PVR: ఐనాక్స్‌ లీజర్స్‌తో విలీనానికి పీవీఆర్‌ వాటాదారుల ఆమోదం..!

ఐనాక్స్‌ లీజర్స్‌తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు మల్టీప్లెక్స్‌ నిర్వహణ సంస్థ పీవీఆర్‌ బుధవారం వెల్లడించింది.

Updated : 22 Nov 2022 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఐనాక్స్‌ లీజర్స్‌తో విలీనానికి తమ వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు మల్టీప్లెక్స్‌ నిర్వహణ సంస్థ పీవీఆర్‌ బుధవారం వెల్లడించింది. ముంబయిలోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సూచనల మేరకు మంగళవారం పీవీఆర్‌ వాటాదారుల సమావేశం నిర్వహించింది. దీనిలో విలీనం ప్రతిపాదనకు 99శాతం మంది ఆమోద ముద్ర వేసినట్లు పీవీఆర్‌ పేర్కొంది.

ఈ ఏడాది మార్చి 27న పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్స్‌ను విలీనం చేసి దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ రెండు సంస్థలకు కలిపి 1,500 స్క్రీన్‌లు ఉన్నాయి. టైర్‌-3,4,5 నగరాల్లో కూడా వీటికి అవకాశాలు తెరుచుకోనున్నాయి. తమ విలీనానికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ నుంచి క్లియరెన్స్‌ పొందినట్లు ఈ ఏడాది జూన్‌లో పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్స్‌ పేర్కొన్నాయి. ఈ సంయుక్త సంస్థకు ‘పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌’గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న స్క్రీన్లకు వేర్వేరుగా పీవీఆర్‌, ఐనాక్స్‌ పేర్లు కొనసాగనున్నాయి. కానీ, కొత్తగా ఏర్పాటు చేసే వాటిని మాత్రం పీవీఆర్‌ ఐనాక్స్‌గా వ్యవహరించనున్నారు.

ఈ రెండు సంస్థల విలీనంపై అంతకుముందు ‘కట్స్‌’ అనే లాభాపేక్ష లేని సంస్థ కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేసింది. ఇది చిత్ర ప్రదర్శనా రంగంలో పోటీ నిర్మూలనకు కారణమవుతుందని పేర్కొంది. ఈ డీల్‌పై సమగ్ర విచారణ నిర్వహించాలని కోరింది. ఈ ఫిర్యాదును సెప్టెంబర్‌ 13న సీసీఐ తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని