Jio AirFiber: జియో ప్రకటించిన ఎయిర్‌ఫైబర్‌ ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

Jio AirFiber: జియో ఎయిర్‌ఫైబర్‌ను (Jio AirFiber) తీసుకొస్తున్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది. ఇంతకీ ఏమిటీ ఎయిర్‌ఫైబర్‌? ఎలా పనిచేస్తుంది?

Published : 30 Aug 2022 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన జియో.. ఇప్పటికే జియో గిగా ఫైబర్‌ పేరిట బ్రాండ్‌బ్యాండ్ సేవలనూ అందిస్తోంది. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ సేవలను మరింత విస్తరించే ఉద్దేశంతో కొత్తగా జియో ఎయిర్‌ఫైబర్‌ను (Jio AirFiber) తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్‌ 45వ ఏజీఎంలో దీని గురించి ప్రకటన చేసింది. ఇంతకీ ఏమిటీ ఎయిర్‌ఫైబర్‌? ఎలా పనిచేస్తుంది?

దేశంలో జియో ఫైబర్‌ సేవలు 2019లో అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 11 లక్షల కి.మీ. మేర ఫైబర్‌ నెట్‌వర్క్‌ నిర్మించినట్లు ముకేశ్‌ అంబానీ తెలిపారు. అయితే, ఇప్పటికే ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్స్‌ వేయని చోట జియో ఫైబర్‌ సేవలు అందడం లేదు. దీంతో కొత్తగా కేబుల్స్‌తో సంబంధం లేని ఎయిర్‌ఫైబర్‌ సేవలను ప్రారంభించబోతున్నట్లు జియో ప్రకటించింది.

ఎలా పనిచేస్తుంది..?

సాధారణంగా బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు ఫైబర్‌ ఆప్టికల్‌ కేబుల్‌ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జియో గిగా ఫైబర్‌ ఈ తరహాలోనే పనిచేస్తోంది. జియో ఎయిర్‌ఫైబర్‌ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్‌ డివైజ్‌. దగ్గర్లోని జియో టవర్స్‌ నుంచి వీటికి సిగ్నల్స్‌ అందుతాయి. దీని ద్వారా సాధారణ బ్రాడ్‌బ్యాండ్‌ తరహాలోనే వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఆనందించొచ్చని జియో చెబుతోంది. ఈ డివైజ్‌ను ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా వాడుకోవచ్చు. జియోఎయిర్‌ఫైబర్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లకు మల్టిపుల్‌ వీడియో స్ట్రీమ్స్‌ను పొందొచ్చు. ఒకేసారి పలు కెమెరా కోణాల్లో అల్ట్రాహై డెఫినిషన్‌తో చూడొచ్చని జియో చెబుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ తర్వాత..

ఎయిర్‌ఫైబర్‌ సేవలను ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్రాండ్‌బ్యాండ్‌ సేవలను అందించాలన్న ఉద్దేశంతో 2020లో దీన్ని ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ తర్వాత ఎయిర్‌ఫైబర్‌ సేవలను అందిస్తున్న రెండో సంస్థగా జియో నిలవనుంది. ఇప్పటికే టెలికాం, బ్రాండ్‌బ్యాండ్‌ విభాగంలో దూసుకెళుతున్న జియో.. ఎయిర్‌ఫైబర్‌ రూపంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు మరోసారి సవాల్‌ విసరబోతోంది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో భారత్‌ 138వ స్థానంలో ఉండగా.. దాన్ని టాప్‌-10లోకి జియో తీసుకెళ్లగలదని ముకేశ్‌ అంబానీ ఏజీఎంలో విశ్వాసం వ్యక్తంచేశారు. దీనిబట్టి  జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలను భారీగా విస్తరించాలని ఆ కంపెనీ భావిస్తోంది. సేవల అందుబాటు, ఫైబర్‌ ప్లాన్ల వివరాలు దీపావళి నాటికి తెలిసే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని