Nirmala Sitharaman: రాష్ట్రాలు అంగీకరిస్తే.. జీఎస్‌టీ కిందకు పెట్రోల్‌: నిర్మలా సీతారామన్‌

రికార్డు స్థాయిలో ఉన్న పెట్రోల్‌ (Petrol) ధరలను నియంత్రించేందుకు వాటిని జీఎస్‌టీ (GST) పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 15 Feb 2023 17:40 IST

దిల్లీ: పెట్రోల్ (Petrol)‌, డీజిల్ (Diesel)‌, గ్యాస్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. రాష్ట్రాలు అంగీకరిస్తే వెంటనే వాటిని జీఎస్‌టీ కిందకు తీసుకొస్తామన్నారు. బుధవారం ఆమె పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (PHDCCI) సభ్యులతో బడ్జెట్‌ అనంతర చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను (GST) పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తుల (petroleum products)ను తీసుకొచ్చే అంశంపై అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ.. ‘‘రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుంది’’ అని తెలిపారు.

ఈ సందర్భంగా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ గురించి నిర్మలమ్మ మాట్లాడుతూ.. ‘‘దేశవృద్ధి కోసం ప్రభుత్వ వ్యయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. తాజా బడ్జెట్‌లోనూ మూలధన వ్యయాన్ని 33శాతం పెంచి రూ.10లక్షల కోట్లకు చేర్చాం’’ అని ఆమె (Nirmala Sitharaman)  తెలిపారు. ఇక, కేంద్ర విద్యుత్‌ సహా పలు రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను రాష్ట్రాలు కూడా అమలు చేసేలా ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు.

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ (Petrol)‌, డీజిల్‌ (Diesel) ధరలు స్థిరంగా ఉంటున్నప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో వాటి ధరలు రూ.100 దరిదాపుల్లో, కొన్ని చోట్ల వంద పైనే ఉన్నాయి. ఇలా రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగిపోవడంతో వీటిని జీఎస్‌టీ (GST) పరిధిలోకి తెచ్చి నియంత్రించాలనే కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇందుకు కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఇప్పటివరకు జీఎస్‌టీ మండలిలో దీనిపై ఎలాంటి ప్రతిపాదనలు చర్చకు రాలేదు. మరోవైపు పెట్రోల్‌ను జీఎస్‌టీ (GST) పరిధిలోకి తెచ్చే అంశంపై రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని