Adani Group: అదానీపై హిండెన్‌బర్గ్‌ ఆరోపణలకు ఏడాది.. 7 షేర్లు ఇంకా దిగువనే!

Adani Group: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు వెలువడి ఏడాది గడిచిన వేళ అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ స్పందించారు. ఏడాది కాలంలో తాము మరింత దృఢంగా మారామని పేర్కొన్నారు.

Updated : 25 Jan 2024 14:05 IST

ముంబయి: అదానీ గ్రూప్‌ (Adani Group) అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఆరోపణలు చేసి ఏడాది గడిచింది. దేశ స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర కుదుపునకు కారణమైన ఈ ఉదంతంతో అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. పదింటిలో ఇప్పటికీ ఏడు సంస్థల షేర్లు మునుపటితో పోలిస్తే దిగువనే ట్రేడవుతున్నాయి.

మార్కెట్‌ క్యాప్‌ ఇంకా 24%..

స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా ప్రకారం.. హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఆరోపణలకు ముందు రూ.19.23 లక్షల కోట్ల వద్ద అదానీ గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌ (Adani Group Market Cap) రికార్డు గరిష్ఠానికి చేరింది. 2024 జనవరి 24న స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి ఈ విలువ రూ.14.52 లక్షల కోట్లుగా ఉంది. అంటే గరిష్ఠం నుంచి ఇంకా 24 శాతం పుంజుకోవాల్సి ఉంది.

ఇదీ షేర్ల పరిస్థితి..

అదానీ గ్రూప్‌లోని (Adani Group) మొత్తం పది నమోదిత సంస్థల్లో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అదానీ పవర్‌, అంబుజా సిమెంట్స్ షేర్ల ధరలు మాత్రమే  మునుపటి స్థాయికి చేరాయి. గత ఏడాది వ్యవధిలో అదానీ పవర్‌ 89 శాతం, అదానీ పోర్ట్స్‌ 47 శాతం, అంబుజా సిమెంట్స్‌ షేర్లు 5 శాతం రాణించాయి. మిగిలిన కంపెనీల షేర్లన్నీ ఇంకా దిగువ స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. 2024 జనవరి 24 ముగింపు ధరలను పరిగణనలోకి తీసుకుంటే అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు 74 శాతం, అదానీ విల్మర్‌ 38 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 15 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 14 శాతం, ఎన్‌డీటీవీ 6 శాతం, ఏసీసీ 4 శాతం మేర పుంజుకోవాల్సి ఉంది.

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అదానీ గ్రూప్‌.. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది. రుణ వాయిదాలను ముందస్తుగానే చెల్లించింది.  కొత్తగా నిధులను సమీకరించుకుంది. మరోవైపు హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సెబీ దర్యాప్తు, ఆరోపణలపై ఇతర సంస్థల విచారణ అవసరం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల వంటి పరిణామాలూ షేర్లు కనిష్ఠాల నుంచి పుంజుకోవడానికి దోహదం చేశాయి.

మరింత దృఢంగా మారాం: గౌతమ్‌ అదానీ

హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు గత ఏడాది వ్యవధిలో తమని మరింత దృఢంగా మార్చాయని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani) అన్నారు. ఈ అనుభవం తమకు విలువైన పాఠాలు నేర్పిందని తాజాగా ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. సాధారణంగా షార్ట్‌ సెల్లర్ల ఆరోపణలు కేవలం ఫైనాన్షియల్‌ మార్కెట్లకు మాత్రమే పరిమితమవుతాయన్నారు. కానీ, అదానీ గ్రూప్‌పై వచ్చినవి మాత్రం రాజకీయ రంగు కూడా పులుముకున్నాయని ఆరోపించారు. నిరాధార ఆరోపణల వల్ల వేలాదిమంది రిటైల్‌ మదుపరులు నష్టపోవడం తనను తీవ్రంగా బాధించిందని గౌతమ్‌ అదానీ అన్నారు. తమపై ఆరోపణలు గుప్పించిన వారి ప్రణాళికలు పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదన్నారు. లేదంటే దేశంలో చాలా కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్‌ ప్రాజెక్టులపై పెనుప్రభావం ఉండేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు తమకు కొత్త కాదని, ఇకపై ఆగుతాయన్న భ్రమలోనూ లేమని చెప్పారు.

ఇవీ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు..

అదానీ గ్రూప్‌ (Adani Group) తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన నివేదికలో అమెరికా షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది. వీటి ద్వారానే అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్‌ (Adani Group) తీవ్రంగా ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని