logo

Manhole: మ్యాన్‌హోళ్లు తెరిస్తే.. క్రిమినల్‌ కేసులే!

కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లను తెరుస్తున్నారు.

Updated : 11 Sep 2023 08:59 IST

వర్షాల నేపథ్యంలో జలమండలి హెచ్చరిక
 22 వేల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీగ్రిల్స్‌ ఏర్పాటు

గిల్స్‌ ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు ఎక్కడ పడితే అక్కడ మ్యాన్‌హోళ్లను తెరుస్తున్నారు. తద్వారా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల నాలాల్లో పడి ప్రాణాలు పోతున్న ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. మ్యాన్‌హోళ్లు తెరిచిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించింది. ‘ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా జలమండలి చట్టం సెక్షన్‌ 74 ప్రకారం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం. నిందితులకు జరిమానాతోపాటు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది’ అని స్పష్టం చేసింది.
వివిధ ప్రాంతాల్లో 22 వేలకుపైగా లోతైన మ్యాన్‌హోళ్లను గుర్తించి ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్‌ బిగించినట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ శనివారం మీడియాకు తెలిపారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(ఈఆర్టీ), మాన్‌సూన్‌ సేఫ్టీ టీమ్‌ (ఎమ్మెస్టీ), సేఫ్టీ ప్రోటోకాల్‌ టీమ్‌ (ఎస్పీటీ) వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
‘ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్‌ మోటార్‌ ఉంటుంది. దీంతో వర్షపు నీటిని తొలగిస్తారు. ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి. వీటితోపాటు ఎయిర్‌టెక్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మ్యాన్‌హోళ్ల నుంచి తీసిన వ్యర్థాల(సిల్ట్‌)ను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు.


  • ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా.. తెరిచి ఉంచినట్లు గమనించినా... లేదా ఇతర సమస్యలు గుర్తిస్తే..జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబరు 155313కి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

  •  కార్మికులకు శిక్షణ పారిశుద్ధ కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో జాగ్రత్తలపై జలమండలి అవగాహన కల్పిస్తోంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని