logo

కాస్త.. నవ్వండి గురూ

‘హ్యాపీ ఇండెక్స్‌’లో భారత్‌ది 126వ స్థానం. మొత్తం 146 దేశాల్లో సర్వే చేస్తే.. మనం చివరి నుంచి 17వ స్థానంలో ఉన్నాం. అదేంటి ఎన్నో ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ మనకంటే మంచి స్థానం(108)లో ఉందే అని ఆశ్చర్యపోకండి. సర్వే అదే చెబుతోంది.

Updated : 24 Mar 2024 07:04 IST

ముఖం బిగబెట్టుకుని పనుల్లోనే నిమగ్నం
ఈనాడు, హైదరాబాద్‌

‘హ్యాపీ ఇండెక్స్‌’లో భారత్‌ది 126వ స్థానం. మొత్తం 146 దేశాల్లో సర్వే చేస్తే.. మనం చివరి నుంచి 17వ స్థానంలో ఉన్నాం. అదేంటి ఎన్నో ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ మనకంటే మంచి స్థానం(108)లో ఉందే అని ఆశ్చర్యపోకండి. సర్వే అదే చెబుతోంది. భారతదేశంలాంటి భిన్న ప్రాంతాలు..వైవిధ్యం ఉన్న దేశాల్లో సంతోషాన్ని కొలవడం కష్టమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చెబుతున్నారు. నేపాల్‌ మనకంటే ఉత్తమంగా ఉండటానికి అక్కడ సంప్రదాయాలనే నమ్ముకుని ఉంటున్నారు. భారత ర్యాంక్‌కు.. మన నగరానికి పెద్ద తేడా ఉండదని పలువురు వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు.

కరోనా వచ్చి కొట్టుకుపోయిన సందడి..: ముషాయిరాలు, సురభినాటకాలు, గజల్స్‌ ఆలాపన, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో నగరం విరాజిల్లేది. నెక్లెస్‌ రోడ్డుకెళ్లినా.. త్యాగరాయగాన సభకు వచ్చినా.. రవీంద్రభారతిలో కూర్చున్నా.. ఇలా నగరంలో ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక కార్యక్రమంతో సందడిగా ఉండేది. కరోనా వచ్చి అన్నిటినీ మూలకు నెట్టింది. ఒకటి రెండేళ్లకు మిగతా రంగాలన్నీ యథాస్థితికి చేరినా.. కళారంగం మాత్రం గాడిన పడలేదు. కళాప్రదర్శనలు జరుగుతున్నా వాటిని తిలకించేవారు కరవయ్యారనేది ఒక విషయం అయితే.. సెల్‌ఫోన్‌ పుణ్యమా అని అరచేతిలో ఆనందం దొరుకుతోందంటున్నారు. సంఘ జీవితానికి దూరంగా ఒంటరిగా మిగులుతున్నాడు.


సంతోషాన్ని కొలవడం కష్టం

నగరం..దేశం..ఎక్కడి పరిస్థితులు గమనించినా సంతోషాన్ని కొలవడం కష్టం. ఒకరికి పుస్తకం చదివితే ఆనందం. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఒకే రోజు నాలుగు ప్లాట్లు అమ్మితే ఆనందం. మంచి విందు ఆరగిస్తే కొందరికి ఆనందం. సామాజిక, ఆర్థిక, వయసుతో ముడిపడి ఆనందానికి కొలమానాలు మారిపోతాయి. సంతోషంలో మొదటి 10 స్థానాల్లో ఉన్నవి చాలా చిన్నదేశాలు. వారి జీవన విధానాలు వేరు. మన జీవన విధానం వేరు.

మామిడి హరికృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకులు


సంతృప్తితోనే ఆనందం

మనిషి ఉన్నదానితో సంతృప్తి చెందాలి. మానసిక ఉల్లాసానికి దోహదపడే కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి. మీతోపాటు.. చుట్టుపక్కల ఆనందకర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఓర్వలేని మనస్తత్వం మానసిక అశాంతికి కారణమౌతుంది. ఆరోగ్యకర జీవన విధానాలు, పుస్తక పఠనం, సంగీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యటనలు చేయడం.. ఇలా వారి మానసిక ఆనందానికి ఏవి దోహదపడుతున్నాయో వాటిని అనుసరిస్తే చాలావరకు ఆనందంగా ఉండగలం. మనసుకు నచ్చిన పనితో ఆనందం సొంతమవుతుంది.

డా. ఎన్‌.ఎన్‌.రాజు, భారత మానసిక వైద్య సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని