Tesla: భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ.. జనవరిలో ఒప్పందం?

Tesla: భారత ప్రభుత్వం, టెస్లా మధ్య జనవరిలో ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత దిగుమతులు, ఆ తర్వాత ఫ్యాక్టరీ ఏర్పాటుకు టెస్లా యోచిస్తున్నట్లు సమాచారం.

Published : 21 Nov 2023 14:18 IST

Tesla | దిల్లీ: భారత్‌లో టెస్లా (Tesla) ప్రవేశానికి రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత ప్రభుత్వం, టెస్లా మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ ఓ కథనం ప్రచురించింది.

భారత్‌లోకి విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు తొలుత ప్రభుత్వం అంగీకరించనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అనంతరం రెండేళ్లలోపు టెస్లా (Tesla) ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా షరతు విధిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఒప్పందం జనవరికల్లా ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే నెలలో జరిగే ‘వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’లో దీనిపై ప్రకటన వెలువడొచ్చని సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌, తమిళనాడు, మహారాష్ట్రలో టెస్లా (Tesla) ప్లాంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో విద్యుత్‌ వాహనాల తయారీకి అనువైన వాతావరణం ఉండడమే అందుకు కారణమని తెలిపింది.

భారత్‌లో తొలుత కనీసం రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా (Tesla) సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే సమయంలో భారత్‌ నుంచి వాహన విభాగాల కొనుగోలు విలువను 15 బిలియన్‌ డాలర్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

కార్ల ధర మరింత దిగొచ్చేలా.. బ్యాటరీలను సైతం స్థానికంగానే తయారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ దిశగా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. చివరకు ప్రణాళికల్లో ఎలాంటి మార్పులైనా ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ ఇటీవల కాలిఫోర్నియాలోని టెస్లా (Tesla) ప్లాంటును సందర్శించిన విషయం తెలిసిందే. టెస్లా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలను ప్రస్తుతం కంటే రెట్టింపు స్థాయికి చేర్చే వీలుందని ఆ సమయంలో ఆయన ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని