Credit Cards: మొదటిసారి క్రెడిట్‌ కార్డు పొందడం ఎలా? ఏమేం కావాలి?

చాలా మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. బ్యాంకులు కూడా తగిన ఆదాయ రుజువులు ఉన్నవారికి విరివిగానే ఈ కార్డులను మంజూరు చేస్తున్నాయి.

Published : 02 Dec 2022 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు తగిన ఆదాయం ఉండి బ్యాంకు ఖాతా కలిగిన చాలామంది క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నారు. పాన్‌ కార్డు సమాచారంతోనే ఆ వ్యక్తి ఆర్థికపరమైన లావాదేవీలను, స్థితిగతులను అంచనా వేసి.. బ్యాంకులే క్రెడిట్‌ కార్డులను తీసుకోమని ఖాతాదారులను అభ్యర్థిస్తున్నాయి.

క్రెడిట్‌ కార్డుతో ఉపయోగం

కార్డును తెలివిగా ఉపయోగించగలిగితే క్రెడిట్‌ కార్డుతో మీరు డెబిట్‌ కార్డు కంటే మెరుగైన సౌకర్యాలను పొందొచ్చు. ప్రయాణ బుకింగ్‌లు, షాపింగ్‌, క్యాష్‌ బ్యాక్‌లు, సినిమా టికెట్లపై తగ్గింపులు, రివార్డు పాయింట్లు, ఈ-కామర్స్‌ సంస్థల ఆన్‌లైన్‌ అమ్మకాలపై అందజేసే ప్రత్యేక డిస్కౌంట్‌లు లాంటివి ఎన్నో పొందొచ్చు. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు, చెల్లింపులకు భౌతిక నగదుతో పనిలేదు. ఆన్‌లైన్‌ చెల్లింపుల కార్యకలాపాలకు ఎక్కువ మంది క్రెడిట్‌ కార్డులే ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా క్రెడిట్‌ కార్డుల నో-కాస్ట్‌ ఈఎంఐ వంటి సౌకర్యాలు ఇప్పుడు చాలా మంది వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్ల క్రెడిట్‌ కార్డులు వ్యవస్థీకృత మార్కెట్లో నగదుకు ప్రత్యామ్నాయంగా విస్తృతంగా చలామణీ అవుతున్నాయి.

మొదటిసారి కార్డు పొందడం సులభమేనా?

ముఖ్యంగా మొదటిసారి అనుకూలమైన నిబంధనలు, షరతులతో మంచి క్రెడిట్‌ పరిమితితో, మెరుగైన కార్డును పొందడం కొంచెం కష్టమే. కార్డు జారీకి అధిక క్రెడిట్‌ స్కోరు అవసరం. మునుపటి క్రెడిట్‌ చరిత్ర లేకుండా మంచి క్రెడిట్‌ స్కోరు ఉండదు. అందుచేత ముందుగా తక్కువ మొత్తంలో ఛార్జీలు ఉండే, తక్కువ ప్రయోజనాలు లభించే కార్డును తీసుకోవడం ఉత్తమం. ఈ కార్డును ఉపయోగిస్తూ గడువు తేదీలోపు బకాయిలు తీరుస్తుంటే ఆటోమేటిక్‌గా క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది. ఈ క్రెడిట్‌ స్కోరుతో మార్కెట్లో అందుబాటులో ఉండే మెరుగైన కార్డును పొందొచ్చు.

మెరుగైన క్రెడిట్‌ స్కోరుతో ప్రయోజనాలు..

ఒకసారి క్రెడిట్‌ కార్డు పొందిన తర్వాత గడువు తేదీలోపు చెల్లింపులు ఉంటే.. క్రెడిట్‌ స్కోరు బాగా మెరుగవుతుంది. దీంతో అదనపు సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగిన వేరే క్రెడిట్ కార్డులను కూడా పొందొచ్చు. ఆ తర్వాత యాడ్‌-ఆన్‌ కార్డులను కూడా పొందొచ్చు. వ్యక్తిగత రుణాలు లభిస్తాయి. ముఖ్యంగా అతిపెద్ద రుణమైన గృహ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకే పొందవచ్చు.

దరఖాస్తు ఎలా చేయాలి?

మీరు కార్డును పొందాలనుకునే బ్యాంకు సమీప బ్రాంచ్‌ను సందర్శించి క్రెడిట్‌ కార్డు ప్రతినిధిని కలిసి మీ ఆదాయం, అవసరాల వివరాలు తెలపండి. బ్యాంకు ప్రతినిధి వివిధ క్రెడిట్‌ కార్డుల సమాచారం మీకు చెబుతారు. మొదటిసారి కార్డును కావాలనుకునేవారు అందులో తక్కువ వార్షిక ఫీజు (లేదా ఫీజు లేని) గల కార్డును ఎంపిక చేసుకోవడం మంచిది. అవసరమైన పత్రాలు (ముఖ్యంగా బ్యాంకు స్టేట్‌మెంట్‌, పాన్‌)లతో పాటు కార్డు దరఖాస్తు ఫారంను పూర్తిచేసి వారికి సమర్పించండి. దరఖాస్తు, ఇతర పత్రాలతో బ్యాంకు సంతృప్తి చెందితే, కార్డు మంజూరవుతుంది. ఇంకా సులభంగా కార్డును పొందడానికి, మీరు బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆఫర్‌లో ఉన్న వివిధ క్రెడిట్‌ కార్డ్‌ల ఫీచర్‌లను ఛార్జీలతో పోల్చి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

వయసు: ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ప్రాసెస్‌ కోసం అవసరమైన పత్రాలు, అర్హతలు ఒకే విధంగా ఉంటాయి. క్రెడిట్‌ కార్డుకు అర్హత పొందడానికి దరఖాస్తుదారు వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. చాలా సందర్భాల్లో యాడ్‌-ఆన్‌ కార్డు పొందడానికి కనీసం 15 ఏళ్లు నిండాలి.

నివాసం: భారత పౌరులు కొత్త క్రెడిట్‌ కార్డు పొందడానికి అర్హులు. ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) నిర్దిష్ట క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.

ఆదాయం: దరఖాస్తుదారుడు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉండాలి. అది జీతం లేదా వృత్తిపరమైన ఆదాయం కావచ్చు. క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు కనీసం రూ.2 లక్షల వార్షిక ఆదాయాన్ని ఆశిస్తున్నాయి. కార్డు కేటగిరీని బట్టి ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారు. అయితే, ఆదాయన్ని బట్టి కార్డు మంజూరు అనేది క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్‌ స్కోరు లేనివారికి, క్రెడిట్‌ కార్డును జారీ చేయడానికి వారి ప్రస్తుత ఆదాయ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు.

గుర్తింపు రుజువు: పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌.. ఏదైనా ఒక పత్రాన్ని గుర్తింపు రుజువుగా సమర్పించొచ్చు.

చిరునామా రుజువు: పాస్‌పోర్ట్‌, ఓటరు ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు, ఆస్తి పత్రాలు, లీజు/అద్దె ఒప్పందం, గత 3 నెలల యుటిలిటీ బిల్లులు.. ఏదో ఒకటి సమర్పించాలి.

ఆదాయ రుజువు: ఆదాయపు పన్ను రిటర్న్స్‌, గత 3 నెలల జీతం స్లిప్‌లు, ఉద్యోగ నియామక పత్రం అవసరం పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని