logo

ముందుకెళ్లాలంటే.. ముచ్చెమటలే!

నగరం నలువైపుల పెరిగిన ట్రాఫిక్‌ వాహనదారులకు నరకం చూపుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ ప్రధాన మార్గాల్లో నిత్యం రద్దీ వాతావరణం దర్శనమిస్తోంది.

Published : 30 Jun 2022 02:28 IST

ప్రధాన మార్గాల్లో అడ్డంకులను పట్టించుకోని యంత్రాంగం

మరమ్మతులు శూన్యం.. తప్పని ట్రాఫిక్‌ నరకం

 

నగరం నలువైపుల పెరిగిన ట్రాఫిక్‌ వాహనదారులకు నరకం చూపుతోంది. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటేంత వరకూ ప్రధాన మార్గాల్లో నిత్యం రద్దీ వాతావరణం దర్శనమిస్తోంది. కరోనా అనంతరం ఈ ఏడాది సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఐటీ కంపెనీలు కార్యాలయాల నుంచే పనులు కొనసాగిస్తుండటంతో మాదాపూర్‌, ఐటీకారిడార్‌ ప్రాంతాల్లో సందడి నెలకొంది. దీంతో ఎటుచూసినా ఉదయం 6 గంటల నుంచే రహదారులు వాహనాలతో నిండిపోతున్నాయి.

ఇవిగో అడ్డంకులు.. గ్రేటర్‌ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. మెట్రోరైలు ప్రయాణించే 69 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ పొడవునా, పై వంతెనల కింద భాగంలో పాదచారులు రోడ్డు దాటేందుకు సుమారు 60కు పైగా పెలికాన్‌ సిగ్నల్స్‌ నెలకొల్పారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రధాన ప్రాంతాలు, ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద పోలీసులున్నా గమ్యం చేరేందుకు అధిక సమయం వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లో రహదారులకు ఇరువైపులా నిలిపిన వాహనాలు. అడ్డదారిలో ప్రయాణం, తోపుడుబండ్లు, హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం, వ్యాపార దుకాణాలకు వచ్చే కొనుగోలు దారులు ఆరుబయటే వాహనాలు నిలుపుతున్నారు. పోలీసు అధికారులు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో రహదారుల మరమ్మతులు, డివైడర్లు తదితర ఏర్పాటుపై జీహెచ్‌ఎంసీ, ఆర్‌ అండ్‌ బీ, జాతీయ రహదారుల శాఖలకు ట్రాఫిక్‌ పోలీసులు నివేదిక అందజేశారు. నెలల గడుస్తున్నా.. అధిక శాతం నివేదికలు ఆయా శాఖల వద్దనే ఉండిపోయాయి

బాబోయ్‌ ఐటీ కారిడార్‌.. సైబరాబాద్‌ పరిధిలో కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మియాపూర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, ఐటీకారిడార్‌ ప్రాంతాల్లో నిత్యం రద్దీ వాతావరణం. తాగునీటి ట్యాంకర్లు, ఇసుకలారీలు, భవన వ్యర్థాలను తరలించే టిప్పర్లు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. సైబరాబాద్‌ పరిధిలో ఇటువంటి వాహనాలపై 6 నెలల వ్యవధిలో సుమారు 72,000, అడ్డదారిలో రాకపోకలు సాగించిన వాహనాలపై 35,000లకు పైగా కేసులు నమోదు చేశారు. ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఐటీ కంపెనీల కార్యాలయాలు ప్రారంభమవటంతో రద్దీ పెరిగిందంటున్నారు పోలీసులు.

వాన నీటితో ఆగమాగం.. నగరంలో వర్షమంటే వాహనదారులు హడలెత్తుతారు. మురుగు, వరదనీరు ఉప్పొంగి రహదారులను జలమయం చేస్తాయి. ప్రయాణించే మార్గాల్లో గుంతలు, మ్యాన్‌హోళ్లు, కాల్వలు ఎక్కడున్నాయనేది గమనించడం కష్టమవుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వర్షం కురిసినపుడు 211 ప్రాంతాల్లోని మార్గాల్లో వరదనీరు నిలుస్తుంది. రైల్వే వంతెనలు, ఫ్లై ఓవర్లు, ప్రధాన నాలాలున్న ప్రదేశాల్లో ప్రయాణించడం ప్రాణసంకటమనేది బహిరంగ రహస్యం. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజగిరి, తిరుమలగిరి, పంజాగుట్ట, మారేడుపల్లి, బంజారాహిల్స్‌, చిక్కడపల్లి, సైఫాబాద్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, కాచిగూడ, బహదూర్‌పుర, మాదాపూర్‌, గచ్చిబౌలి మియాపూర్‌ తదితర మార్గాల్లోని 123 చోట్ల అధికంగా వరదనీరు నిలుస్తున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని