Credit Card: క్రెడిట్‌ కార్డు ఈఎంఐ.. ఇవి చూశాకే!

క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుని వాయిదాల్లో చెల్లించవచ్చు. మరి, ఇది ఎంత వరకు ఉపయోగకరమో చూద్దాం.

Updated : 29 May 2023 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గృహోపకరణాల దగ్గర నుంచి దుస్తుల దాకా ఎక్కడ చూసినా భారీ రాయితీలు ఆహ్వానం పలుకుతుంటాయి. సాధారణ స్థాయి కంటే మనల్ని ఎక్కువగా ఖర్చు పెట్టేలా ఆఫర్లు ఊరిస్తుంటాయి. అలాంటప్పుడు మన దగ్గర నగదు లేకపోయినా క్రెడిట్‌ కార్డు ఉంటే కొనుగోళ్లను పూర్తి చేయొచ్చు. ఒకేసారి బిల్లు చెల్లించే సామర్థ్యం లేనప్పుడు ‘నెలవారీ వాయిదాల’ రూపంలోనూ చెల్లించే వెసులుబాటు ఉంది. ఇలాంటి కొనుగోళ్లను ప్రోత్సహించడానికే క్రెడిట్ కార్డు కంపెనీలు కూడా రకరకాల ఆఫర్లను ప్రవేశ పెడుతుంటాయి. క్యాష్ బ్యాక్‌, ఈఎంఐ, బై నౌ పే లేటర్‌ వంటివి ఇందులో భాగమే. వినడానికి బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం వీటితో కొంత ఇబ్బందే. సౌకర్యం మాటున దాగిన రహస్యాలను తెలుసుకోకుంటే జేబుకు భారం తప్పదు.

సౌకర్యమే! అయినా..

క్రెడిట్ కార్డు మీద భారీ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు వాయిదాల్లో చెల్లించడం ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. గృహ రుణం, వ్యక్తిగత రుణం చెల్లించినట్లుగానే ఇదీ ఉంటుంది. తాత్కాలికంగా చేతిలో డబ్బు లేనప్పుడు ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశం. ఈఎంఐ సౌకర్యాన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా కొన్ని ప్రత్యేక దుకాణాల్లో కొనుగోళ్లు జరిపినప్పుడు మాత్రమే ఈ సౌకర్యం అందించవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు లాంటివి ఖాతాదారులను బట్టి 0%, 1.49%, 1.99% వరకూ వడ్డీ విధిస్తాయి. ఇలాంటి రుణాలకు ఎలాంటి పత్రాలూ అవసరం ఉండవు. ఈఎంఐ తీసుకునే ముందు వడ్డీ, ఇతర వివరాల గురించి క్రెడిట్ కార్డు కంపెనీతో చర్చించడం మర్చిపోకండి.

ఎప్పుడు తీసుకోవాలంటే..?

నగదు లభ్యత కష్టకరంగా ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు ఈఎంఐ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే అనవసరంగా రుసుములు భరించాల్సి ఉంటుంది. పైగా, బ్యాంకులు 30-40 శాతం వార్షిక వడ్డీ కూడా విధిస్తాయి. సకాలంలో బాకీ చెల్లించకపోతే క్రెడిట్ స్కోరుపై కూడా ప్రభావం పడుతుంది. దీని కన్నా కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించడం సులువు.

పరిమితి

ఈఎంఐ చెల్లించినన్ని రోజులూ కార్డు పరిమితిని గరిష్ఠంగా ఉపయోగించుకోలేరు. ఉదాహరణకు మీ కార్డు గరిష్ఠ పరిమితి రూ.50 వేలు అనుకుందాం. రూ.25 వేలను ఈఎంఐ కింద చెల్లించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు, మీ కార్డు మీద రూ.25 వేల వరకే కొనుగోలు చేసే వీలు ఉంటుంది. ఈఎంఐ చెల్లిస్తున్న కొద్దీ పరిమితి కూడా పెరుగుతుంది.

అదనపు రుసుములు

పేరుకు సున్నా శాతం వడ్డీ అయినప్పటికీ డాక్యుమెంటేషన్, ప్రాసెసింగ్ ఫీజు కింద బ్యాంకులు కొంత మొత్తాన్ని వాసులు చేస్తాయి. వ్యవధి తీరక ముందు చెల్లించాలనుకుంటే బాకీ ఉన్న మొత్తంపై 3 శాతం వరకు రుసుము విధిస్తాయి. కాబట్టి, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందుబాటులో ఉన్న ఇతర అవకాశాలను చూడడం ఉత్తమం.

రాయితీలు

కొన్ని సందర్భాల్లో క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై 5 నుంచి 10 శాతం వరకు రాయితీలు కూడా ప్రకటిస్తుంటారు. ఒక విధంగా ఇది కాష్ బ్యాక్ ఆఫర్ లాంటిదే. పైగా ఈఎంఐగా కూడా మార్చుకోవచ్చు. అయితే, కేవలం వీటిని ఆధారంగా చేసుకునే కొనుగోలు చేయకుండా.. నిజంగా మీకు ఎంత వరకు అవసరం అన్నది చూసుకోండి.

చెల్లించకపోతే?

ఒకసారి ఈఎంఐగా మార్చుకున్న తరువాత కచ్చితంగా నెల నెలా బాకీని చెల్లించాలి. ఒక్కసారి చెల్లించకపోయినా అధిక మొత్తంలో రుసుములు విధిస్తారు. పైగా, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్డు బాకీగా మార్చి మరుసటి నెల బిల్లులో కలిపి పంపిస్తారు.

చివరిగా: క్రెడిట్ కార్డు రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అత్యవసరం అనుకుంటేనే కార్డును పరిమితికి మించి ఉపయోగించి కొనుగోళ్లు చేయాలి. వాయిదాల్లో కట్టేందుకు అవకాశం ఉంది కదా అని అక్కర్లేనివన్నీ కొంటే.. మన ఆర్ధిక ప్రణాళిక దెబ్బ తింటుందన్న విషయం మర్చిపోకూడదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు