంపాదించబోతాడు? కుటుంబపరమైన బాధ్యతల నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది? లాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఒక ఉదాహరణ చూద్దాం. రాము వయసు 40 ఏళ్లు, అతడు తన 60వ ఏట పదవీ విరమణ చేయదలుచుకున్నాడు. ప్రస్తుతం అతడి వార్షిక వేతనం రూ.3,50,000. అతడి వ్యక్తిగత ఖర్చులు, ఆదాయపు పన్ను, జీవిత బీమా పాలసీల ప్రీమియం తదితరాలు కలిపి రూ.1,25,000 అవుతున్నాయి. అంటే, కుటుంబానికి ఇంకా రూ.2,25,000 మిగులుతున్నాయి. కాబట్టి, రాము వార్షిక (ఆర్థిక)  విలువ రూ.2,25,000 గా అనుకోవచ్చు. ఒకవేళ అనుకోకుండా రాముకు 41వ ఏట ఏదైనా జరిగితే.. అతడి కుటుంబానికి ఎలాంటి ఆదాయం ఉండదు. మరి ఆ కుటుంబానికి రోజులు గడిచేదెలా? రాము ఎంత మొత్తానికి బీమా తీసుకుంటే బాగుంటుందనేది ఇప్పుడు చూద్దాం.

రాము ఆర్జించే మొత్తంలో కుటుంబానికి అందుతున్నది రూ.2,25,000. అంటే, రానున్న 20 ఏళ్లలో అందనున్న మొత్తం రూ.2,25,000 x 20 ఏళ్లు = రూ.45,00,000. అయితే, ఈ మొత్తం అందేది 20 ఏళ్లకు కలిపి కాబట్టి, దాని నేటి విలువ ఎంతనేది చూసుకోవాలి. ప్రతి ఏటా 8 శాతం రాబడి అంచనాతో చూసుకుంటే కావాల్సిన మొత్తం సుమారుగా రూ.23,85,000. ఈ మేరకు బీమా హామీ ఎంచుకోవాలి.

బీమా పాలసీ తీసుకోవాలనుకుని భావించే ప్రతి ఒక్కరూ ఈ లెక్కను వేసుకోవడం మంచిది. దీనివల్ల తగినంత మొత్తానికి బీమా తీసుకోవడం సులువు అవుతుంది. చాలా మంది ఆర్థిక నిపుణులు కూడా అవసరాల ఆధారంగా బీమా పాలసీ తీసుకోవాల్సిందిగానే సూచిస్తున్నారు. అయితే, సాధారణంగా ప్రతి ఏడాదీ కొంత వరకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి పెరిగే ఆదాయాన్ని కూడా లెక్కలో తీసుకుని కొంత ఎక్కువ బీమా హామీ ఎంచుకోవడం మంచిది.

ప్రీమియం మాటేంటి?

చూస్తే పెద్ద పెద్ద అంకెలు కనిపిస్తున్నాయి.. మరి వాటికి చెల్లించాల్సిన ప్రీమియం సంగతి ఏంటి? అనే సందేహం రావచ్చు. తక్కువ ప్రీమియంతో, ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ప్రీమియం మరింత తగ్గుతుంది. పైగా సులువు కూడా.

చివరిగా: మీ కుటుంబ అవసరాలు ఏంటి? బాధ్యతలేంటి? అనేది పూర్తిగా లెక్కలేసుకుని బీమా పాలసీ తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అవసరాలు, ఆదాయం, ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. దీనికి అనుగుణంగా ప్రతి మూడేళ్లకోసారి మీ బీమా అవసరాలను సమీక్షించుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు