logo

ఇదేం పద్ధతి!

అధికారో, ఉద్యోగో, కిందిస్థాయి సిబ్బందో.. స్థాయి, హోదా ఏదైనా కావొచ్చు. ఏదైనా కార్యాలయంలో ఎవరిపైౖనా అయినా అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేస్తాం. వారితో కాస్త ప్రత్యేకంగా వ్యవహరిస్తాం.

Published : 15 Apr 2024 04:35 IST

 వద్దన్నా.. బాధ్యతలు

 నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే:  అధికారో, ఉద్యోగో, కిందిస్థాయి సిబ్బందో.. స్థాయి, హోదా ఏదైనా కావొచ్చు. ఏదైనా కార్యాలయంలో ఎవరిపైౖనా అయినా అవినీతి ఆరోపణలు వస్తే ఏం చేస్తాం. వారితో కాస్త ప్రత్యేకంగా వ్యవహరిస్తాం. వీలైనంత వరకు వారిని కార్యాలయ బాధ్యతలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప అదంతా మనకెందుకులే అనుకొని అలక్ష్యంగా వ్యవహరించం కదా. కానీ, కొందరు అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లిప్త ధోరణి అవలంబిస్తున్నారు. ఎవరు అడుగుతారులే, ఏం చేస్తారులే అనే వైఖరి కనబరుస్తున్నారు. ముఖ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అనిశాకు చిక్కిన వారిని తిరిగి అదేతరహా బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని ప్రజాసంబంధ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని నిబంధనలున్నా, అవేవీ పట్టించుకోకుండా పనితీరును అపహాస్యం చేస్తున్నారు.

అనిశాకు పట్టుబడినా..

ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా మామూలు ప్రజానీకాన్ని లంచం కోసం ఇబ్బంది పెట్టినా, పని చేయకుండా సతాయించినా, అక్రమార్జనను ప్రోత్సహించినా అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. సదరు ఉద్యోగి పనితీరుపై ఆరాతీసి, తదనుగుణంగా వారిపై నిఘా ఏర్పాటుచేస్తారు. లంచం తీసుకునే సమయంలో నేరుగా పట్టుకుంటారు. కేసులు నమోదుచేస్తుంటారు. ఇలా పట్టుబడిన వారిలో అధికారులున్నా, కిందిస్థాయి ఉద్యోగులు ఉన్నా.. వారిని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తారు. ఇది కొద్దిరోజుల వరకే. కేసు విచారణ కొనసాగుతున్నా సదరు ఉద్యోగులు తమ ప్రయత్నాలతో తిరిగి ఉద్యోగాల్లో చేరుతుంటారు. విచారణ, శిక్షలు అనే విషయం కాసేపు పక్కనపెడితే.. ఇలా అనిశాకు చిక్కిన వారిని ఆ కేసులు పూర్తయ్యే వరకు ప్రజాసంబంధమైన విధులకు దూరంగా ఉంచాలి. అదే క్యాడర్‌లో ఇతర బాధ్యతలు అప్పగించాలనే నిబంధన ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో ఇది పక్కాగా అమలుకావడం లేదు. ఉన్నతస్థాయి అధికారులు సైతం ఈ విషయంలో పెద్దగా అభ్యంతరపెట్టిన ఘటన లేకపోవడంతో వివిధ సందర్భాల్లో పట్టుబడిన వారు సైతం ఎప్పటిలాగే ప్రజాసంబంధమైన కార్యకలాపాల్లో భాగమవుతున్నారు. విధులను కొనసాగిస్తున్నారు.

అక్రమాలకు ఊతమిచ్చేలా..

ఏ శాఖలోనైనా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో కేసులు నమోదైన వ్యక్తులను కొద్దిరోజుల అనంతరం మళ్లీ అదే స్థానంలో నియమించడం, లేక ప్రజలతో సంబంధం ఉండే బాధ్యతలు అప్పగించడం ఎంతమాత్రమూ సమంజసం కాదు. దీనివల్ల అవినీతికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్‌, సబ్‌రిజిస్ట్రార్‌ వంటి ప్రజాసంబంధ శాఖల్లో ఈ తరహా వైఖరి ఆక్షేపణీయం. జిల్లా పరిధిలో చోటుచేసుకున్న పలు సంఘటనలు పరిశీలిస్తే.. శాఖతో సంబంధం లేదు, ఆరోపణలతో అవసరం లేదు, పైరవీలు- ఒత్తిళ్లు ఉంటే ఎప్పటిలా ఉద్యోగంలో కొనసాగొచ్చనే భావన కలుగుతోంది.

  •  నిర్మల్‌ బల్దియా పరిధిలో ఇప్పటికే అసెస్‌మెంట్‌ విషయంలో ఆరోపణలు ఎక్కువ. ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోయినా, ఖాళీస్థలం ఉన్నా గుడ్డిగా ఇంటినంబర్లు కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటివి అరికట్టి కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన మున్సిపల్‌ రెవెన్యూ విభాగంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే వాదనలకు బలం చేకూర్చేలా కొద్దిరోజుల క్రితం ఓ అధికారి, కిందిస్థాయి ఉద్యోగి ఇద్దరూ అనిశా వలలో చిక్కిన విషయం తెలిసిందే. అయితే.. సదరు అధికారి సస్పెన్షన్‌లో ఉండటంతో ఆయన స్థానంలో కొత్తగా మరొకరిని నియమించారు. ఇలా నియమితులైన వ్యక్తి సైతం కొద్దిరోజుల క్రితం అనిశా దాడిలో చిక్కిన వారే కావడం గమనార్హం. కేవలం పనిచేసే ప్రాంతం మార్చి మళ్లీ అదే తరహా బాధ్యతలు అప్పగించడం అధికారుల పనితీరుకు అద్దంపడుతోంది.
  •  జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి గతంలో అనిశాకు చిక్కారు. ఆ తర్వాత కొద్దినెలల అనంతరం అతడిని మళ్లీ అదే కేడర్‌ అధికారిగా, అదీ ఈ జిల్లాలోనే నియమించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
  •  జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పనిచేసే సమయంలో గతంలో అనిశాకు పట్టుబడ్డారు. అయినా, అదేం పెద్ద విషయం కాదు, అంతా సర్వసాధారణమే అన్నట్లుగా మళ్లీ అదే శాఖలో ఎప్పటిలా విధులను కొనసాగిస్తుండటం గమనార్హం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని