Nitin Gadkari: పెట్రోల్‌, డీజిల్‌ దిగుమతులను ఆపడమే నా జీవిత లక్ష్యం: గడ్కరీ

భారత్‌లోకి పెట్రోల్‌, డీజిల్‌ దిగుమతులను ఆపడమే తన జీవిత లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాటి దిగుమతి తగ్గినప్పుడే ఉగ్రవాదం తగ్గుతుందని తెలిపారు. 

Published : 24 Dec 2023 18:39 IST

పనాజీ: భారత దేశ ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించడమే దేశభక్తికి కొత్త విధానమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ (Oil Imports) దిగుమతులను ఆపడమే తన జీవిత లక్ష్యమని అన్నారు. ఆదివారం గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ దిగుమతి చేసుకోవడం తగ్గితేనే ఉగ్రవాదం కూడా తగ్గుతుందని వ్యాఖ్యానించారు. 

‘‘ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ దిగుమతులు ఆగనంత వరకూ ఉగ్రవాదం కూడా ఆగదు. వాటి దిగుమతి ఆపడమే నా జీవిత లక్ష్యం. ఒక చుక్క పెట్రోల్‌, డీజిల్‌ కూడా దిగుమతి చేసుకోనప్పుడే దేశానికి మరో స్వేచ్ఛ లభించినట్లు భావిస్తాను. ప్రస్తుతం దేశంలో వీటి దిగుమతి బిల్లు రూ.16 లక్షల కోట్లు. బయోఫ్యూయల్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మనం దృష్టి సారిస్తే.. దిగుమతికి అవుతున్న ఖర్చు తగ్గుతుంది. ఆ సంపద పేదలకు చేరుతుంది. దిగుమతులను తగ్గించి.. ఎగుమతులను పెంచడం దేశభక్తి కొత్త విధానం’’ అని గడ్కరీ అన్నారు. 

2024లో ఈవీలదే జోరు.. పరిశ్రమ వర్గాల అంచనా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక జీఎస్‌టీ చమురు రంగం నుంచే వస్తోందని నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యానించారు. రాబోయే ఐదేళ్లలో దేశీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశీయంగా ఆటోమొబైల్‌ పరిశ్రమకు సంబంధించిన దిగుమతులే అధికంగా ఉన్నాయని గడ్కరీ తెలిపారు. ‘‘విశ్వగురుగా భారత్‌ అవతరించాలన్నా, ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్నా.. ఎగుమతుల్లో మనం మొదటి స్థానంలో ఉండాలి. మూడు నెలల క్రితం ఆటోమొబైల్‌ ఎగుమతుల్లో భారత్‌ ఏడో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. సుపరిపాలన, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి కార్యక్రమాలతో రాబోయే ఐదేళ్లలో భారత్‌ మొదటి స్థానంలో ఉంటుంది’’ అని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని