Vacation: మీ విహార యాత్రలో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి?

ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఎక్కువ ఖర్చవుతుంది. ఈ ఖర్చుల్లో కొంత ఆదా చేయడానికి ఉన్న మార్గాలేంటో ఇక్కడ చూద్దాం..

Published : 12 Feb 2024 22:42 IST

పిల్లలకు పరీక్షల సీజన్‌ ముగియగానే చాలా కుటుంబాలు సెలవుల్ని ఎంజాయ్‌ చేయడానికి విహార యాత్రలకు వెళ్ళడానికి చూస్తుంటారు. కుటుంబం/స్నేహితులతో సెలవుల్ని ప్లాన్‌ చేసుకోవడం ఒక ఉత్తేజకరమైన మార్గం. సెలవులను ప్లాన్‌ చేయడంలో మొదటి అడుగు వాస్తవిక బడ్జెట్‌ను ఏర్పాటు చేసుకోవడం. కొంతమంది తమ బడ్జెట్‌ను త్వరగా సిద్ధం చేసుకుని విహార యాత్ర ప్రణాళికను తెలివిగా అమలు చేస్తారు. వీరి బడ్జెట్‌ తక్కువలో అయిపోతుంది. మరికొందరు తమ ప్రయాణాల కోసం చివరి నిమిషంలో బుక్‌ చేసుకుంటారు. వీరికి ఖర్చు ఎక్కువే అవుతుంది. హాలిడే ట్రిప్‌లో బాధ్యతాయుతంగా ఖర్చు చేయడంలో మీకు సహాయపడేందుకు ఇక్కడ దశల వారీ గైడ్‌ ఉంది.

ప్రయాణానికి డబ్బు ఆదా..

హాలిడే ట్రిప్‌కు ముందుగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రయాణంలో రవాణా, వసతి, ఆహారం, ప్రయాణ బీమా, వీసా, షాపింగ్‌, ఇతర కార్యకలపాలతో కూడిన అనేక ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఈ ఖర్చులన్నింటినీ సమర్థంగా చేపట్టేందుకు, సరిపడా డబ్బు ఆదా చేయడం ముఖ్యం. పర్యటన కోసం డబ్బు ఆదా చేయడానికి ప్రత్యేక సేవింగ్స్‌ ఖాతాను తెరవండి. పొదుపు ఖాతాను ఎంచుకున్నప్పుడు మెరుగైన వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకును చూసుకుని, రుసుములు లేని ఖాతా కోసం చూడండి. కనీసం ఒక ఏడాది ముందు నుంచి చేసిన ప్రతి పొదుపును ఈ ఖాతాలో జమచేయాలి. మీరు ప్రతి నెలా మీ ఆదాయంలో కొంత భాగాన్ని స్థిరంగా ఆదా చేసేలా చూసుకోవాలి. ఈ ప్రత్యేక పొదుపు ఖాతా ద్వారా వెకేషన్‌ ఫండ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ పొదుపును ఇతర విషయాలకు ఖర్చుచేయకుండా నిరోధించవచ్చు.

ఆఫ్‌-సీజన్‌లో ప్రయాణాలు

ప్రయాణాల సీజన్‌ ప్రాంతాన్ని/దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. విదేశాలలో కూడా ప్రయాణాలకు ఆఫ్‌ సీజన్‌ ఉంటుంది. ఈ ఆఫ్‌ సీజన్‌లో విమానాలు, వసతి, ఇతర కార్యకలాపాల ధరలు పీక్‌ సీజన్‌లో కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. ఆఫ్‌-సీజన్‌లో సందర్శకులను ఆకర్షించడానికి.. టూర్‌ ఆపరేటర్లు తప్పక ప్రయత్నిస్తారు. హోటళ్లలో డిస్కౌంట్‌ ఆఫర్లు కూడా ఉంటాయి. విమానయాన సంస్థలు తక్కువ విమాన ఛార్జీలను ఆఫర్ చేయొచ్చు. విమాన టికెట్లను వారాంతంలో కాకుండా మధ్య రోజుల్లో బుక్‌ చేసుకుంటే ఛార్జీ తగ్గుతుంది. తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి విమానాల కంటే పగలు విమానాల ప్రయాణ ఖర్చులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు సందర్శకులను ప్రోత్సహించడానికి ఆఫ్‌-సీజన్‌లో మ్యూజియంలు, గ్యాలరీలు, గార్డెన్స్‌కు తగ్గింపు లేదా ఉచిత ప్రవేశాన్ని అందిస్తాయి.

ప్రయాణంలో డబ్బు ఆదా

మామూలు రోజులతో పోలిస్తే ప్రయాణ సమయంలో అన్ని కార్యకలాపాలకు అధికంగా ఖర్చువుతుంది. ఇందులో ఖర్చులను సరిగ్గా ప్లాన్‌ చేయడం వల్ల ప్రయాణ ఖర్చులు మొత్తం అదుపులో ఉంటాయి. మీ సామాను ఉంచడానికి, నిద్రించడానికి మాత్రమే గది అవసరమైతే, లగ్జరీ హోటళ్లకు బదులుగా హాస్టల్స్‌, గెస్ట్‌హౌస్‌లు, సర్వీస్‌ అపార్ట్‌మెంట్స్‌ వంటి బడ్జెట్‌కు అనుకూలించే వసతిని ఎంచుకోవచ్చు. ముందుగానే వసతిని బుక్‌ చేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది.

క్రెడిట్‌ కార్డ్ డిస్కౌంట్స్‌

క్రెడిట్స్‌ కార్డులతో ఆన్‌లైన్‌లో విమానాలు, వసతి, ఇతర ప్రయాణ సంబంధిత ఖర్చులను బుక్‌ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. క్రెడిట్‌ కార్డ్స్‌ ఇచ్చే ఆఫర్స్‌, డిస్కౌంట్‌ల వల్ల ప్రయాణంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీ వద్ద ట్రావెల్‌ రివార్డ్స్‌/మైల్స్‌ అందించే క్రెడిట్‌ కార్డులుంటే వాటిని తెలివిగా ఉపయోగించండి. సేకరించిన ఈ పాయింట్స్‌ మీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించగలవు. డిస్కౌంట్‌/ఉచిత ప్రయాణం కోసం మీ క్రెడిట్‌ కార్డ్‌లో పాయింట్లు/మైల్స్‌ను రీడీమ్‌ చేసుకోవచ్చు. ప్రయాణ ఖర్చులను ఆఫ్‌సెట్‌ చేయడానికి మీ క్రెడిట్‌ కార్డులోని క్యాష్‌బ్యాక్‌/రివార్డ్‌లను ఉపయోగించండి. విమానాలు, హోటళ్లు, అద్దె కార్లు, పర్యటనలపై ఆఫర్ల కోసం క్రెడిట్‌ కార్డులపై ప్రయాణ సంబంధిత తగ్గింపుల ప్రయోజనాన్ని పొందొచ్చు. విదేశాల్లో సర్వీసెస్‌కు చెల్లింపులు చేసేటప్పుడు విదేశీ లావాదేవీల రుసుం లేకుండా ఉండే క్రెడిట్‌ కార్డులను ఉపయోగించండి. క్రెడిట్‌ కార్డులు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ వంటి ప్రయోజనాలను అందిస్తాయి.

ఆహార ఖర్చులు

మీ ప్రయాణంలో ఆహార ఖర్చులను నియంత్రించడం ద్వారా డబ్బును చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు, అంతర్జాతీయ వంటకాలతో పోలిస్తే స్థానిక వంటకాలు చాలా చౌకగా ఉంటాయి. వీటి కోసం స్థానిక ఫుడ్‌ స్టాల్స్‌/స్థానికులు తినే చిన్న రెస్టారెంట్ల కోసం అన్వేషించండి. సాధారణంగా ఇవి ప్రతి చోట అనేక సెంటర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రయాణాల్లో ఎనర్జీ లిక్విడ్స్‌, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, (నిల్వ ఉండే)స్నాక్స్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది.

ప్రజా రవాణా/కరెన్సీ ఎక్స్చేంజ్‌

సొంతంగా టాక్సీలు అద్దెకు తీసుకోవడం కన్నా ప్రజా రవాణా చాలా చౌకగా ఉంటుంది. విదేశాల్లో కూడా కొన్ని రోజులకు అపరిమిత ప్రయాణానికి తగ్గింపు రేట్లతో పాసులు లభిస్తాయి, వీటిని ఉపయోగించుకోవడం మేలు. ప్రజా రవాణా ఉపయోగించుకోవడం వల్ల ప్రయాణ భద్రత ఉంటుంది. విదేశాల్లో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా అక్కడ మారకంలో ఉండే కరెన్సీనే ఉపయోగించాలి. అందుచేత ప్రయాణానికి బయలుదేరే ముందే మీ స్థానిక బ్యాంకులో కరెన్సీని మార్చుకోవడం చౌకగా ఉండొచ్చు.

ప్రయాణ బీమా/ఉచిత వైఫై

ప్రయాణంలో అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది బీమా. ఇది ప్రయాణంలో జరిగే అనేక నష్టాలకు పరిహారాన్ని అందిస్తుంది. ప్రయాణికులు ఆర్థిక నష్టాలకు గురవ్వకుండా ఇది కాపాడుతుంది. సాధారణంగా, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌.. వైద్య ఖర్చులు, ట్రిప్‌ క్యాన్సిలేషన్స్‌, పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సామాన్ల విషయంలో కవరేజీ అందిస్తుంది. కుటుంబ అత్యవసర/ఊహించని పరిస్థితుల కారణంగా మీ ట్రిప్‌ను రద్దు చేయవలసి వస్తే..ప్రయాణ బీమా రద్దు రుసుము, ఖర్చులను కవర్‌ చేస్తుంది. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు మీ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ డేటా ఇవ్వకపోతే, స్థానిక సిమ్‌ను కొనుగోలు చేయండి. జపాన్‌ టూరిస్టులకు ఉచిత పోర్టబుల్‌ వైఫై అందిస్తుంది. చాలా దేశాలు సొంత రైడ్‌-షేరింగ్‌ యాప్‌లను కలిగి ఉంటున్నాయి. మీకు ట్యాక్సీ అవసరమైతే అక్కడ యాప్‌ను ఉపయోగించి సేవలను పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని