Oil Prices: ఇజ్రాయెల్‌- హమాస్‌ ఎఫెక్ట్‌.. పెరిగిన చమురు ధరలు!

Oil Prices: ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఈరోజు చమురు ధరలు పెరిగాయి. ఇవి మరింత ముదిరితే ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Published : 09 Oct 2023 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ భీకర పోరు (Israel- Hamas Conflict) నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు (Crude Oil Prices) పెరిగాయి. గతవారం దాదాపు ఎనిమిది శాతం తగ్గిన ధరలు.. సోమవారం మళ్లీ 4 శాతం ఎగబాకాయి. ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel- Hamas Conflict) మధ్య నెలకొన్న యుద్ధం పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తెరతీసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. చమురు ఉత్పత్తిలో ఈ ప్రాంతానిదే సింహ- భాగం అయిన నేపథ్యంలో ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌లో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర నాలుగు శాతానికి పైగా పెరిగి 87.5 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఎస్‌ రకం ధర 85.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి (Israel- Hamas Conflict) వల్ల చమురు సరఫరాపై తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయంగా తరచూ అనేక అనిశ్చితులు ఎదుర్కొనే ఇజ్రాయెల్‌ (Israel).. రోజుకి మూడు లక్షల పీపాల సామర్థ్యం ఉన్న రెండు చమురు శుద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి, శుద్ధి, సరఫరాపై తక్షణం ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని అంచనా! అయితే, ఉద్రిక్తతలు మరింత ముదిరి, సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. హమాస్‌ (Hamas)కు ఇరాన్‌ మద్దతుగా ఉందని వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్న అంశం. అయితే, పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని సర్దుబాటు చేస్తామని ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలైన బహ్రైన్‌, ఇరాక్‌, కువైట్‌, ఒమన్‌, యూఏఈ, సౌదీ అరేబియా హామీ ఇచ్చాయి. తద్వారా ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌లో చమురు ధరల్ని స్థిరంగా ఉంచుతామని ప్రకటించాయి.

కలవరపెడుతున్న ముడిచమురు ధరలు

ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో ఇరాన్‌ (Iran) కూడా ఒకటి. తాజాగా ఈ దేశం హమాస్‌ (Hamas)కు మద్దతిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా ఒకవేళ ఇరాన్‌ (Iran)పై దాడులు జరిగితే పరిస్థితులు దిగజారుతాయి. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు తప్పవు. గతంలో ఓసారి అమెరికా యుద్ధనౌకల్ని పంపేందుకు యత్నించిన సమయంలో హర్ముజ్‌ను మూసివేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. తాజా ఉద్రిక్తతలు ప్రస్తుతం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, సౌదీ అరేబియా సహా ఇతర దేశాల వరకు పాకితే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే ఉద్రిక్తతలు ఇతర ప్రాంతాలకు పాకే అవకాశాలు చాలా తక్కువేనని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని