Aviation: 12% విమానాల్లో సమస్యలు.. రోజులుగా నేలకే పరిమితం: సీఏపీఏ

Aviation: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 12 శాతం విమానాలు గతకొన్ని రోజులుగా నేలకే పరిమితమయ్యాయని సీఏపీఏ తెలిపింది. 

Published : 01 Nov 2022 23:41 IST

ముంబయి: నిర్వహణ, ఇంజిన్‌లో లోపాల కారణంగా దాదాపు 75కి పైగా విమానాలను భారతీయ విమానయాన సంస్థలు పక్కకు పెట్టాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా ఇవి నేలకే పరిమితమయ్యాయని పేర్కొంది. భారత్‌లో ఉన్న విమానాల సంఖ్యలో వీటి వాటా 10-12 శాతం. దీని వల్ల ఈ ఏడాది ద్వితీయార్ధంలో సంస్థల ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని సీఏపీఏ చెప్పింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న విమానయాన రంగానికి ఇదో పెద్ద సవాల్‌ అని తెలిపింది. నమోదిత సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్‌ సహా ఇతర సంస్థలేవీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొంది.

సంస్థల ఆర్థిక పనితీరు దెబ్బతింటే కొత్త విమానాల కొనుగోలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఏపీఏ తెలిపింది. దీంతో ఇప్పటికే అద్దెకు తీసుకున్న విమానాల లీజు గడువును పొడిగించుకోవాల్సి వస్తుందని పేర్కొంది. తిరిగి ఇది కంపెనీలకు ఆర్థిక భారంగా మారుతుందని చెప్పింది. పైగా వీటి నిర్వహణ, ఇంధన వ్యయం కూడా అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ సమస్యలకు పైలట్లు, ఇంజినీర్ల కొరత కూడా వచ్చే ఏడాదికల్లా జతయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని