logo

సాంకేతిక వినియోగం.. పారదర్శకతే లక్ష్యం

ఎన్నికలంటే ఒకప్పుడు బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లు, ఓటింగ్‌ సామగ్రి..ఇలా పెద్ద తతంగమే ఉండేది. నేడు వీటి స్థానంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్‌లు తదితరాలు అందుబాటులోకి వచ్చాయి.

Published : 10 Apr 2024 01:19 IST

మొదటి దశ ఈవీఎంల యాదృచ్ఛికీకరణ పూర్తి

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: ఎన్నికలంటే ఒకప్పుడు బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లు, ఓటింగ్‌ సామగ్రి..ఇలా పెద్ద తతంగమే ఉండేది. నేడు వీటి స్థానంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్‌లు తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక సౌకర్యాలు పెరిగేకొద్దీ ఎన్నికల నిర్వహణ సులువుగా మారుతోంది. అంతేకాదు అధికారులు రాజకీయ నాయకుల సందేహాలను దూరం చేసేందుకు పలు దఫాల్లో ఈవీఎంల పరిశీలన నిర్వహిస్తున్నారు. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల తొలి దశ యాదృచ్ఛికీకరణ (ర్యాండమైజేషన్‌) ప్రక్రియను ఈనెల 3న నాయకుల సమక్షంలో పూర్తి చేశారు.

తహసీల్దారు కార్యాలయం పక్కనే..: జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను వికారాబాద్‌ తహసీల్దారు కార్యాలయం వద్ద గోదాములో భద్రపరుస్తున్నారు. ఇక్కడి నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తారు. ఇప్పటికే పలు మార్లు వీటిని తనిఖీ చేశారు. ర్యాండమైజేషన్‌ ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ జిల్లా కేంద్రంలో, ఆ తర్వాత నియోజక వర్గ స్థాయిలో, మూడో దశ నియోజక వర్గం పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించే సమయంలో పూర్తి చేస్తారు.

మాక్‌ పోలింగ్‌, ప్రత్యేక వాహనాల్లో తరలింపు: రెండో దశ ర్యాండమైజేషన్‌లో నియోజక వర్గ కేంద్రాలకు వచ్చిన ఈవీఎంలపై బ్యాలెట్లను ముద్రించి సహాయ రిటర్నింగ్‌ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఈ యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది గుర్తించడమే రెండో దశ ర్యాండమైజేషన్‌ ముఖ్య ఉద్దేశం. మూడో దశలో భాగంగా నియోజక వర్గ కేంద్రాల నుంచి ఈవీఎంలను పోలింగ్‌ కేంద్రాలకు కేటాయించే ప్రక్రియను నిర్వహిస్తారు. పోలింగ్‌కు ముందు రోజు ఈవీఎం, వీవీ ప్యాట్‌లను ప్రత్యేక వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు చేరవేస్తారు. ఈవీఎంలను పనితీరుపై ఎలాంటి అనుమానాలున్నా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు, అందరి ఆమోదం తరవాతే పోలింగ్‌కు ఉపయోగిస్తారు.


కేంద్రాల సంఖ్య ఆధారంగా కేటాయింపు

పోలింగ్‌ అనుకూలంగా ఉన్న ఈవీఎంలను జిల్లాలోని నియోజక వర్గాలకు కేటాయించే ప్రక్రియను మొదటి దశ ర్యాండమైజేషన్‌గా పేర్కొంటున్నారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్య ఆధారంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నియోజక వర్గాలకు ఈవీఎంలను కేటాయిస్తారు. పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు నియోజక వర్గాలకు కేటాయించిన ఈవీఎంల బాధ్యత రిటర్నింగ్‌ అధికారులకు అప్పగిస్తారు. ఇటీవలే తొలి ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆయా నియోజక వర్గాల సహాయ రిటర్నింగ్‌ అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

  • జిల్లాలో మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 1133
  • అదనంగా ఏర్పాటు చేసినవి: 15
  • తొలిదశ బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు: 25 శాతం
  • వీవీ ప్యాట్లు: 40 శాతం
  • బ్యాలెట్‌ యూనిట్లు: 2210
  • కంట్రోల్‌ యూనిట్లు: 1637
  • వీవీ ప్యాట్‌లు: 1734
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని