logo

నల్లా నీరు..శివారుకు పరుగు

నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కీలకమైన జీవో 111 ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో త్వరలో కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. మరోవైపు అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఐటీ పార్కులు ఇతర ప్రైవేటు సంస్థలు రానున్నాయి.

Published : 12 May 2022 03:51 IST

డిసెంబరు నాటికి అందుబాటులోకి ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2

శరవేగంగా జరుగుతున్న రిజర్వాయరు పనులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరం శరవేగంగా విస్తరిస్తోంది. కీలకమైన జీవో 111 ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో త్వరలో కొత్త ప్రాజెక్టులు రానున్నాయి. మరోవైపు అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ కొత్త కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఐటీ పార్కులు ఇతర ప్రైవేటు సంస్థలు రానున్నాయి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పెద్ద సవాలుగా మారనుంది. ఈ నేపథ్యంలో జలమండలి రూ.1200 కోట్లతో అవుటర్‌ రింగ్‌రోడ్డు ఫేజ్‌-2 పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇవి శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్ణీత గడువుకు 3 నెలల ముందే దీనిని అందుబాటులోకి తెచ్చేలా పనులు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆయా ప్రాంతాల్లో తాగునీటిని అందించనున్నారు. ఇప్పటికే 118 కాలనీల్లో పైపులైన్‌ పనులు పూర్తి కావడంతో ఇతర ప్రాంతాల రిజర్వాయర్లకు అనుసంధానం చేసి తాగునీటిని అందిస్తున్నారు. జలమండలి ఎండీ దానకిశోర్‌ ఆదేశాల మేరకు బుధవారం ఈ పనుల గురించి అధికారులు క్షేత్రస్థాయిలో మీడియాకు వివరించారు. వచ్చే 20 ఏళ్లలో నగరంలో తాగునీటి డిమాండ్‌ రెట్టింపు కానుంది. ముఖ్యంగా శివార్లలోని అవుటర్‌ చుట్టూ ముందే తాగునీటి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, అనుసంధానించడం కీలకమని జలమండలి భావిస్తోంది.

ప్రాజెక్టులో కీలకాంశాలు
*   2036 నాటికి ఓఆర్‌ఆర్‌ చుట్టూ కొత్త ప్రాంతాల్లో 33.92 లక్షలకు జనాభా పెరగనుంది. అప్పటి అవసరాలకు తగినట్లు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
* చాలా రిజర్వాయర్ల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నార్సింగి, పుప్పాలగూడ తదితర చోట్ల స్లాబు మట్టానికి చేరుకున్నాయి.
* ఈ రిజర్వాయర్లకు అనుసంధానంగా ఇన్‌లెట్లు, అవుట్‌లెట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పైపులైన్‌ పనులు పూర్తి అయిన 118 కాలనీల్లో బీపీఎల్‌ కుటుంబాలకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ అందిస్తున్నారు.  
* అవుటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో ప్రజలకు సరిపడా నీటి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం 3-5 రోజులకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుతో రోజు విడిచి రోజు నీరు అందించవచ్చు. నల్లాలేని కాలనీలకు కొత్త నల్లాలు అందించనున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని