Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 83 పాయింట్ల లాభంతో 62,929 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 29 పాయింట్ల లాభంతో 18,627 దగ్గర కొనసాగుతోంది.

Updated : 30 May 2023 09:37 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అయితే, ఆరంభంలో లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే లాభాల్లోకి ఎగబాకాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 83 పాయింట్ల లాభంతో 62,929 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 29 పాయింట్ల లాభంతో 18,627 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు పుంజుకొని 82.68 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, టైటన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. ప్రస్తుతం యూఎస్‌ ఫ్యూచర్‌ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు మాత్రం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా అప్పుల పరిమితి పెంపుపై బుధవారం ఓటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో బిల్లు గట్టెక్కడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు దేశీయంగా చూస్తే పలు మార్గదర్శకాలను జారీ చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్ని బ్యాంకులు కార్పొరేట్‌ పాలనాపరంగా బలహీనంగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ హెచ్చరించారు. ఈ ధోరణి మారకపోతే.. బ్యాంకింగ్‌ రంగం ఊగిసలాటకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర స్వల్పంగా పెరిగి 77.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం రూ.1,758.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు సైతం రూ.853.57 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

గమనించాల్సిన స్టాక్స్‌..

నాట్కో ఫార్మా: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.926.9 కోట్ల ఆదాయాన్ని, రూ.275.8 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాలంలో రూ.610.6 కోట్ల ఆదాయంపై రూ.50.5 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రా: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు నష్టాలు పెరిగాయి. ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికంలో రూ.1,895 కోట్ల స్థూల ఆదాయంపై రూ.637 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22 ఇదే కాలంలో ఆదాయం రూ.1,284 కోట్లు, నికర నష్టం రూ.129 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయంతో పాటు నష్టాలు కూడా పెరిగాయి.

ఓఎన్‌జీసీ: ప్రభుత్వరంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ తన హరిత ఇంధన ప్రాజెక్టులపై 2030 నాటికి రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2038 కల్లా సున్నా కర్బన స్థాయికి చేరాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు