logo

పట్టణ ఉద్యానం.. ప్రతిపాదనలకే పరిమితం

పట్టణ ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచే ఉద్దేశంతో ప్రభుత్వం ‘పట్టణ ఉద్యానాలకు (అర్బన్‌ పార్కు) శ్రీకారం చుట్టింది. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటంలేదు.

Updated : 05 Dec 2022 05:45 IST

న్యూస్‌టుడే, పరిగి: పట్టణ ప్రజలకు ఆహ్లాదం, ఆనందం పంచే ఉద్దేశంతో ప్రభుత్వం ‘పట్టణ ఉద్యానాలకు (అర్బన్‌ పార్కు) శ్రీకారం చుట్టింది. ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటంలేదు. ఇందుకు పరిగి నియోజకవర్గంలో చేపట్టిన అర్బన్‌ పార్కునే ఉదాహరణగా చెప్పవచ్చు.

షాద్‌నగర్‌ రూట్లో..

పరిగి మండలంలోని జాఫర్‌పల్లి రిజర్వు ఫారెస్టు విస్తీర్ణం మొత్తం 145 ఎకరాలు ఉండగా అందులో 50 ఎకరాల విస్తీర్ణంలో అటవీ శాఖ అర్బన్‌ పార్కును రెండేళ్ల క్రితం ఏర్పాటు చేయతలపెట్టింది. ఇందుకుగాను అప్పట్లో రూ.1.27కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. 2020లో ప్రత్యేక నివేదికను తయారు చేసిన అటవీశాఖ అధికారులు అప్పటి జిల్లా పాలనాధికారిణి పౌసుమిబసుకు అందజేశారు. దీనికి స్పందించిన పాలనాధికారిణి నివేదిక అందగానే ప్రతిపాదిత ప్రదేశాన్ని మున్సిపల్‌, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. అధికారులు ఎంపిక చేసిన స్థలం పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి పార్కు ఏర్పాటుకు సుముఖం తెలిపారు. పార్కులో పిల్లల క్రీడా పరికరాలు, ఆలయం, ఫౌంటెయిన్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.  ఉపాధిహామీ నిధులు వాడుకోవాలని ఆదేశించారు. మున్సిపల్‌, అటవీశాఖ, పంచాయతీ నిధులతో అభివృద్ధి చేయాలని అనంతరం నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించాలని చెప్పారు.  
పురపాలికగా ఏర్పడినా నియోజకవర్గంలో పూడూరు, దోమ, పరిగి, కుల్కచర్ల, చౌడాపూర్‌ మండలాలు, దాదాపు మూడు లక్షలకు పైగా జనాభా ఉంది. మూడేళ్ల క్రితం పరిగి 15వార్డులు, 18,242 జనాభాతో మున్సిపాలిటీగా మారింది. మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాఫర్‌పల్లి అటవీ ప్రాంతం బాగుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.  

ఆదాయ వనరులకు అవకాశం

సహజసిద్ధంగా ఉన్న అడవిలోనే పార్కును ఏర్పాటు చేయాలని భావించారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేవారు ఇదే దారిలో ప్రయాణిస్తారు. షాద్‌నగర్‌కు కూడా సమీపం కావడంతో సందర్శకులతో కళకళలాడే వీలుంది. ఇటు మున్సిపాలిటీకి అటు స్థానిక పంచాయతీకి ప్రధాన ఆదాయ వనరుగా మారనుంది.


గట్టి ప్రయత్నం చేస్తున్నాం
-కె.మహేష్‌రెడ్డి, ఎమ్మెల్యే

పరిగి ప్రాంతంలో అర్బన్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఈమేరకు ఇప్పటికే ఓసారి అటవీశాఖ మంత్రి దృష్టికి పరిస్థితిని తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని