Gold Hallmarking: మీ బంగారంపై ఉన్న హాల్‌మార్కింగ్‌ అసలైనదేనా?

హాల్‌మార్కింగ్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) నాణ్యత ప్రమాణపత్రం, ఇది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుంది.

Updated : 24 Sep 2022 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది దాని స్వచ్ఛత గురించి ఆందోళన చెందుతుంటారు. అందుకే వినియోగదారులకు స్వచ్ఛత గురించి తెలియజేసేందుకు హాల్‌ మార్క్‌ ఉన్న ఆభరణాలనే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలను తీసుకొచ్చింది. హాల్‌మార్కింగ్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) నాణ్యత ప్రమాణపత్రం. ఇది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. అయితే, కొంతమంది బీఐఎస్‌ నుంచి లైసెన్సు పొందిన ఏహెచ్‌సీ (ఎస్సేయింగ్‌ హాల్‌మార్కింగ్‌ కేంద్రం) నుంచి కాకుండా సొంతంగా హాల్‌మార్కింగ్‌ను ముద్రించి బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇటువంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే కొనుగోలుదారులకు కూడా హాల్‌మార్కింగ్‌ గురించి అవగాహన ఉండాలి. మీ ఆభరణాలపై ఉన్న గుర్తు అసలైనదా? నకిలీదా? తెలుసుకోవాలి.

ఎలా గుర్తించాలి? 

  • ఆభరణాలను కొనుగోలు చేసే ముందు నగలపై బీఐఎస్‌ మార్క్‌ను చూడాలి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది.
  • బంగారం స్వచ్ఛతను తెలియజేసే క్యారెటేజ్‌ (22k916) ఉందో లేదో చూడాలి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. సాధారణంగా 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది. అయితే, ఈ లోహం చాలా మృదువుగా ఉంటుంది. ఆభరణాల తయారీకి అనుకూలంగా మార్చేందుకు వెండి, రాగి వంటి ఇతర లోహాలను కలుపుతారు. బంగారం స్వచ్ఛతను బట్టి 14, 18, 22 క్యారెట్లలో హాల్‌ మార్కింగ్‌ జరుగుతుంది. హాల్‌మార్క్‌ 22k..91.6 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.   
  • ఆ తర్వాత ఏహెచ్‌సీ గుర్తు ఉందో లేదో చూడాలి. అలాగే, నగల నగల వ్యాపారిని బీఐఎస్‌ లైసెన్స్‌ చూపించాలని అడగొచ్చు. బీఐఎస్‌ మార్గదర్శకాల ప్రకారం.. నగల వ్యాపారులు, కొనుగోలుదారునికి లైనెన్స్‌ను చూపించాల్సి ఉంటుంది. అందువల్ల దుకాణంలో లైసెన్స్‌ను ప్రదర్శించాల్సి ఉంటుంది. లైసెన్స్‌లో ఉన్న చిరునామాలోనే షాపు ఉందో లేదో కొనుగోలుదారులు చూడాలి.
  • బిల్‌-బ్రేక్‌ అప్‌ను అడిగి తీసుకోండి. ఇందులో హాల్‌మార్కింగ్‌ కోసం ఎంత ఛార్జీ చేశారో తెలుసుకోవచ్చు. హాల్‌ మార్కింగ్‌ చేసిన వస్తువులకు నగల వ్యాపారి నుంచి ఏహెచ్‌సీలు రూ. 45 వసూలు చేస్తాయి. గతంలో బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్‌ కోసం రూ.35 మాత్రమే ఛార్జీ చేసేవారు. ఇటీవలే ఛార్జీలను పెంచారు. అలాగే వెండి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ ఛార్జీలను కూడా రూ.25 నుంచి రూ.35కి పెంచారు. 
  • ఆభ‌ర‌ణాల స్వ‌చ్ఛ‌త‌పై సందేహం ఉంటే.. మీరు సొంతంగా ఏహెచ్‌సీ వద్ద ఆభరణాలను తనిఖీ చేసుకోవచ్చు. బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో ఏహెచ్‌సీల జాబితా ఉంటుంది. సస్పెండ్‌ చేసిన ఏహెచ్‌సీ, లైసెన్స్‌ రద్దు చేసిన వాటి వివరాలు కూడా ఇక్కడ లభిస్తాయి. కొంత మొత్తం ఛార్జీలతో వినియోగదారులు తమ ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. పరీక్షించిన తర్వాత ఆభరణాలు స్వచ్ఛతను సూచిస్తూ ఏహెచ్‌సీ నివేదికను జారీ చేస్తుంది. 
  • ఒకవేళ నగల వ్యాపారి చెప్పిన దానికంటే స్వచ్ఛత తక్కువ ఉందని తేలితే.. మీకు విక్రయించిన నగల వ్యాపారి వద్దకు సంబంధిత పత్రాలతో వెళ్లి ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో నగల వ్యాపారి పరిహారం కూడా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా బంగారు నాణ్యతను సరిగ్గా తెలియజేయని ఏహెచ్‌సీ వినియోగదారుని ఫీజు తిరిగి చెల్లించాలి. 

చివరిగా..

పెట్టుబడుల్లో భాగంగా బంగారం కొనుగోలు చేసేవారు ఆభరణాల రూపంలో కాకుండా.. డిజిటల్‌గా (గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, సార్వభౌమ పసిడి పథకాల రూపంలో) బంగారం కొనుగోలు చేయవచ్చు. ప్రభుత్వం అందించే సార్వభౌమ పసిడి బాండ్లలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ లభించడంతో పాటు కాలపరిమితి పూర్తయ్యే వరకు కొనసాగిస్తే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అలాకాకుండా పండుగలు, ఇతర సందర్భాల్లో నగల రూపంలో కొనుగోలు చేసేవారు స్వచ్ఛత, ధర విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బీఐఎస్‌ హాల్ మార్క్‌ ఉన్న ఆభరాణాలను మాత్రమే కొనుగోలు చేయడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని