WhatsApp: సెప్టెంబరులో 71 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం

భారత ఐటీ నిబంధనల ప్రకారం సెప్టెంబరు నెలలో 71 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ తెలిపింది. 

Published : 02 Nov 2023 19:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్‌ నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు ఆధారంగా సెప్టెంబరు నెలలో భారత్‌లోని 71.1 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) తెలిపింది. భారత ఐటీ నిబంధనలను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ తొలగించిన వాటిలో 25.7 లక్షల ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, ఆయా ఖాతాల డేటాను విశ్లేషించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు వాట్సాప్‌ నెలవారీ నివేదికను విడుదల చేసింది.

మరోవైపు సెప్టెంబరులో యూజర్ల నుంచి 10,442 ఫిర్యాదులు వచ్చాయని వాట్సాప్‌ తెలిపింది. వీటిలో స్పామ్‌ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఖాతాలపై నిషేధం, ప్రొడక్ట్‌ సపోర్ట్‌ వంటివి ఉన్నాయి. యూజర్లు ఫిర్యాదులు చేసిన ఖాతాలపై యూజర్‌ సేఫ్టీ రిపోర్టు ఆధారంగా వాట్సాప్‌లోని కృత్రిమమేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ..అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించి తొలగించినట్లు నివేదికలో పేర్కొంది. భారతీయ ఖాతాలుగా చెలామణీ అవుతూ.. +91 కోడ్‌లేని ఖాతాలపై కూడా నిషేధం విధించినట్లు తెలిపింది. 

మీ వద్ద ఇంకా ₹2 వేల నోట్లున్నాయా.. ఈ రెండు మార్గాల్లో మార్చుకోండి..

యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. భారత ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ నెలవారీ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడంతోపాటు యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపరచాలి. ఇందులో భాగంగానే వాట్సాప్‌ తాజా నివేదికను రూపొందించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని