Home Loan: సహ-రుణగ్రహీత EMIలు డిఫాల్ట్ చేస్తున్నారా?

సహ-దరఖాస్తుదారునితో ఉమ్మడిగా గృహ రుణాన్ని తీసుకున్నప్పుడు..రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కూడా ఇద్దరికి ఉంటుంది. EMI చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయితే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి.

Updated : 23 Mar 2023 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కరి దరఖాస్తుపైనే కాకుండా సహ-దరఖాస్తుతో (ఉమ్మడిగా) కూడా గృహ రుణాన్ని తీసుకోవచ్చు. సహ-దరఖాస్తుతో రుణాన్ని అభ్యర్థించినప్పుడు.. ఎక్కువ మొత్తంతో, వేగంగా రుణం మంజురు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే, రుణాన్ని తీర్చేటప్పుడు EMI చెల్లించే బాధ్యత ఇద్దరిపైనా ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి తన వాటాను చెల్లించడం ఆపివేసినప్పుడు, మరొకరు కూడా ఈఎంఐలను పూర్తిగా చెల్లించలేకపోతే, అది జాప్యం అవుతుంది. చివరికి లోన్‌ డిఫాల్ట్‌కు దారితీస్తుంది. సహ-రుణగ్రహీత తన వాటాను చెల్లించడం ఆపివేసినప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.

ఇద్దరిపైనా ప్రభావం

ఉమ్మడి గృహ రుణాన్ని సాధారణంగా కటుంబసభ్యులతో తీసుకున్నప్పటికీ, సహ-రుణగ్రహీత తన EMI వాటాను చెల్లించడం మానేస్తే, అది రుణగ్రహీతలిద్దరిపైనా ప్రభావం చూపుతుంది. గృహ రుణగ్రహీతలు నెలవారీ వాయిదాల (EMI)ను సకాలంలో చెల్లించాలి. లేకపోతే ఆలస్య చెల్లింపులు పెనాల్టీలకు దారి తీస్తాయి. రుణగ్రహీతలపై ఆలస్య రుసుములతో భారం పడుతుంది. ఉమ్మడి గృహ రుణం తీసుకున్నప్పుడు ఈ పరిస్థితి మరింత సవాలుగా ఉంటుంది. గృహ రుణాన్ని ఉమ్మడిగా తీసుకున్నప్పుడు, సహ-రుణగ్రహీత తన వాటాను చెల్లించడం మానేస్తే, రుణగ్రహీతలిద్దరూ ప్రభావానికి గురవుతారు.

పెనాల్టీ

వాటాను చెల్లించని సహ-రుణగ్రహీత బాకీపై మొదటి వ్యక్తి బాధ్యత వహించొచ్చు. అంటే, సహ-యజమానికి ఈఎంఐ భారంగా ఉంటే ఆ భాగాన్ని కూడా మొదటి వ్యక్తి చెల్లించవచ్చు. ఇద్దరూ ఈఎంఐలను చెల్లించడం ఆపివేస్తే, రుణం జాప్యానికి గురయి చివరికి డిఫాల్ట్‌కు దారితీస్తుంది. రుణగ్రహీతలు EMI చెల్లించనప్పుడు, బ్యాంకు రుణగ్రహీతలిద్దర్నీ సంప్రదిస్తుంది. లేట్‌ ఛార్జీలతో 24 గంటలలోపు గృహరుణ EMIను చెల్లించమని అడుగుతుంది. పెనాల్టీ ఛార్జీలు సాధారణంగా EMIలో 1-2% మధ్య ఉంటాయి. ముఖ్యంగా ఉమ్మడి గృహ రుణం విషయంలో రుణ సంస్థ.. EMI ఆలస్యం గురించి రుణగ్రహీతలిద్దరికీ తెలియజేస్తుంది.

క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం

ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవడానికి మీ క్రెడిట్‌ స్కోర్‌ కీలకం. ఒక EMI ఆలస్యం అయినప్పటికీ, అది మీ క్రెడిట్‌ హిస్టరీలో నమోదవుతుంది. రుణగ్రహీతలిద్దరూ వారి ఖాతా నుంచి EMIలు చెల్లించనప్పుడు ఇద్దరి క్రెడిట్‌ స్కోరు పైనా ప్రభావం చూపుతుంది. రుణగ్రహీతలిద్దరి క్రెడిట్‌ స్కోర్‌లు దెబ్బతింటాయి. మీ క్రెడిట్‌ స్కోరు పడిపోయినట్లయితే..బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి భవిష్యత్తులో రుణం తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. EMIను 90 రోజుల్లోపు తిరిగి చెల్లించడంలో ఆలస్యమైనా, మిస్‌ అయినా అది మైనర్‌ డిఫాల్ట్‌గా బ్యాంకులు పరిగణిస్తాయి. ఈ సందర్భంలో, ఈ 90 రోజులను మించకుండా ఉండేందుకు గడువు తేదీ లోపు మీ EMIను చెల్లించడం ఉత్తమం. మీరు సకాలంలో తిరిగి చెల్లించడం కొనసాగిస్తే డిఫాల్ట్‌ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తే మీ క్రెడిట్‌ స్కోరు పునరుద్ధరణవుతుంది.

రుణగ్రహీతలు ఏం చేయాలి?

ఉమ్మడి గృహరుణం విషయంలో రుణగ్రహీతలిద్దరూ తిరిగి చెల్లించాల్సిన బాధ్యత వహిస్తారు. మీరు EMI చెల్లింపులను 90 రోజులకు పైగా ఆలస్యం చేస్తే, రుణానికి సంబంధించిన ఇంటిని వేలం వేయడానికి లేదా బకాయిలను తిరిగి పొందేందుకు రుణ సంస్థకు చట్టపరమైన హక్కు ఉంటుంది. దీన్ని నివారించడానికి, EMI చెల్లింపులను ట్రాక్‌ చేయండి. ఏదైనా EMI మిస్‌ అయినట్లయితే, వెంటనే మీ సహ-రుణగ్రహీతతో చర్చించి, బాకీ ఉన్న చెల్లింపులను క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకోండి.

Relinquishment డీడ్‌

ఈ చట్టపరమైన పత్రం..ఒక సహ యజమానికి సంబంధించిన ఆస్తి హక్కును మరొక యజమాని పేరుకు బదిలీ చేస్తుంది. మీ సహ-యజమాని ఆస్తిలో తన చట్టపరమైన హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే, రిజిస్టర్డ్‌ Relinquishment లేదా గిఫ్ట్‌ డీడ్‌ ద్వారా మీ పేరు మీద తన వాటాను బదిలీ చేయవచ్చు. ఆ తర్వాత, మీరొక్కరే రుణాన్ని చెల్లించవచ్చు లేదా ఆస్తిని విక్రయించొచ్చు. ఒక యజమాని తన వాటాను మరొకరి పేరు మీద బదిలీ చేస్తే బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (NOC) తీసుకోవడం మర్చిపోకూడదు.

చివరిగా: ఉమ్మడి గృహ రుణం తీర్చడం, రుణగ్రహీతలిద్దరి బాధ్యత. చెల్లింపుల సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ సహ-యజమానితో చర్చించి వివాదాన్ని పరిష్కరించుకోవాలి. రుణంపై డిఫాల్ట్‌ను నివారించాలి. ఎందుకంటే, ఇది రుణగ్రహీతలిద్దరికీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బంది పరిణామాలను కలిగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని