PMJJBY: రూ.436తో రూ.2 లక్షల బీమా సౌకర్యం.. ఈ స్కీమ్‌లో చేరారా?

PMJJBY: సామాన్యులకు జీవిత బీమా ప్రయోజనాలు అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రీమియం వివరాలు తెలుసుకోండి..

Updated : 15 May 2023 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే అనుకోని పరిస్థితుల కారణంగా ఆ వ్యక్తి మరణిస్తే ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. జీవిత బీమా ఉంటే కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే చాలా మందికి జీవిత బీమా పట్ల అవగాహన ఉన్నా.. ప్రీమియం ఎక్కువ ఉంటుందన్న కారణంతో వాటికి దూరంగా ఉంటున్నారు. ఈ కారణంతోనే సామాన్యులకు సైతం జీవిత బీమా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (PMJJBY)ను 2015లోనే ప్రవేశపెట్టింది. బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి ఏ కారణంతోనైనా మరణిస్తే రూ.2లక్షల బీమా డబ్బు మొత్తం కుటుంబానికి అందుతుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 16.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద 6.64 లక్షల కుటుంబాలు రూ.13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందాయి. ఈ పథకం పూర్తి వివరాలు ఇవీ.. 

అర్హత

  •  18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు.
  • బ్యాంకు/ పోస్టాఫీసులో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు.
  •  ఇందుకోసం బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. కేవైసీ చేయించడం తప్పనిసరి.
  •  ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు కలిగి ఉంటే, ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే పథకానికి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రెండింటి ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినప్పటికీ ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
  •  పాలసీదారుకు 55 సంవత్సరాల వరకు జీవిత బీమా పొందేందుకు వీలుంటుంది.
  •  ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

కాల వ్యవధి

ఈ పథకం ఒక ఏడాది కాల పరిమితితో వస్తుంది. జూన్‌ 1 నుంచి మే 31 వరకు అమల్లో ఉంటుంది. ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31 మధ్య ప్రీమియం మొత్తం ఆటో డెబిట్‌ ద్వారా రెన్యువల్‌ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్‌ చేసుకోవాలనుకుంటే.. రద్దు కోసం బ్యాంకును కోరాలి. కొత్తగా ఈ పథకంలో చేరే వారికి జూన్‌ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్‌ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే క్లెయిమ్‌కు అనుమతి ఉంటుంది. ఒకవేళ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే క్లెయిమ్‌ కోసం దాఖలు చేసుకోవచ్చు.

ప్రీమియం

సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రపు ప్రీమియంతో జీవిత బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.330తో ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. ఇప్పుడు ఆ ప్రీమియంను రూ.436కు పెంచారు. ఆటోడెబిట్‌ ద్వారా బ్యాంకు/పోస్టాఫీసు ఖాతా నుంచి ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. అయితే, పథకంలో చేరే నెలను అనుసరించి ప్రీమియం మారుతూ ఉంటుంది. జూన్‌- ఆగస్టు మధ్యలో చేరితే ఆ ఏడాదికి రూ.436, సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో చేరితే రూ.342, డిసెంబరు-ఫిబ్రవరి మధ్య చేరితే రూ.228, అదే మార్చి- మే మధ్య అయితే రూ. 114 ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో జాయిన్ అయ్యేవారు ప్రీమియం మొత్తాన్ని ఏటా ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలి.

బీమా హామీ

పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షల హామీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. ఇది ప్యూర్‌ టర్మ్‌ పాలసీ కావటంతో మొచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే లబ్ధిదారునికి హామీ మొత్తం చెల్లిస్తారు. ఈ పాలసీ నియమం ప్రకారం.. ప్రీమియం చెల్లించిన ఏడాదికి మధ్యలో నిలిపివేయడం గానీ, వెనక్కి ఇచ్చేయడం గానీ సాధ్యం కాదు.

ఇవి గుర్తుంచుకోండి..

  •  ప్రీమియం డబ్బును ఆటోమేటిక్‌గా బ్యాంకులు తీసుకొనేందుకు అనుమతించాలి. ఒకవేళ డెబిట్‌ అయ్యే సమయంలో తగినంత బ్యాలెన్స్ ఖాతాలో లేనప్పుడు బీమా పాలసీ రద్దవుతుంది. 
  •  ఈ పథకంలోకి చేరిన సభ్యుడు 55 ఏళ్ల వయసుకు చేరినప్పుడు బీమా రద్దవుతుంది.
  •  వివిధ బ్యాంకుల ద్వారా ఒకటి మించి పాలసీలు తీసుకుంటే కవరేజీ మాత్రం రూ.2 లక్షలకే ఇస్తూ ఇతర బ్యాంకుల కవరేజ్‌ను రద్దు చేస్తారు.

చివరగా: తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యం అందిస్తున్న పథకం ఇది. ఏడాదికి రూ.436 అంటే నెలకు రూ.36 చొప్పున చెల్లించి రూ.2లక్షలు బీమా సదుపాయం పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని