భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు.. లైసెన్స్ ఇస్తే చాలని మస్క్.. వేలానికే అంబానీ మొగ్గు!

భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్పెక్ట్రమ్‌, ఎయిర్‌వేవ్‌లకు లైసెన్స్ ఇవ్వాలని స్టార్‌లింక్‌ (Starlink) కోరుతోంది. కానీ, ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ సంస్థ మాత్రం భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందించే విదేశీ సంస్థలకు ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించాలని కోరుతుంది.  

Updated : 25 Jun 2023 20:14 IST

దిల్లీ: అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అనంతరం వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్టార్‌లింక్‌ (Starlink) సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. స్టార్‌లింక్‌తో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తేవచ్చని ఈ సందర్భంగా మస్క్ అభిప్రాయపడ్డారు. రెండేళ్ల క్రితమే శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను భారత్‌లో ప్రారంభించేందుకు స్టార్‌లింక్‌ ప్రయత్నించినప్పటికీ.. వివిధ కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. 

భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్పెక్ట్రమ్‌, ఎయిర్‌వేవ్‌లకు లైసెన్స్ ఇవ్వాలని స్టార్‌లింక్‌ కోరుతోంది. ఇదే పద్ధతిని టాటా, భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌, అమెజాన్ క్యూపర్‌ సంస్థలు కోరుకుంటున్నాయి.  ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ సంస్థ మాత్రం భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను అందించే విదేశీ సంస్థలకు ప్రభుత్వం వేలం నిర్వహించాలని కోరుతుంది.  

భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత సేవలకు సంబంధించి స్పెక్ట్రమ్‌ వేలంపై నిర్ణయమే కీలకమని టెలికాం రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొబైల్‌ స్పెక్ట్రమ్‌ వేలం తరహాలో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవల కోసం ఉపయోగించే ఎల్‌ బ్యాండ్, ఎస్‌ బ్యాండ్‌ల వేలం నిర్వహించాలని రిలయన్స్ జియో, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు కోరుతున్నాయి.  దేశీయ సంస్థలైన టాటా, భారతీ ఎయిర్‌టెల్‌ వన్‌వెబ్‌, ఎల్‌అండ్‌టీతో పాటు విదేశీ సంస్థలైన స్టార్‌లింక్‌, అమెజాన్‌ క్యూపర్‌ వంటివి మాత్రం వేలం వద్దంటున్నాయి. దేశంలోకి విదేశీ సంస్థల పెట్టుబడులు రాబట్టాలంటే వేలం నిర్వహించడమే సరైన నిర్ణయమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు టెలికాం విభాగంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు జాతీయ వార్తా సంస్థ తెలిపింది. దానివల్ల ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌పై కొంత వరకు నియంత్రణ లభిస్తుందని కేంద్రం భావిస్తోందని సదరు అధికారి వెల్లడించారు.  

భారత్‌లో వన్‌వెబ్‌ ఇండియా, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌లకు టెలికాం విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మాత్రం ఇంకా రూపొందించలేదు. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థలు సైతం భారత్‌లో తమ సర్వీస్‌లను ప్రారంభించాలని భావిస్తున్నాయి. ఆయా సంస్థలు వేలానికి బదులు లైసెన్స్‌లు జారీ చేయాలని కోరుతున్నాయి. మరి, దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. 2030 నాటికి భారత్‌లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్ సేవల మార్కెట్‌ విలువ 36 శాతం మేర పెరిగి 1.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని డెలాయిట్‌ సంస్థ అంచనా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని