Recession: 2024 మార్చి వరకు ఆర్థికమాంద్యం.. ఎలాన్‌ మస్క్‌ అంచనా!

ఐరోపా, చైనాలో మాంద్యం పరిస్థితుల వల్ల టెస్లా వాహనాలకు గిరాకీ తగ్గిందన్న మస్క్‌.. అది 2024 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.

Published : 21 Oct 2022 16:47 IST

ఫ్లోరిడా: ఆర్థిక మాంద్యం 2024 మార్చి వరకు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. అయితే, ఇది కేవలం తన అంచనా మాత్రమేనన్నారు. అంతకుముందు చైనా, ఐరోపాలో ఆర్థికమాంద్యం వంటి పరిస్థితుల వల్ల తమ విద్యుత్తు వాహనాలకు గిరాకీ తగ్గిందని మస్క్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఓ ట్విటర్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 2024 వరకు మాంద్యం కొనసాగే అవకాశం ఉన్నట్లు తాను భావిస్తున్నానని మస్క్‌ బదులిచ్చారు. అయితే, ఆయన చైనా, ఐరోపాలోని మాంద్యం గురించి చెప్పారా లేక ప్రపంచ మాంద్యం గురించి మాట్లాడారా అన్నది తెలియరాలేదు. టెస్లా కార్లకు గిరాకీ తగ్గిందన్న మస్క్‌ వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం కంపెనీ షేరు 6.6 శాతం తగ్గి 207.28 డాలర్లకు పడిపోయింది.

మస్క్‌ ప్రపంచ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మాంద్యంపై ఇటీవలి కాలంలో పలుసార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. జులైలో కంపెనీ వాటాదారులతో మాట్లాడుతూ.. స్థూల ఆర్థిక వ్యవస్థలోని అస్థిరత వల్ల విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందన్నారు. దీనిపై ఒకరు స్పష్టమైన వివరణ కోరగా.. కంపెనీలో తయారీ నెమ్మదించినట్లు మాటమార్చారు. అంతకుముందు జూన్‌లో.. ఆర్థిక వ్యవస్థపై తాను చాలా నిరాశతో ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కంపెనీలో దాదాపు 10 శాతం వరకు ఉద్యోగాల కోత ఉండొచ్చని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెస్లా షేర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు 9 శాతం పడిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని