Insurance: బీమా పాలసీదారులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

బీమా పాలసీ తీసుకునే వారు కొన్ని విషయాలను విస్మరిస్తుంటారు. పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Published : 09 Nov 2023 17:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన ఆర్థిక ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన అంశాల్లో బీమా కూడా ఒకటి. చాలా మంది బీమా తీసుకునే సమయంలో ఏజెంట్లు, ఆఫీస్‌ సిబ్బంది చెప్పింది వింటారే తప్ప బీమా పత్రాలను పూర్తిగా చదవరు. ఈ పత్రాలు సంక్లిష్టమైన పదజాలంతో, చట్టపరమైన అంశాలతో నిండి ఉంటాయి కాబట్టి చదవడం, అర్థం చేసుకోవడం కష్టమే. అయినప్పటికీ పాలసీదారులు వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేదా ఇలాంటి విషయాలపై అనుభవం ఉన్నవారి వద్ద సందేహాలను నివృత్తి చేసుకోవాలి. అంతే తప్ప బీమా పత్రాలపై నిర్లక్ష్యం మంచిది కాదు. ఆ పత్రాల్లో ఉండే కీలక సమాచారాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల భవిష్యత్‌లో క్లెయిం తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది.

వ్యక్తిగత సమాచారం

మీరు అందించిన వ్యక్తిగత సమాచారంపై పాలసీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ పాలసీ డాక్యుమెంట్‌లోని వ్యక్తిగత సమాచారం అంతా కచ్చితంగా ఉందని మీరు నిర్ధారించుకోవాలి. ఇందులో మీ పేరు, చిరునామా, వయసు, విద్య, ఉద్యోగ వివరాలు, వైద్య చరిత్ర మొదలైనవి ఉంటాయి. మీ వివరాలలో ఏదైనా మార్పు జరిగితే దాన్ని కూడా బీమా సంస్థకు తెలియజేయాలి. వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉండకూడదు. అలా చేస్తే, క్లెయిం సందర్భంలో బీమా సంస్థ తిరస్కరించే అవకాశముంది. 

పాలసీ షెడ్యూల్‌

బీమా పత్రంలో పాలసీ షెడ్యూల్‌ను తప్పక తనిఖీ చేయాలి. ఇందులో నామినీ వివరాలు ఉంటాయి. మీరు ప్రీమియంగా చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపుల వ్యవధి (నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక పద్ధతిలో) ఉంటాయి. ఇంకా హామీ మొత్తం, అంటే పాలసీదారుడు మరణించిన సందర్భంలో చెల్లించాల్సిన మొత్తం కూడా ఉంటుంది. పాలసీ ప్రారంభ తేదీ, మెచ్యూరిటీ తేదీ ఉంటాయి. తప్పులు, మార్పులు ఉంటే నిర్ణీత ఫ్రీ-లుక్‌ వ్యవధి (30 రోజుల)లోపు బీమా కంపెనీకి తెలియజేసి సరి చేయించాలి. ఫిర్యాదులకు సంబంధించి బీమా అంబుడ్స్‌మన్‌ చిరునామా కూడా డాక్యుమెంట్‌లో ఉంటుంది. 

బీమా ఒప్పందం

జీవిత, ఆరోగ్య బీమాలో ముఖ్యమైనది పాలసీ డాక్యుమెంట్‌. ఇది పాలసీదారుడికి, బీమా కంపెనీ మధ్య ఒప్పందానికి నిదర్శనం. పాలనీ పత్రాన్ని పాలసీదారు పోగొట్టుకున్నట్లయితే అది బీమా ఒప్పందాన్ని ప్రభావితం చేయదు. ఒప్పందంలో ఎలాంటి మార్పులు చేయకుండానే పాలసీదారుడి అభ్యర్థన మేరకు బీమా కంపెనీ డూప్లికేట్‌ పాలసీ పత్రాన్ని జారీ చేస్తుంది. కంపెనీ మొదటి ప్రీమియం రశీదును జారీ చేసినప్పుడు బీమా పాలసీ యాక్టివ్‌గా మారుతుంది.

వెయిటింగ్‌ పీరియడ్‌

ఆరోగ్య బీమాకు సంబంధించి కొన్ని వ్యాధులకు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. ఇది బీమా సంస్థను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడే ముందస్తు వ్యాధుల కవరేజీ కోసం ఎంత కాలం వేచి ఉండాలి అనేది తెలుసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న బీమా పాలసీని తీసుకోవడం మేలు. ఆరోగ్య బీమా తీసుకునేవారు వెయిటింగ్‌ పీరియడ్‌ గురించి తప్పక తెలుసుకోవాలి.

క్లెయిం క్లాజులు

జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు మొదటి రెండు సంవత్సరాల వ్యవధిలో క్లెయిం క్లాజులను పరిశీలించాలి. ఇవి కాస్త కఠినంగా ఉంటాయి. బీమా తీసుకునేటప్పుడు తప్పుగా వివరాలను పేర్కొనడం వల్ల బీమా సంస్థలు ఈ వ్యవధిలో చేసిన క్లెయింలను తిరస్కరించవచ్చు. అయితే, 1938 బీమా చట్టం (సెక్షన్‌ 45) ప్రకారం పాలసీ తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉండదు.

పాలసీ ల్యాప్స్‌

ఒకవేళ మీ జీవిత బీమా పాలసీ ప్రీమియం గ్రేస్‌ పీరియడ్‌లోపు చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్‌(రద్దు) అవుతుంది. బీమా కంపెనీలు లాప్స్‌ అయిన పాలసీని పునరుద్ధరించడానికి పాలసీదారులకు 2 ఏళ్ల వ్యవధిని అందిస్తున్నాయి. కొన్ని సమయాల్లో ఈ వ్యవధిని తగ్గించవచ్చు. అందువల్ల మీ పాలసీని ఎలా? ఎప్పుడూ పునరుద్ధరించవచ్చో తనిఖీ చేయడానికి మీ ఆఫర్‌ డాక్యుమెంట్‌ను జాగ్రత్తగా చదవండి.

చివరిగా: పాలసీని కొనుగోలు చేయడం, స్వీకరించడం ద్వారా బాధ్యత ముగిసిందని అనుకోకూడదు. ఏ రకమైన బీమా పాలసీ డాక్యుమెంట్‌నైనా పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని