Pakistan: ఐఎంఎఫ్‌ మెప్పు కోసం పాక్‌ పాకులాట.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.272కు పెంపు!

Pakistan: పాక్‌ ఇబ్బందులు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఐఎంఎఫ్‌ నుంచి బెయిలవుట్‌ ప్యాకేజీ తెచ్చుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని గణనీయంగా పెంచింది.

Updated : 16 Feb 2023 11:25 IST

ఇస్లామాబాద్: భారీ పన్నుల వడ్డనతో కూడిన మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గంటల్లోనే పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వం పెట్రో ధరలను కూడా గణనీయంగా పెంచింది. దీంతో అక్కడి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరాయి. ఐఎంఎఫ్‌ (IMF)ను ఒప్పించి బెయిలవుట్‌ ప్యాకేజీలో భాగంగా తొలి విడత రుణసాయాన్ని విడుదల చేయించుకునే వ్యూహంతోనే ధరల్ని అమాంతం పెంచింది.

ప్రస్తుతం దాయాది దేశంలో లీటర్‌ పెట్రోల్‌ ధర (Petrol Price) రూ.272 (పాకిస్థానీ రూపాయలు)కు చేరింది. రూ.22.20 పెంచారు. మరోవైపు హైస్పీడ్‌ డీజిల్‌ ధర లీటర్‌పై రూ.17.80 పెరిగి రూ.280కి ఎగబాకింది. లైట్‌ డీజిల్‌ ధర రూ.9.68 ఎగబాకి రూ.196.68కు చేరింది. కిరోసిన్‌ ధర లీటర్‌పై రూ.12.90 పెరిగి రూ. 202.73కు చేరింది. కొత్త ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

బెయిలవుట్‌ ప్యాకేజీ కింద రుణసాయాన్ని అందించాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచాలని ఐఎంఎఫ్‌ షరతు విధించింది. దీంతో ఇప్పటికే రికార్డు గరిష్ఠానికి చేరిన ద్రవ్యోల్బణం (Inflation) మరింత పెరిగే ప్రమాదం ఉంది. 2023 ప్రథమార్ధంలో పాక్‌లో ద్రవ్యోల్బణం సగటున 33 శాతానికి చేరే అవకాశం ఉందని మూడీస్‌ అనలిటిక్స్‌ సీనియర్‌ ఆర్థికవేత్త కత్రినా ఎల్‌ అంచనా వేశారు. అలాగే ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్యాకేజీ ఒక్కటే పాక్‌ను గట్టెక్కించలేదని తెలిపారు.

బడ్జెట్‌ లోటును తగ్గించుకొని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం బుధవారం మినీ బడ్జెట్‌ను ఆవిష్కరించింది. మరోవైపు ‘జనరల్‌ సేల్స్‌ ట్యాక్స్‌ (GST)’ను 17 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. తద్వారా అదనంగా 115 బిలియన్‌ రూపాయల పన్ను వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరో 55 బిలియన్‌ రూపాయల ఆదాయం మినీ బడ్జెట్‌లో తీసుకున్న చర్యల ద్వారా రావొచ్చని ఆశిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని