Auto Sector: 2024లో ఈవీలదే జోరు.. పరిశ్రమ వర్గాల అంచనా

Auto Sector: వాహన పరిశ్రమలో 2023లో రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. అయితే, 2024పై మాత్రం పరిశ్రమ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

Updated : 24 Dec 2023 15:15 IST

దిల్లీ: ఈ ఏడాది వాహన రంగంలో రికార్డు స్థాయి విక్రయాలు నమోదయ్యాయి. అయితే, కొత్త సంవత్సరంలో అమ్మకాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ వాహనాలు (Electric Vehicle) సహా ఇతర స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహనాలను స్వీకరించడానికి వినియోగదారులు సిద్ధమవుతున్నారు.

ప్రయాణికుల వాహన విక్రయాలు ఈ ఏడాది ముగిసే నాటికి 40 లక్షల యూనిట్లు దాటేస్తాయని అంచనా. జనవరి నుంచి ధరలు పెరుగుతుండడం సహా సంవత్సరాంతపు ఆఫర్లతో డిసెంబర్‌ చివర్లో అమ్మకాలు గణనీయంగా పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే, వచ్చే ఏడాది విక్రయాల వృద్ధి కాస్త మందగిస్తుందని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ.భార్గవ అంచనా వేశారు. ఈ తరుణంలో వాహన పరిశ్రమలో వేగవంతమైన వృద్ధి కోసం చిన్న కార్ల విభాగాన్ని పునరుద్ధరించడం చాలా అవసరమన్నారు. ప్రయాణికుల వాహన విభాగంలో ఎంట్రీ లెవెల్‌ కార్ల వాటా 2018-19లో 14 శాతంగా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్‌- అక్టోబర్‌ నాటికి అది 4 శాతానికి తగ్గింది.

వచ్చే ఏడాది విద్యుత్‌ వాహన విక్రయాలు (Electric Vehicle Sales) పుంజుకుంటాయని భార్గవ అంచనా వేశారు. అయితే, తటస్థ కర్బన ఉద్గార లక్ష్యాన్ని సాధించే దిశగా ఇతర హరిత సాంకేతికతలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు అన్ని విభాగాల్లో ఈవీల వాటా పెరుగుతుందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మేనన్‌ తెలిపారు. మొత్తంగా 2024లో వాహన విక్రయాల ఔట్‌లుక్‌ సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫేమ్‌ స్కీమ్‌ (FAME Scheme) 2024 మార్చిలో ముగియనుండగా.. ప్రభుత్వం మరోకొత్త పథకంతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడే వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఈవీలు లభిస్తాయన్నారు. 

‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్’ అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆటోమొబైల్ రంగం (Automobile Industry) స్థిరమైన వృద్ధికి సిద్ధంగా ఉందని అంచనా వేశారు. ప్రయాణికుల వాహన విభాగంలో తక్కువ వృద్ధి నమోదవుతుందన్నారు. ద్విచక్ర వాహనాల్లో అత్యధిక వృద్ధిని అంచనా వేశారు. మరోవైపు ఎస్‌యూవీలకు వచ్చే ఏడాది మరింత గిరాకీ ఉంటుందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సీఓఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు. ప్రస్తుతం 49 శాతంగా ఉన్న వీటి వాటా వచ్చే ఏడాదికి 50 శాతం మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు వచ్చే ఏడాది మరిన్ని కొత్త వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తామని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర తెలిపారు. అలాగే కొత్త ఏడాదిలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని మహీంద్రా అండ్‌ మహీంద్రా వెల్లడించింది. విలాసవంతవైన కార్ల విభాగంలోనూ వచ్చే ఏడాది మంచి వృద్ధి నమోదవుతుందని పలు కంపెనీలు అంచనా వేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని