Social Media: పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయ్‌.. సోషల్‌ మీడియాపై న్యూయార్క్‌ ప్రభుత్వం దావా

Social Media: సామాజిక మాధ్యమ యాప్‌ల వాడకం వల్ల పిల్లల్లో మానసిక రుగ్మతలు తలెత్తుతున్నాయని కోర్టులో వేసిన దావాలో న్యూయార్క్‌ నగర ప్రభుత్వం ఆరోపించింది.

Published : 15 Feb 2024 14:59 IST

న్యూయార్క్‌: టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల (Social Media) మాతృ సంస్థలపై కోర్టులో దావా వేసినట్లు న్యూయార్క్‌ నగర మేయర్ ఎరిక్‌ ఆడమ్స్‌ వెల్లడించారు. వీటి వల్ల నగరంలోని పిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఆరోపించారు. చిన్న వయసు వారిని ఆకర్షించేలా ఈ సంస్థలు కావాలనే తమ ప్లాట్‌ఫామ్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు.

ఈ విషయంలో నగర చట్టాలను ఆయా సామాజిక మాధ్యమ సంస్థలు (Social Media) ఉల్లంఘించాయని దావాలో ఆరోపించారు. ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించటం, వారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడమే అవుతుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ యాప్‌ల వాడకం వల్ల పిల్లల్లో తలెత్తుతున్న మానసిక రుగ్మతలతో నగరంలోని స్కూళ్లు, ఆరోగ్య, సామాజిక సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. గత దశాబ్దకాలంగా ఈ ధోరణి కొనసాగుతోందని.. చివరకు జాతీయస్థాయిలో ఇది మానసిక ఆరోగ్య సంక్షోభానికి తెరతీస్తోందన్నారు.

దావా వేసిన వారిలో న్యూయార్క్‌ నగరపాలికతో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, న్యూయార్క్‌ హెల్త్‌ అండ్‌ హాస్పిటల్స్‌ కార్పొరేషన్‌ ఉన్నాయి. ఈ సంక్షోభానికి సామాజిక మాధ్యమ కంపెనీలను బాధ్యులను చేయటంతో పాటు తీరు మార్చుకునేలా వాటికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు జరిగిన నష్టానికి పరిహారం కూడా ఇప్పించాలని కోరారు.

ఈ దావాలో పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవం లేదని గూగుల్‌ ప్రతినిధి అన్నారు. యువకులు, పిల్లలకు ఆరోగ్యకరమైన కంటెంట్‌ను అందించడం తమ తొలి ప్రాధాన్యంగా పని చేస్తున్నామన్నారు. వయసును బట్టే కంటెంట్‌ను అందించేందుకు గత దశాబ్దకాలంగా పనిచేస్తున్నామని టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి తెలిపారు. పిల్లలకు అందుబాటులో ఉండే సమాచారాన్ని నియంత్రించేలా తల్లిదండ్రులకు ప్రత్యేకమైన ఫీచర్లను ఇచ్చామని చెప్పారు. మరోవైపు పిల్లలకు మాత్రమే ప్రత్యేకమైన కంటెంట్‌ను అందించేలా తమ ప్లాట్‌ఫామ్‌లో 30కి పైగా టూల్స్‌ ఉన్నాయని మెటా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని