Rishi Sunak: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

Rishi Sunak: జీ20 శిఖరాగ్ర సదస్సుకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఆయన తన కేబినెట్‌లో కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated : 06 Sep 2023 11:09 IST

లండన్‌: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free trade agreement- FTA)పై బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు మేలు చేసేదైతేనే ఒప్పందానికి అంగీకరిస్తామని మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో తెలిపారు. భారత్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు సునాక్‌ రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని హోదాలో ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

వాణిజ్య ఒప్పందం (FTA)పై భారత్‌తో చర్చలు కొనసాగుతున్నాయని కేబినెట్‌కు సునాక్‌ వివరించారు. ఇప్పటికే 12 దఫాలు చర్చలు జరిగినట్లు తెలిపారు. బ్రిటన్‌కు భారత్‌ విడదీయలేని భాగస్వామి అని అన్నారు. ఆర్థిక సవాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు భారత్‌ పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌తో అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, యావత్‌ యూకేకు మేలు చేసే వాణిజ్య ఒప్పందానికి మాత్రమే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

జీ-20 సదస్సుకు.. వచ్చేదెవరు? రానిదెవరు?

యూకే బిజినెస్‌, ట్రేడ్‌ సెక్రటరీ కెమీ బడెనోచ్‌ ఇటీవలే భారత పర్యటన ముగించుకొని బ్రిటన్‌కు వెళ్లారు. ఇక్కడ ఆమె భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చలు జరిపారు. వాటి విశేషాలను ఆమె తాజాగా సునాక్‌ (Rishi Sunak) సమక్షంలో అక్కడి కేబినెట్‌కు వివరించారు. భారత్‌ ఇప్పటికే బ్రిటన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఏటా 36 బిలియన్‌ జీబీపీలు విలువ చేసే వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

భారత్‌తో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగంలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సునాక్‌ (Rishi Sunak) అభిప్రాయపడ్డారు. ఇది రానున్న దశాబ్దాల్లో బ్రిటన్‌ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. భారత పర్యటనలో సునాక్‌ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, భారత్‌లో ఆయన పర్యటన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. దిల్లీలోని హుమాయూన్‌ స్మారకాన్ని ఆయన తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి సందర్శించే అవకాశం ఉన్నట్లు బ్రిటన్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని