Apple WWDC 2023: మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ మరింత పెద్దగా.. 18 గంటల బ్యాటరీ లైఫ్‌

MacBook Air: తాజాగా జరిగిన వార్షిక సమావేశంలో యాపిల్‌ సరికొత్త మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ను పరిచయం చేసింది. దీని బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Updated : 06 Jun 2023 13:59 IST

కూపర్టినో: ఎంట్రీలెవెల్‌ మ్యాక్‌బుక్‌ కొనాలనుకునేవారికి ఇప్పటి వరకు 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (MacBook Air) మాత్రమే అందుబాటులో ఉండేది. తక్కువ మందంతో, లైట్‌ ఫ్రేమ్‌తో ఈ మ్యాక్‌ అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నప్పటికీ.. 13 అంగుళాల తెర మాత్రం చాలా మందిని నిరాశకు గురిచేసేది. ఈ నేపథ్యంలో తాజాగా యాపిల్‌.. 15 అంగుళాల తెరతో కొత్త మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ను (15-Inch MacBook Air) తీసుకొచ్చింది. అమెరికాలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన వార్షిక సమావేశం ‘వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC 2023)’లో యాపిల్‌ దీన్ని పరిచయం చేసింది.

15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ స్పెసిఫికేషన్లు.. 2022లో వచ్చిన ఎం2 మ్యాక్‌బుక్‌తో దాదాపు సరిపోలాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

  • 500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 2880 x 1864 పిక్సెల్స్‌తో కూడిన 15.3 అంగుళాల లిక్విడ్‌ రెటీనా ఐపీఎస్‌ ఎల్‌ఈడీ తెర.
  • 66.5-Wh Li-Po బ్యాటరీ. ఇది 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది.
  • 35 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ అవుతుంది. మ్యాగ్‌సేఫ్‌ 3 పోర్ట్‌ ఇచ్చారు.
  • ఫోర్స్‌ క్యాన్సిలింగ్‌ వూఫర్లతో కూడిన ఆరు స్పీకర్ల సౌండ్‌ సిస్టమ్‌ను పొందుపర్చారు.
  • 8- కోర్‌ సీపీయూ, 10- కోర్‌ జీపీయూ, 16- కోర్‌ న్యూరల్‌ ఇంజిన్‌తో కూడిన యాపిల్‌ ఎం2 చిప్‌.
  • 8జీబీ యునిఫైడ్‌ మెమొరీ. దీన్ని 16జీబీ లేదా 24జీబీకి కాన్ఫిగర్‌ చేయొచ్చు.
  • 156జీబీ స్టోరేజ్‌. దీన్ని 512జీబీ లేదా 1టీబీ లేదా 2టీబీకి కాన్ఫిగర్‌ చేయొచ్చు.
  • వైఫై 6, బ్లూటూత్‌ 5.3
  • 1080పిక్సెల్‌ ఫేస్‌టైమ్‌ హెచ్‌డీ కెమెరా
  • రెండు థండర్‌బోల్ట్‌ 3 (USB 4) పోర్ట్‌లు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌

పెద్ద స్క్రీన్‌, బ్యాటరీ, అదనంగా రెండు స్పీకర్లు మినహా 13 అంగుళాల, 15 అంగుళాల ఎం2 మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ మధ్య పెద్దగా మార్పులేమీ లేవు.

15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ధర

8GB యునిఫైడ్‌ మెమొరీ 256జీబీ స్టోరేజ్‌తో వచ్చే 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ (15-Inch MacBook Air) బేస్‌ మోడల్‌ ధర 1,299 డాలర్లు. అదే 512జీబీ స్టోరేజ్ కావాలంటే ధర 1,499 డాలర్లకు పెరుగుతుంది. యాపిల్‌ స్టోర్‌ ఆన్‌లైన్‌లో దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. జూన్‌ 13, 2023 నుంచి స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.

ఎం2 అల్ట్రా చిప్‌సెట్‌..

WWDC 2023లో యాపిల్‌ కొత్త సిలికాన్‌ చిప్‌సెట్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీన్ని ఎం2 అల్ట్రా (M2 Ultra chipset)గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సిలికాన్‌ చిప్స్‌ ఎం2 సిరీస్‌లో ఇది లేటెస్ట్‌ ఎడిషన్‌. ఎం2, ఎం2 మ్యాక్స్‌కు తాజాగా ఎం2 అల్ట్రా జత కానుంది. రాబోయే కొత్త మ్యాక్ స్టూడియో, మ్యాక్‌ ప్రొలో ఇవే ఉండనున్నాయి.

ఇప్పటి వరకు కంపెనీ తీసుకొచ్చిన చిప్‌సెట్‌లలో ఎం2 అల్ట్రా (M2 Ultra chipset)నే పెద్దది. దీన్ని రెండో తరం 5- నానోమీటర్‌ ప్రాసెసర్‌తో రూపొందించారు. రెండు ఎం2 మ్యాక్స్‌ చిప్స్‌ను అల్ట్రాఫ్యూజన్‌ టెక్నాలజీతో కనెక్ట్‌ చేశారు. దీంతో పెర్ఫార్మెన్స్‌ రెండింతలవుతుందని యాపిల్‌ తెలిపింది. ఈ కొత్త చిప్‌లో 134 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు ఉంటాయి. 

కొత్త మ్యాక్‌ స్టూడియో..

మ్యాక్‌ స్టూడియో (Mac Studio)ను సైతం యాపిల్‌ ఆధునికీకరించింది. ఎం2 మ్యాక్స్‌, ఎం2 అల్ట్రా చిప్స్‌తో అప్‌గ్రేడ్‌ చేసింది. ఇంటెల్‌ ఆధారిత 27 అంగుళాల ఐమ్యాక్‌తో పోలిస్తే తాజా స్టూడియో ఆరు రెట్లు వేగంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఎం1 అల్ట్రా చిప్‌ మ్యాక్‌ స్టూడియోతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా ఉంటుందని పేర్కొంది.

ఎం2 మ్యాక్స్‌ మ్యాక్‌ స్టూడియో (Mac Studio)లో 12-కోర్‌ సీపీయూ, 38-కోర్‌ జీపీయూ, 96జీబీ యునిఫైడ్‌ మెమొరీ, 400GB/s మెమొరీ బ్యాండ్‌విడ్త్‌ ఫీచర్లు ఉన్నాయి. 3డీ ఆర్టిస్టులు మోషన్‌ గ్రాఫిక్స్ వంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌ను 50 శాతం వేగంగా చేయొచ్చని యాపిల్‌ తెలిపింది. ఎక్స్‌కోడ్‌తో చేసే కొత్త వెర్షన్‌ యాప్‌లను 25 శాతం వేగంగా పూర్తి చేయొచ్చని పేర్కొంది.

మరోవైపు ఎం2 అల్ట్రా మ్యాక్‌ స్టూడియో ఎం1 అల్ట్రాతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా ఉంటుందని తెలిపింది. 24- కోర్‌ సీపీయూ, 76- కోర్‌ జీపీయూ, 192జీబీ యునిఫైడ్‌ మెమొరీ, 800GB/s మెమొరీ బ్యాండ్‌విడ్త్‌ ఫీచర్లు ఉన్నాయి.

కొత్త మ్యాక్ ప్రో..

‘మ్యాక్‌ ప్రో (Mac Pro)’ను సైతం ఎం2 అల్ట్రా చిప్‌తో అప్‌డేట్‌ చేశారు. దీంట్లో 192GB మెమొరీ, 800GB/s యూనిఫైడ్‌ మెమొరీ బ్యాండ్‌విడ్త్‌ ఉన్నాయి. జనరేషన్‌ 4ను సపోర్ట్‌ చేసే ఏడు PCle ఎక్స్‌ప్యాన్షన్‌ స్లాట్లు, ఆరు ఓపెన్‌ ఎక్స్‌ప్యాన్షన్‌ స్లాట్లు మ్యాక్‌ ప్రోలో అందుబాటులో ఉన్నాయి. జూన్‌ 13 నుంచి ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది. దీంట్లో టవర్‌ ఎన్‌క్లోజర్‌, ర్యాక్‌ ఎన్‌క్లోజర్‌ రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని